
యమున నదిలో విషం కలుపుతూఉన్నారని అనడం దారుణం: మోదీ
తనతోపాటు దౌత్యవేత్తలు, జడ్జీలు ఈ నీటిని తాగుతున్నారని వెల్లడి
న్యూఢిల్లీ: యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్ నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఆప్ నాయకులకు, చార్లెస్ శోభారాజ్‌కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికికూపంలోనే ఛాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్ కేజ్రీవాల్) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.

యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్ పాపాత్ములను మన్నించే ప్రసక్తే లేదు’’అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment