సాక్షి, కొత్తగూడెం
పాలకవర్గాలు ఏర్పడినా నిధుల లేమితో పల్లెలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. పలు సమస్యలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లాలోని పంచాయతీల్లో పనులకు రూ.17 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు చూపిస్తున్నా చాలా మంది సర్పంచ్‌ల ఖాతాలో ఈ నిధులు పడలేదు. దీంతో పదవి చేపట్టి ఐదునెలలు కావస్తున్నా సర్పంచ్‌లు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలారు.
జిల్లాలో మొత్తం 758 పంచాయతీలున్నాయి. ఇందులో మోతుగూడెం, కూనవరం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, అశ్వారావుపేట, సారపాక, బూర్గంపాడు, గార్ల, బయ్యారం, వైరా, తల్లాడ, కల్లూరు, పెద్దతండా, నేలకొండపల్లి మేజర్ పంచాయతీలు. కాగా, జిల్లాలో 115 పంచాయతీలకు అసలు సొంత భవనాలే లేవు. దీంతో అద్దెభవనాల్లో పాలకవర్గాల సమావేశాలు సాగుతున్నాయి. అలాగే ఉల్వనూరు, పెనగడప, మర్రిగూడెం, రాయపట్నం, భగవత్‌వీడుతండా పంచాయతీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మరమ్మతుల కోసం రూ. 18 లక్షలు విడుదల చేయాలని జిల్లా నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినా ఇంతవరకు నిధుల ఊసే లేదు. వర్షం వస్తే ఈ భవనాలు జలమయంగా మారుతున్నాయి. సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకార సందర్భంగా వారి ఖర్చుతోనే వీధి దీపాలు వేయించారు. అయితే ఆ డబ్బులు కూడా ఇంతవరకు వారి ఖాతాలో పడలేదు.
దీపాలు పోయినచోట మళ్లీ వేసే దిక్కులేకపోవడంతో పల్లె వీధులు అంధకారంగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ రహదారులు కోతకు గురయ్యాయి. కనీసం వీటిని నిర్మించడానికి కూడా పంచాయతీలకు నిధులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు రూ. 17 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొంటున్నా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. సాంకేతిక సమస్యలు, కొంత మంది సర్పంచ్‌ల ఖాతాల్లో తప్పులు దొర్లడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. పలువురు సర్పంచ్‌లు ఖాతాలో పడిన కొద్ది మొత్తం నిధులతో కేవలం పారిశుధ్య పనులు చేయించేందుకే పరిమితమయ్యారు. మేజర్ పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
పినపాక నియోజకవర్గంలో 52 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. టీఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌సీ నిధులు వచ్చినా వాటితో పెద్దగా అభివృద్ధి పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. నిధుల కొరతతో పినపాక, అశ్వాపురం పంచాయతీల పరిధిలో కనీసం డ్రైనేజీల పూడిక కూడా సర్పంచ్‌లు తీయించలేకపోతున్నారు.
చింతకాని మండల పరిధిలోని బస్వాపురం, చింతకాని, బొప్పారం, జగన్నాథపురం గ్రామాల్లో పంచాయతీ నిధులు సరిపడినన్ని లేక అభివృద్ధిపనులు కుంటుపడుతున్నాయి. ఎర్రుపాలెం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు టీఎఫ్‌సీ నిధులు సర్పంచ్‌ల ఖాతాలో పడలేదు. బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం గ్రామాల్లో పంచాయతీ నిధుల కొరతవల్ల తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సత్తుపల్లి మండలం యాతాలకుంట, రేగళ్లపాడు, పాకలగూడెం పంచాయతీల్లో వర్షాలకు రోడ్లు కోతకు గురయ్యాయి. వీటికి కల్వర్టులు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. నిర్మాణ పనులకు నిధులు విడుదల కాకపోవటంతో సమస్య తీరడం లేదు. బ్లీచింగ్ కొనేందుకు కూడా నిధులు లేకపోవటంతో అనేక పంచాయతీలలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. తల్లాడ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
కొణిజర్ల మండలానికి మంజూరైన నిధులతో పంచాయతీల్లో పారిశుధ్య పనులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొణిజర్లలో సైడ్‌డ్రైన్ పూడిక తీయకపోవడంతో డ్రైనేజి నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. జిల్లా అధికార్లు, మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. ఏన్కూరు పంచాయతీలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన రహదారిని శుభ్రం చేయించకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది.
ఇల్లెందు నియోజకవర్గంలో పలు పంచాయతీల పరిధిలో మంచినీటి పథకాల మోటార్లు కాలిపోయాయి. అయితే వీటికి మరమ్మతులు చేయించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు గ్రామాల్లో ఏరులాపారుతోంది. మేజర్ పంచామతీల్లో సైతం పంచాయతీ నిర్వహణ వంటి ఖర్చులకే జనరల్ ఫండ్ సరిపోతుందని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.
ఖమ్మంరూరల్ మండలంలోని పెద్దతండా మేజర్ పంచాయతీకి నిధులున్నా పాలక వర్గంలో ఉన్న వర్గపోరుతో ఏపని చేయలేని పరిస్థితి నెలకొంది. అదే విధంగా కూసుమంచి పంచాయతీలో కూడా పనులు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. పాలేరు ని యోజ కవర్గ వ్యాప్తంగా 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. కోటికి పైగా మంజూరయ్యాయి. ఈ నిధులు ఖాతాలో పడకపోవడంతో సర్పంచ్‌లు పనులు చేపట్టలేకపోతున్నారు.
కొత్తగూడెం మండలంలోని కారుకొండ, చుంచుపల్లి, రాఘవాపురం పంచాయతీల పరిధిలో డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. తాగునీటి పైపుల్లో కూడా ఈనీరు కలుస్తోందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పంచాయతీలకు సరిపడ నిధులు లేక పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.
రఘునాథపల్లి మండలంలోని చిమ్మపుడి పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. వర్షం వస్తే కార్యాలయంలోని రికార్డులు, ఫర్నీచర్ తడుస్తున్నాయి. శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండడంతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
అశ్వారావుపేట, చండ్రుగొండ పంచాయతీల్లో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వీధులు కంపుకొడుతున్నాయి. భారీ వర్షాలకు శివారు కాలనీలు గుంటలమయంగా మారాయి. అయితే ఉన్న నిధులను శానిటేషన్‌కు వినియోగిస్తుండడంతో ప్రధాన పనులను అసలు సర్పంచ్‌లు పట్టించుకోవడం లేదు.
భద్రాచలం మేజర్ గ్రామపంచాయితీ పరిధిలో అన్ని కాలనీల్లో గోదావరి మంచినీటి సమస్య వేధిస్తోంది. మంచినీటి సమస్యను పరిష్కరించటానికి నిర్మించిన రెండు వాటర్ ట్యాంకులు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. దీంతో పాటుగా కాలనీల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు లేక మట్టిరోడ్లే దర్శనిమిస్తున్నాయి. శివారు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగుగుంటలు ఏర్పడి కాలనీ వాసులు నానాబాధలు పడుతున్నారు.
పడకేసిన పల్లె ప్రగతి
Published Tue, Dec 17 2013 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
Advertisement