కేశవ్ తన వైఖరి ఎందుకు మార్చుకున్నారో?
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అసెంబ్లీలో వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శాసనసభ వాయిదా అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ విభజన బిల్లుపై ముందు ఓటింగ్... ఆతర్వాతే చర్చ జరగాలన్నదే తమ అభిప్రాయమన్నారు. దీనిపై వెనక్కి తగ్గేది లేదని భూమన స్పష్టం చేశారు.
విభజన బిల్లుపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఇదే మాట మాట్లాడి... తన వైఖరి ఎందుకు మార్చుకున్నారో చెప్పాలని భూమన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల గతంలో మాట్లాడిన వ్యాఖ్యలను....వచ్చిన కథనాలను మీడియాకు చూపారు. బిల్లుపై ఓటింగ్ జరిగేంతవరకూ వైఎస్ఆర్ సీపీ ఒత్తిడి చేస్తూనే ఉంటుందని భూమన స్పష్టం చేశారు. క్షణక్షణానికి అభిప్రాయం మార్చుకోవటం టీడీపీ నైజం అని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో ఓటింగ్కు పట్టుపడతామని భూమన తెలిపారు.