
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా నేడు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరిని ఒకరు అప్యాయంగా పలకరించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ అనూహ్య సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది.
కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దీంతో ఉభయసలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. వాస్తవానికి ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా నేడు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
అయితే సమావేశాల ముగింపుకు ముందు పార్లమెంట్ అవరణలో అనధికారిక టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలతోపాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ చిరునవ్వులు చిందించారు.
ప్రధాని సోఫాలో కూర్చోగా.. ఆయన పక్కనే స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి కుడివైపున కుర్చీపై కూర్చున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌చ కిరణ్ రిజిజు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, పీయూష్ గోయల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమొళి కూడా ఉన్నారు. నేతలంతా ట్లాడుకుంటున్న సమయంలో ఓ సర్వర్ టీ ట్రేతో రావడం కూడా ఈ ఈఫోటోలో కనిపిస్తుంది.
కాగా నిన్నటి మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీ వాతవరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి ప్రత్యర్థి పార్టీల నేతలు పరస్పరం ఎదురెదురుగా కులాసాగా కూర్చొని నవ్వుతూ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment