ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: పొలం గట్టు పంచాయతీ నేపథ్యంలో ఓ యువకుడిని పెద్దనాన్న, సమీప బంధువులు కొట్టి చంపారు. రఘునాధపాలెం మండలంలోని మల్లేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం.. రఘునాధపాలెం మండలంలోని మల్లేపల్లికి చెందిన గండు రామారావు(32)కు, అతని పెద్దనాన్న గండు భూషయ్యకు మధ్య పొలం గట్టు విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. వారిద్దరూ సోమవారం రాత్రి మద్యం మత్తులో గట్టు పంచాయతీ విషయమై ఘర్షణ పడ్డారు. వారిని స్థానికులు విడదీసి ఎవరింటికి వారిని పంపించారు.
రామారావు ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత కొదిసేపటికి.. భూషయ్య, అతని కుమారుడు బాబూరావు, అల్లుడు పొట్టపల్లి ఆసిన్ కలిసి రామారావు ఇంటికి వెళ్లి, ‘గట్టు పంచాయతీ విషయంలో మమ్మలిన ఇష్టమొచ్చినట్టుగా తిడతావా...?’ అంటూ, ఇంటి తలుపులను పగులగొట్టి ఘర్షణకు దిగారు. దీనిపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడేమోనని భావించిన భూషయ్య కుటుంబీకులు రాత్రి పది గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, తమపై (రామారావు) దాడి చేసినట్టుగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వారంతా ఇంటికి బయల్దేరారు.
వారికి మార్గమధ్యలో.. (దసరా ఉత్సవాలకు వెళ్లి వస్తున్న) రామారావు తారసపడ్డాడు. అక్కడ వారి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. భూషయ్య, అతని కుమారుడు బాబూరావు, అల్లుడు ఆసిన్, భార్య సావిత్రి, మరో వ్యక్తి నాగేశ్వరరావు కలిసి రామారావుపై కరల్రతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు అర్ధరాత్రి తర్వాత మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామారావు భార్య రేణుక మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. రామారావు దంపతులకు పదేళ్లలోపు వయసున్న కూతురు, కుమారుడు ఉన్నారు.
వెంటాడుతున్న విషాదం.. రామారావు హత్య జరిగిన సోమవారం రోజున ఆయన భార్య ఇంటి వద్ద లేరు. దసరా పండుగకని ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. రామారావు చిన్నతనంలోనే తల్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. తండ్రి కూడా.. ఖమ్మంలో రైలు ఎక్కుతూ జారిపడి మృతిచెందాడు. ఇప్పుడు రామారావు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
యువకుని హత్య
Published Wed, Oct 9 2013 4:09 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement