‘సమైక్య శంఖారావాని’కి పెల్లుబుకుతున్న మద్దతు | Tremendous response from all sections to Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

‘సమైక్య శంఖారావాని’కి పెల్లుబుకుతున్న మద్దతు

Published Wed, Oct 23 2013 2:28 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

‘సమైక్య శంఖారావాని’కి పెల్లుబుకుతున్న మద్దతు - Sakshi

‘సమైక్య శంఖారావాని’కి పెల్లుబుకుతున్న మద్దతు

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో 26న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభకు అన్ని వర్గాల నుంచీ మద్దతు పెల్లుబుకుతోంది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం మొదలుకుని.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఆయా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ‘‘సమైక్యాంధ్ర కోసం ఏ రాజకీయపార్టీ కార్యక్రమాలు చేపట్టినా మద్దతిస్తామని మేం ముందే చెప్పాం. 
 
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకోసం 26వ తేదీన హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో సమైక్య శంఖారావం సభ పెట్టాలని నిర్ణయించింది. ఉద్యోగులంతా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని నిర్ణయించాం’’ అని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ ప్రకటించారు. ‘‘ఉద్యోగులు ఓ స్థాయి వరకే ఉద్యమం చేయగలరు. చట్టసభల్లో పోరాడాల్సింది రాజకీయపక్షాలే. అందుకే మేం సమైక్యాంధ్రకోసం పాటుపడాలని అన్ని రాజకీయ పక్షాల నేతలను కలిసి విన్నవించాం..’’ అని చెప్పారు. ‘‘ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికీ ఫోరం అన్ని రాజకీయపక్షాల నేతల్ని ఆహ్వానించింది. ఇందులో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు చట్టసభల్లో పోరాడాల్సింది రాజకీయపార్టీల నేతలే. అందుకే పార్టీలను ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని మొదట్నుంచీ కోరుతూ వస్తున్నాం. 
 
 26న హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ నిర్వహించే సమైక్య శంఖారావం సభకు సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులంతా ఈ సభలో పాల్గొంటారు’’ అని సచివాలయ సీమాంధ్ర గెజి టెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. సమైక్య శంఖారావం సభకు సంపూర్ణ మద్దతిస్తున్నామని సచివాలయ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. వీరితోపాటు పలువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నా రు. సమైక్య శంఖారావానికి వివిధ జిల్లాల ఉద్యోగుల జేఏసీ లు, కార్మిక సంఘాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి.  
 
 సమైక్యం కోసం పార్టీలన్నీ ఐక్యంగా రావాలి... 
 సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. సమైక్య రాష్ట్రం పరిరక్షణకు జెండాలను పక్కన పెట్టి ఐకమత్యంగా కలసిరావాలని జగన్ రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపును మెడికల్ జేఏసీ స్వాగతిస్తోంది.
 - పి.శ్యామ్‌సుందర్, మెడికల్ జేఏసీ కన్వీనర్, విశాఖపట్నం
 
 ఈ సభ ఢిల్లీని కదిలించాలి... 
 హైదరాబాద్‌లో 26న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతం చేయడానికి ఉద్యోగులు సిద్ధం. ఈ సభ ఢిల్లీని కదిలించాలి. 
 - ఎస్.నాగేశ్వరరెడ్డి, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు, విశాఖపట్నం
 
 సమైక్య శంఖారావాన్ని ఆహ్వానిస్తున్నాం 
 సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం నిర్వహించడాన్ని ఆహ్వానిస్తున్నాం. సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సభలు, సమావేశాలు పెట్టే ప్రతి పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. 
 - కె.ఈశ్వరరావు, ఏపీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు, విశాఖపట్నం
 
 ఆర్‌టీసీ ఉద్యోగుల సంపూర్ణ సహకారం 
 సమైక్యాంధ్ర సాధన కోసం ఆది నుంచీ కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ. ఆ పార్టీ హైదరాబాద్‌లో సమైక్య శ ంఖారావం పూరించడాన్ని ఆహ్వానిస్తున్నాం. పార్టీలకతీతంగా ఏ ఒక్కరు సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఆర్‌టీసీ ఉద్యోగులు పూర్తి సహకారాలు అందిస్తారు.
 - వై.శ్రీనివాసరావు,  ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, విశాఖపట్నం
 
 ప్రజల మనోభావాలకు అనుగుణంగా... 
 సమైక్యాంధ్ర సాధన కోసం ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తాం. మా కార్మిక సంఘం తరపున పూర్తి మద్దతును తెలియజేస్తాం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళన చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది.
 - డి.ఆదినారాయణ,  ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు, విశాఖపట్నం
 
 శంఖారావం అభినందనీయం
 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో సమైక్య భేరిని నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం. ప్రజల మనోభావాలను తెలుసుకొని ప్రభుత్వం సమైక్యాంధ్రపై సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.
 -మంత్రి రాజశేఖర్, జాతీయ ఇంటక్ కార్యదర్శి, విశాఖపట్నం
 
 అందరూ హాజరుకావాలి...
 సమైక్య శంఖారావం సభకు ఎన్‌జీవోలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర విభజన నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతోంది. శంఖారావం సభకు అందరూ హాజరై విజయవ ంతం చేయాల్సిన అవసరం ఉంది.
 - ఎల్.విద్యాసాగర్, అధ్యక్షుడు,  పశ్చిమగోదావరి జిల్లా ఎన్జీవో సంఘం
 
 అన్ని వర్గాల వారూ అశేషంగా తరలిరండి
 సమైక్య శంఖారావానికి ఎన్జీవోలు, రైతులు, విద్యార్థులు హాజరై జయప్రదం చేయూలని కోరుతున్నాం. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో వివిధ  కార్యక్రమాలు చేస్తున్న పార్టీ వైఎస్సార్ సీపీయే. అందరూ రాజధాని తరలి వెళ్లి సమైక్య వాదాన్ని చాటాలి. 
 - ఆర్.ఎస్.హరనాథ్, అధ్యక్షుడు, పే అండ్ అకౌంట్స్ ఎంప్లాయూస్ అసోసియేషన్
 
 సమైక్య శంఖారావం సభకు ప్రజలు వెళతారు
 సమైక్య శంఖారావం సభకు సమైక్య రాష్ట్రం కోరుకునే ప్రజలు వెళతారు. సీమాంధ్రు ల మనోభావాలు గౌరవించకుండా విభజించటం తగదు. సభకు హాజరయ్యే విషయమై ఏపీఎన్‌జీవో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 
 - కత్తి నరసింహారెడ్డి,  రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ), చిత్తూరు
 
 పది వేల మందితో తరలివెళ్తాం
 సమైక్య శంఖారావం బహిరంగ సభకు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు పది వేల మందితో హాజరవుతాం. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు సమైక్య శంఖారావానికి స్వచ్ఛందంగా తరలి రావాలి. సమైక్యాంధ్ర సాధన వైఎస్సార్సీపీతోనే సాధ్యం.
 - క్రిష్టఫర్ దేవకుమార్, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు, అనంతపురం
 
 విజయవంతం చేసే బాధ్యత అందరిదీ..
 సమైక్య శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేసే బాధ్యత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరిపై ఉంది. సమైక్యవాదాన్ని ఢిల్లీకి బలంగా చాటి చెప్పాలంటే ఈ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలి. 
 - వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి, జేఏసీ చైర్మన్, అనంతపురం
 
 సమైక్యవాదులంతా హాజరుకావాలి 
 సమైక్యవాదులందరూ ఈ సభకు హాజరై రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులందరూ హాజరై సభను విజయవంతం చేయాలి.
 - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్‌జీవో సంఘం ప్రధాన కార్యదర్శి 
 
 ఉద్యోగులంతా విజయవంతం చేయాలి 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించనున్న సమైక్య శంఖారావ సభను విజయవంతం చేయాలి.
 - రాజకుమార్, ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
 అధిక సంఖ్యలో హాజరై సమైక్యవాణి వినిపించాలి 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలి. అన్ని వర్గాల ప్రజలూ సభకు హాజరై తమ ఆకాంక్షను తెలియజేయాలి.
 - ఆర్.సి.హెచ్.కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement