Published
Sat, Jan 11 2014 2:18 AM
| Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
...అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెబుతా: దిగ్విజయ్
ఓటింగ్ ఉండదని ఎప్పుడూ అనలేదు
సాక్షి, న్యూఢిల్లీ: టీ-బిల్లుపై ఓటింగ్ ఉండదని తానెప్పుడూ అనలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. అలా అని ఉంటే అసెంబ్లీకి వచ్చి క్షమాపణలు చెబుతానన్నారు. బిల్లుపై ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నానన్నారు. బిల్లుపై సభ్యులు అభిప్రాయం మాత్రమే చెప్పాలని, ఆమోదించడానికో, తిరస్కరించడానికో బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపలేదని ఆయన గురువారం వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై వివాదం తలెత్తడంతో శుక్రవారం వివరణ ఇచ్చారు. ‘‘నేనెప్పుడూ బిల్లుపై ఓటింగ్ ఉండదని చెప్పలేదు. నా వైపు తప్పుంటే ఆ నోటీసుపై అసెంబ్లీకి వచ్చి వివరణ ఇస్తా. క్షమాపణ కోరతా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిని నేను. బిల్లుపై ఓటింగ్ జరగాలనే కోరుకుంటున్నా’’ అని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానంకోసం పట్టుబడుతున్నారు కదా అని అడగ్గా ‘‘జగన్ యువకుడు. ఆయన చట్టసభల, ప్రజాప్రతినిధుల పని తీరును అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో చర్చలో పాల్గొనని పక్షంలో అభిప్రాయం చెప్పే అవకాశం కోల్పోతారు’’ అని అన్నారు.