ఏకైక గోల్‌తో నెగ్గిన ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 0–1 గోల్ తేడాతో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై జట్టు తరఫున మెహతాబ్ సింగ్ (29వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్‌లో ముంబై జట్టు హైదరాబాద్ గోల్ పోస్ట్‌పై 4 షాట్లు బాదగా... అందులో ఒకటి లక్ష్యాన్ని చేరింది.
హైదరాబాద్ మూడు ప్రయత్నాలు చేసినా ఖాతా తెరవలేకపోయింది. 55 శాతం బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ముంబై చివరకు విజేతగా నిలిచింది. తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు 2 విజయాలు, ఒక ‘డ్రా’, 6 పరాజయాలతో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో ఉండగా... ముంబై జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ‘డ్రా’లు, 2 పరాజయాలతో 13 పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 1–0 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. మోహన్ బగాన్ తరఫున జాసన్ కమింగ్స్ (86వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న మోహన్ బగాన్ జట్టు 20 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది. ఆదివారం ఒడిశా జట్టుతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుండగా... హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment