ఆప్‌.. మళ్లీ స్వీప్‌ | Arvind Kejriwal massive Victory In Delhi Assembly Elections | Sakshi
Sakshi News home page

ఆప్‌.. మళ్లీ స్వీప్‌

Published Wed, Feb 12 2020 2:01 AM | Last Updated on Wed, Feb 12 2020 7:55 AM

Arvind Kejriwal massive Victory In Delhi Assembly Elections - Sakshi

ఢిల్లీ ప్రజలు ‘పని’ రాజకీయానికి పట్టం కట్టారు. విద్వేష వ్యాఖ్యలను, వెకిలి రాజకీయాలను ‘చీపురు’తో ఊడ్చేశారు. అభివృద్ధి వైపే మేమున్నామని ‘నొక్కి’ వక్కాణించారు. సామాన్యుడి కోసం పనిచేసే ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)’ని మరోసారి అందలం ఎక్కించారు. బీజేపీ హై ఓల్టేజీ ప్రచారాన్ని ‘ఒకే ఒక్కడు’గా ఎదుర్కొన్న అరవింద్‌ కేజ్రీవాలే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్‌కు మళ్లీ గుండు సున్నా మార్కులే వేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్‌కు 4.26% ఓట్లు లభించాయి. 2015 ఎన్నికల్లో ఆప్‌ 54.34% ఓట్లు సాధించింది. సీఎంగా కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 14న ప్రమాణంచేస్తారని సమాచారం. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌కు, ఆ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

లోక్‌సభ మీకు.. అసెంబ్లీ ‘ఆప్‌’కు 
దాదాపు 8 నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలకు పూర్తి విరుద్ధమైన తీర్పును ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని 7 స్థానాలనూ బీజేపీ గెల్చింది. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకుంటున్న సందర్భంలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ ఆందోళనలపైనే ప్రచారంలో  దృష్టి పెట్టింది. ఆ ఆందోళనలు పాక్‌ అనుకూల, ఆప్, కాంగ్రెస్‌ ప్రాయోజిత కార్యక్రమాలను ప్రచారం చేసింది. ప్రధాని మోదీ సహా ప్రచారంలో పాల్గొన్న అగ్ర నేతలంతా ఆ ఆందోళనలకు కేంద్ర స్థానంగా నిలిచిన షహీన్‌బాఘ్‌ అంశాన్ని ప్రతీ సభలోనూ ప్రస్తావించారు. కేంద్రం ప్రారంభించిన సంక్షేమ పథకాలను కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలకు అందనివ్వడం లేదని మోదీ ఆరోపించారు కూడా. అయితే, ఢిల్లీ ప్రజలు ఈ అంశాల కన్నా గత ఐదేళ్లలో కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆప్‌ తమకందించిన సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ ఫలితాల ద్వారా అర్థమవుతోంది.

ఆప్‌ చేపట్టిన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ప్రజా రవాణా రంగాల్లో సంస్కరణలు, సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గించే పథకాలు సామాన్యుల మనసు దోచాయి. కేజ్రీవాల్‌ తన ప్రచారంలోనూ ప్రధానంగా గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలనే వివరించారు. కాగా, కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై వ్యతిరేకత కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రమైన షహీన్‌ బాఘ్‌ ఉన్న ఓఖ్లా నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి అమానతుల్లా ఖాన్‌ సమీప బీజేపీ అభ్యర్థిపై 81 వేల అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆప్‌ నుంచి గెలిచిన ప్రముఖుల్లో సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, రాఘవ్‌ చద్ధా, అతిస్థి, గోపాల్‌ రాయ్, సత్యేంద్ర జైన్‌ తదితరులున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌ బీజేపీ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ యాదవ్‌పై గెలుపొందారు.

మూడోసారి సీఎం పీఠంపై.. 
ఈ ఎన్నికల్లో ఘన విజయంతో మూడోసారి సీఎం కుర్చీపై కేజ్రీవాల్‌ కూర్చోబోతున్నారు. తొలిసారి 2013 డిసెంబర్‌ 28న కాంగ్రెస్‌ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  కానీ, 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండి 2014, ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లతో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. బీజేపీ 3 సీట్లలో మాత్రమే గెలుపొందింది.

సంబరాలు..  అభినందనలు 
తాజా విజయంలో ఆప్‌ శ్రేణులు ఢిల్లీ వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నాయి. ఆప్‌ ప్రధాన కార్యాలయాన్ని నీలి, తెలుపు బెలూన్లతో అలంకరించారు. ఈ ఘనవిజయం పట్ల కేజ్రీవాల్‌ను పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌(ఎన్సీపీ), నవీన్‌ పట్నాయక్‌(బీజేడీ), స్టాలిన్‌(డీఎంకే) తదితర నేతలు అభినందనలు తెలిపారు. ఇంతకంటే గొప్ప జన్మదిన బహుమతి ఏముంటుందని మంగళవారం బర్త్‌డే జరుపుకుంటున్న కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ ఆత్మను కాపాడిన ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలని రాజకీయ వ్యూహకర్త, ఈ ఎన్నికల్లో ఆప్‌ విజయం కోసం వ్యూహ రచన చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాం 
ఢిల్లీ ప్రజలిచ్చిన తీర్పును ఆమోదిస్తు న్నామని బీజేపీ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్షంగా బీజేపీ క్రియాశీల పాత్ర పోషిస్తుందన్నారు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించే ఈ తీర్పు ఇచ్చారని బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ వ్యాఖ్యానించారు. తమ ఓటు శాతం 32% నుంచి 38 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. అపజయాన్ని అంగీకరించిన కాంగ్రెస్‌.. పార్టీ పునరుత్తేజానికి పునరంకితం అవుతామని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల విష పూరిత ప్రచారం ఓడిపోయిందని వ్యాఖ్యానించింది.

ఢిల్లీ ప్రజలు ‘పని’ రాజకీయానికి పట్టం కట్టారు. విద్వేష వ్యాఖ్యలను, వెకిలి రాజకీయాలను ‘చీపురు’తో ఊడ్చేశారు. అభివృద్ధి వైపే తామున్నామని ‘నొక్కి’ వక్కాణించారు. సామాన్యుడి కోసం పనిచేసే ‘ఆమ్‌ ఆద్మీ 
పార్టీ(ఆప్‌)’ని మరోసారి అందలమెక్కించారు. బీజేపీ హై ఓల్టేజీ ప్రచారాన్ని ‘ఒకే ఒక్కడు’గా ఎదుర్కొన్న అరవింద్‌ కేజ్రీవాలే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని స్పష్టమైన తీర్పునిచ్చారు.

కేజ్రీవాల్‌.. ఫిబ్రవరి 14!
కేజ్రీవాల్‌ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్‌ది ప్రేమ వివాహం.

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజం!
ఆప్‌ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్‌ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్‌వర్‌‡్షలు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్‌ సర్వే ఆప్‌కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్‌ ఆప్‌కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్‌వర్‌‡్ష అంచనాల ప్రకారం ఆప్‌కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

‘పని రాజకీయం’ పురుడు పోసుకుంది: అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్‌ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్‌ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్‌ ఆఫ్‌ వర్క్స్‌)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఆప్‌నకు, ఆ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌కు అభినందనలు. వారు ఢిల్లీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరకుంటున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

అత్యుత్తమ బర్త్‌డే గిఫ్ట్‌ ఇది: భార్య సునీత

‘అత్యుత్తమ బర్త్‌డే గిఫ్ట్‌ ఇది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు కంటే పెద్ద బహుమతి అడగను’ అని కేజ్రీవాల్‌ భార్య సునీత అన్నారు. ఎన్నికల విడుదల రోజైన మంగళవారమే ఆమె పుట్టిన రోజు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భర్త, కొడుకు, కూతురు సమక్షంలో కేక్‌ కట్‌చేశారు.

కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం జగన్‌ అభినందనలు 
సాక్షి, అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ అద్భుతమైన విజయం సాధించినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు మంగళవారం ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపారు. కేజ్రీవాల్‌ పదవీకాలం అంతా విజయవంతంగా కొనసాగాలని జగన్‌ ఆకాంక్షించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు  
సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్‌ ఆయనకు అభినందన సందేశం పంపారు. కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో మరింత అభివృధ్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజలే కేంద్రంగా ఆలోచించి పాలన చేస్తే ప్రజాభిమానం పొందుతారనడానికి కేజ్రీవాల్‌ విజయం ఓ ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రజలారా.. ఇది అందరి విజయం. నన్ను పెద్ద కొడుకుగా భావించి, ఇంత పెద్ద గెలుపును అందించిన ప్రతీ ఒక్క  కుటుంబం విజయం ఇది. ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం (పాలిటిక్స్‌ ఆఫ్‌ వర్క్స్‌)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు. ఇది దేశానికి ఢిల్లీ అందించిన పవిత్రమైన సందేశం. – అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రజల తీర్పును బీజేపీ అంగీకరిస్తోంది. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది. బీజేపీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఘన విజయం సాధించిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు అభినందనలు. – జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన ఆప్‌కు, కేజ్రీవాల్‌కు నా అభినందనలు.  – రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌నేత

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఢిల్లీలో ఓటర్లు రానున్న ఏళ్లలో జరగనున్న ఎన్నికలకు సరైన మార్గం చూపించారు. విభజించడంతో పాటు ప్రమాదకరమైన ఎజెండాలు ఉన్న పార్టీని ఓడించారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీని ఓడించగలమన్న ధైర్యాన్ని ప్రతిపక్షాలకు ఢిల్లీ ఓటర్లు ఇచ్చారు. – చిదంబరం, కాంగ్రెస్‌ నేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement