సమైక్య ఉద్యమం తగ్గిపోతోంది: దిగ్విజయ్
* ఏపీఎన్జీవోలు కూడా సమ్మె విరమించాలని కోరుతున్నా
* అన్ని పార్టీలూ సహకరిస్తే వచ్చే ఎన్నికల్లోపే తెలంగాణ
* శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు యత్నిస్తున్నాం
* అసెంబ్లీకి తీర్మానం పంపడంపై షిండేతో మాట్లాడాక స్పందిస్తా
* హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని నాడు పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు చెప్పారు
* రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన లేదు.. విభజనకు ఆయన సహకరిస్తారని భావిస్తున్నా
* టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సీమాంధ్రలో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అక్కడ ఉద్యమాలు తగ్గుముఖం పట్టాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవోలూ సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌లో ఇతర రాజకీయ పార్టీలన్నీ సహకరిస్తే 2014 ఎన్నికల్లోపే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందనే ఆశాభావాన్ని దిగ్విజయ్ వ్యక్తం చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మరో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తీర్మానంపై ఇంకా ఏమీ చెప్పలేం..
రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని, ఆ తర్వాత తెలంగాణ బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపుతామని గతంలో పలుమార్లు ప్రకటించిన దిగ్విజయ్‌సింగ్ తాజాగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో మాట్లాడేంతవరకూ తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో తెలంగాణ అంశంపై ఒక్కసారి మాత్రమే, అది కూడా బిల్లుపై మాత్రమే చర్చ జరుగుతుందన్న హోం మంత్రి ప్రకటనను ప్రస్తావించినప్పుడు.. ‘‘హోంశాఖ తొలి ప్రతిపాదన ప్రకారం తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వెళ్లాలి. అయితే ఇప్పటి పరిస్థితి తెలియదు. ప్రస్తుతం తీర్మానాన్ని అసెంబ్లీకి పంపే విషయమై కేంద్ర హోంమంత్రితో మాట్లాడుతా. ఆతర్వాతే దీనిపై స్పందిస్తా’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. తెలంగాణ అంశం రాష్ట్ర శాసనసభలో రెండుసార్లు చర్చకు రాకపోవచ్చునని సూత్రప్రాయంగా అంగీకరించారు.
సీమాంధ్ర నేతలందరూ కట్టుబడి ఉంటామన్నారు
రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని దిగ్విజయ్ అన్నారు. సీఎం కిరణ్ సమైక్యవాదాన్ని వినిపిస్తుండడంలో తప్పేమీ లేదని అన్నారు. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్‌వాదిగా విభజనకు కూడా ఆయన సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయానికి ముందు సీమాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ సంప్రదించామని, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తనకు తెలియదని ఆయన అన్నారు.
బాబుకు విశ్వసనీయత లేదు
కాంగ్రెస్‌పార్టీ రాజకీయ లబ్ధికోసమే విభజన నిర్ణయం తీసుకొందన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణను ప్రస్తావించగా.. తెలంగాణ అంశంపై పదేపదే మాట మారుస్తున్న ఆయన వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని, ఆ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదనేదీ రాలేదని ఆయన వివరించారు. టీఆర్‌ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే విలీనంపై ఆలోచిస్తామన్నారు.
ఆంటోనీ అనారోగ్యం నుంచి కోలుకున్నాక కమిటీ భేటీ అవుతుందని, తాను వచ్చేవారం ఆంటోనీతో భేటీ అవుతానని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం విభజన నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. విభజనపై సీమాంధ్ర ప్రజల్ని ఒప్పించడానికి సాధ్యమైనంత కృషి చేస్తాను. ఉద్యోగ, వైద్య, విద్య అంశాలపై భద్రతకు భరోసా ఇస్తాం. జలవనరులతోసహా అన్ని అంశాల్ని పరిశీలిస్తాం. రాజీనామాలు చేసిన ఎంపీలతో మాట్లాడుతున్నాం’’ అని ఆయన చెప్పారు.
పీసీసీ సమన్వయ కమిటీ భేటీ వాయిదా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశాన్ని తుపాను కారణంగా వాయిదా వేసినట్టు దిగ్విజయ్ తెలిపారు. సమావేశం మళ్లీ ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్నకు ఆయన జవాబివ్వలేదు. ప్రాంతాలనే విభజించమన్నాం కానీ ప్రజలను కాదంటూ బీజేపీ చేసిన విమర్శలను గుర్తుచేయగా.. ‘‘ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు. అందరూ లేఖలు ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నాం’’ అని బదులిచ్చారు.
బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్.. ప్రధానినుద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించగా దిగ్విజయ్ బదులిస్తూ.. ఆయన(పరేఖ్) ఏం చెప్పదలుచుకున్నా సీబీఐ ముందు చెప్పుకోవాలని సలహా ఇచ్చారు. బొగ్గు గనుల కేటాయింపులపై బీజేపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. బొగ్గు కేటాయింపుల్లో ఎన్డీఏ విధానాల్నే యూపీఏ అనుసరించిందన్నారు.