సమైక్య తీర్మానానికి అనుమతించండి..
-
లేదా నేరుగా ఓటింగ్ పెట్టండి
-
విభజన బిల్లుపై స్పీకర్‌కు విజయమ్మ వినతి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి మేమిచ్చిన నోటీసుకు సమ్మతించండి. లేదా విభజన బిల్లుపై నేరుగా ఓటింగ్ నిర్వహించండి. అపుడు సభలో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదించడానికి లేదా తిరస్కరిం చడానికి అవకాశం కలుగుతుంది. ఆరంభంలోనే బిల్లుపై మెజారిటీ ప్రజల వ్యతిరేకత, ఆగ్రహం తెలియడానికి ఆస్కారం ఉంటుంది.
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయటానికి అనుమతించండి లేదా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై నేరుగా ఓటింగ్ పెట్టండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినపుడే రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల ఆకాంక్ష ఏమిటో తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. విభజన బిల్లుపై ముందే ఓటింగ్ పెడితే అది ఆమోదం పొందినా లేదా వ్యతిరేకించినా తద్వారా మెజారిటీ ప్రజల ఉద్వేగం, ఆకాంక్ష వెల్లడవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ మెజారిటీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తే దాన్నే రికార్డు చేసి రాష్ట్రపతికి పంపించాలని కోరారు. ఈ విషయంలో శాసనసభ 359 నిబంధన మేరకు స్పీకర్‌కు సర్వాధికారాలు ఉన్నాయని, వీటిలో ఏదనుకుంటే దాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌కు విజయమ్మ రాసిన లేఖ సారాంశమిదీ...
బిల్లును మొత్తంగా తిరస్కరించవచ్చు...
‘‘రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013పై అభిప్రాయాలు తెలపాల్సిందిగా రాష్ట్ర అసెంబ్లీకి పంపారు. గత 57 ఏళ్ల రాష్ట్ర శాసనసభల చరిత్రలో తొలిసారిగా వచ్చిన ఈ తరహా బిల్లుపై ఉభయ సభల్లోనూ అభిప్రాయాలు వెల్లడించడం తప్ప ఇతరత్రా ఎలాంటి అధికారాలు లేవు. ఈ బిల్లును మూజువాణి ఓటు ద్వారా గానీ, ఓటింగ్‌తో గానీ శాసనసభ, మండలి మొత్తంగా తిరస్కరించే అవకాశం ఉంది. శాసనసభలోని 359, 360, శాసనమండలిలోని 326, 327 నిబంధనలను అనుసరించి స్పీకర్‌కు, చైర్మన్‌కు ఆయా అంశాల ప్రాధాన్యతను అనుసరించి తాము సబబు అని భావించే విధంగా ఇలాంటి బిల్లులపై ముందుకు వెళ్లవచ్చు.
ఆ రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ జరగలేదు...
ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినపుడు ఎలాంటి పద్ధతులు అనుసరించారనే అంశంపై స్పీకర్ అధ్యయనం చేశారని సమాచారంగా ఉంది. అక్కడ అనుసరించిన విధానాలు ఇక్కడ సందర్భోచితంగా ఉండవు. ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల విభజన జరిగింది సంబంధిత అసెంబ్లీలు ముందుగానే విభజనను అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన తర్వాతే రాష్ట్రపతి నుంచి అభిప్రాయం కోరుతూ బిల్లులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదు. ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించిన విధానం ఇక్కడ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మనవి చేస్తున్నాం.
కారణాలు, ఉద్దేశాలు లేని బిల్లుపై తొందర ఎందుకు?
రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద ఏర్పాటైన రాష్ట్రాలన్నింటికీ ఒక ప్రాతిపదిక ఉంది. రాష్ట్రాల పునర్విభజన కమిటీ లేదా, జేవీపీ కమిటీ, దార్ కమిటీ, వాంఛూ కమిటీల సిఫారసులను అనుసరించి గానీ, సంబంధిన రాష్ట్రాల నుంచి విభజనకు తీర్మానం అందిన తరువాత గానీ ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా 8.5 కోట్ల మంది ప్రజల జీవితాలకు, వారి ఉపాధికి సంబంధించిన ఇంత ముఖ్యమైన బిల్లును కేంద్ర మంత్రివర్గం సాదా సీదాగా టేబుల్ ఐటమ్‌గా ఆమోదించి పంపినపుడు మనం దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి ఎందుకంత తొందరపాటును ప్రదర్శించాలి? బిల్లు ఉద్దేశాలు గానీ, కారణాలు గానీ లేకుండా క్లాజులకు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు, సమాచారం ఏదీ లేకుండా వచ్చిన దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? ఇది.. మమ్మల్ని తమ ప్రతినిధులుగా ఈ పవిత్ర సభకు పంపిన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కాదా?
స్పీకర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయి...
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ 77, 78 నిబంధనల కింద రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి మేమిచ్చిన నోటీసుకు సమ్మతించండి. లేదా విభజన బిల్లుపై నేరుగా ఓటింగ్ నిర్వహించండి. అపుడు సభలో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆరంభంలోనే బిల్లుపై మెజారిటీ ప్రజల వ్యతిరేకత, ఆగ్రహం తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మెజారిటీ సభ్యులు రాష్ట్ర విభజనకు అంగీకరించకపోతే దానినే రికార్డు చేసి రాష్ట్రపతికి బిల్లును తిప్పిపంపండి. 359 నిబంధన కింద స్పీకర్ తాను సముచితం అనుకున్న తీరులో వ్యవహరించటానికి విచక్షణాధికారాలున్నాయి. ఇక్కడ మా ప్రయత్నమల్లా మెజారిటీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడానికే అన్నది మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను.’’