విభజన బిల్లు వెనక్కి!
-
కేంద్రానికి రాష్ట్రపతి తిప్పి పంపాలి
-
ఆ మేరకు అసెంబ్లీ తీర్మానం చేయాలి
-
స్పీకర్ నాదెండ్లకు విజయమ్మ నోటీసు
-
10 రోజుల్లోపే చర్చ చేపట్టాలని వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ముసాయిదాను కేంద్ర మంత్రివర్గ పునఃపరిశీలన కోసం వెనక్కి పంపాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తూ శాసనసభ ఒక తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నాయకురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభ నియమావళిలోని 77, 78 నిబంధనల కింద స్పీకర్ మనోహర్‌కు సోమవారం ఆమె నోటీసిచ్చారు. రాష్ట్రపతిని ఉద్దేశించి అసెంబ్లీ చేయాల్సిన తీర్మానం ప్రతిని కూడా దానితో పాటు పొందుపరిచారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణబిల్లు-2013 ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం పునఃపరిశీలనకు పంపాలని రాష్ట్రపతిని కోరుతూ ఈ శాసనసభ తీర్మానం చేస్తోంది.
ఎందుకంటే రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు చర్యలు ప్రారంభించడానికి ముందు, ఏడో షెడ్యూలులో భాగమైన 371డి, 371ఇ అధికరణలను 368వ అధికరణంలో పొందుపరిచిన ప్రక్రియను అనుసరించి తొలగించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కేంద్రానికి రాష్ట్రపతి సూచించాలి. లేని పక్షంలో ఒకటో, నాలుగో షెడ్యూళ్లలోని అంశాలకు మాత్రమే 368 కింద సవరణలు అవసరం లేదని పేర్కొంటున్న నాలుగో అధికరణను ఉల్లంఘించినట్టు అవుతుంది’’ అని విజయమ్మ పేర్కొన్నారు. ఇది ప్రాధాన్యతాంశం గనుక తమ తీర్మానంపై 10 రోజుల్లోపే చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.