అదానీని ఇవాళే అరెస్ట్‌ చేయాలి: రాహుల్‌ గాంధీ | Rahul gandhi Sensational Comments On Modi And Adani | Sakshi
Sakshi News home page

అదానీని రక్షిస్తోంది మోదీనే.. ఇవాళే అరెస్ట్‌ చేయాలి: రాహుల్‌ గాంధీ

Published Thu, Nov 21 2024 1:04 PM | Last Updated on Thu, Nov 21 2024 3:04 PM

Rahul gandhi Sensational Comments On Modi And Adani

ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్‌లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్‌ అదానీని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదని ప్రశ్నించారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. 

సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో భారీ సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్‌ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్‌ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాం. 

ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్‌ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ క‌లిసి ఉంటే.. ఆ ఇద్ద‌రూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్‌. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. 

ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్‌ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్‌ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్‌ మ‌ద‌హ‌బి పురి బుచ్‌ను కూడా విచారించాల‌ని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement