ఢిల్లీ నాటకం.. చర్చ బూటకం
-
విభజన బిల్లుపై ఢిల్లీ కనుసన్నల్లో సరికొత్త నాటకీయ మలుపు
-
సవరణలు, ఓటింగ్ ప్రతిపాదనలకు తెలంగాణ నేతల అభ్యంతరం
-
బిల్లుపై ఓటింగ్ పెడితే సభను అడ్డుకుంటామని స్పీకర్‌కు స్పష్టీకరణ
-
పలు దఫాలుగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల భేటీలు, చర్చలు
-
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై విశ్లేషణ.. న్యాయనిపుణులతో మంతనాలు
-
ఓటింగ్ ఉంటుందంటేనే చర్చకు ఒప్పుకున్నామన్న సీమాంధ్ర నేతలు
-
చర్చ జరగకుండా అడ్డుకోవటమే టీ-నేతల లక్ష్యంలా ఉందని విమర్శ
-
పార్టీలన్నీ చర్చకు అంగీకరించి... స్పీకర్‌కు సహకరించాలన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ వివాదం సరికొత్త నాటకీయ మలుపు తిరిగింది. బిల్లుపై చర్చ, బిల్లుకు సవరణల ప్రతిపాదన, వాటిపై ఓటింగ్ విషయంలో మంగళవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలని, బిల్లుకు సవరణలు ప్రతిపాదించి ఓటింగ్ జరపాలని ఒకవైపు కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర నేతలు పట్టుపడుతున్నారు. అందుకు అంగీకరించిన తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా స్వరం మార్చారు. సభలో బిల్లుపై చర్చ జరగాలి కానీ సవరణలు, ఓటింగ్ ప్రసక్తి వద్దేవద్దంటూ స్పీకర్‌ను కలసి అభ్యంతరం చెప్పారు. దానికి ముందు.. కాంగ్రెస్ తెలంగాణ నాయకులంతా పలుమార్లు విడివిడిగా భేటీలు జరిపారు. అందులోకి టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులనూ చేర్చుకున్నారు. న్యాయనిపుణులతోనూ మంతనాలు జరిపారు. బిల్లుకు సవరణలు, వాటిపై ఓటింగ్ జరిగే పక్షంలో సభను అడ్డుకోవాలని నిర్ణయించారు.
తెలంగాణ నేతల నిర్ణయంపై కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ధ్వజమెత్తారు. బిల్లుకు సవరణలు, వాటిపై ఓటింగ్ కోరే హక్కు ఉందంటేనే తాము చర్చకు సిద్ధమయ్యామని.. అందుకు అంగీకరించిన తెలంగాణ నేతలు ఇప్పుడు మోకాలడ్డితే ఎలాగని మండిపడ్డారు. ఇంకోవైపు స్పీకర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బిల్లుకు సవరణలు ప్రతిపాదించి, ఓటింగ్ కోరే హక్కు సభ్యులకు ఉంటుందని, దానిని కాదనలేమని వ్యాఖ్యానించారు. ఈ నాటకీయ పరిణామాలతో ‘బిల్లు చర్చ’ ఒక్కసారిగా వేడందుకుంది. అయితే.. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం నడిపిస్తున్న హైడ్రామాలోని మరో అంకం తప్ప మరేమీ లేదని రాజకీయ పరిశీలకులతో పాటు, సమైక్యానికి కట్టుబడ్డ సామాజిక రంగ ప్రముఖులు స్పష్టంచేస్తున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుకు సవరణలు ప్రతిపాదించి, వాటిపై ఓటింగ్ పెట్టి ఓడించటం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చటం కోసమే.. ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలను రంగంలోకి దించారని వారు చెప్తున్నారు.
అసెంబ్లీలో బిల్లుకు సవరణలు ప్రతిపాదించి, ఓటింగ్ నిర్వహిస్తే ఏదో అయిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఓటింగ్‌కు గట్టిగా అభ్యంతరం చెప్పటం ద్వారా.. పార్టీ సీమాంధ్ర నేతల ప్రచారానికి సాయం చేయటమే ఈ కొత్త ఎత్తుగడలో భాగమని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రాంత నేతల నుంచి ఇటువంటి స్పందనను చూపటం ద్వారా.. సీమాంధ్రలో తాము విభజనను అడ్డుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, అసెంబ్లీలో బిల్లును ‘ఓడించి’ పంపిస్తామని మరింత బలంగా ప్రచారం చేసుకోవచ్చన్నది ఢిల్లీ పెద్దల వ్యూహంగా పరిశీలకులు చెప్తున్నారు. అసలు.. అసెంబ్లీలో చర్చించే బిల్లుకు సవరణలు ప్రతిపాదించటం అంటే.. ముందు ఆ బిల్లును సాంకేతికంగా అంగీకరించినట్లే అవుతుందనే విషయాన్ని సమైక్యవాద ప్రముఖులు గుర్తుచేస్తున్నారు. అలా అంగీకరించిన బిల్లుకు సవరణలు ప్రతిపాదించి, వాటిపై ఓటింగ్ నిర్వహించటమన్నా కూడా.. ఆ సవరణలతో పాటు బిల్లును కూడా ఆమోదించటమే అవుతుందని స్పష్టంచేస్తున్నారు. ఇదంతా మరుగునపెట్టి.. ప్రజలను మభ్యపెడుతూ విభజన బిల్లును సాఫీగా గట్టెక్కించటంతో పాటు.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీ ప్రయోజనాలను నిలబెట్టుకోవటానికి ఢిల్లీ కనుసన్నల్లో డ్రామా నడిపిస్తున్నారని.. ఈ నాటకంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ భాగస్వామిగా ఉండగా.. తాజా ట్రాప్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ తదితర రాజకీయ పార్టీల నాయకులూ పడిపోయారని వారు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటివరకూ.. అసలు ముందు సభలో సమైక్య తీర్మానం చేసిన తర్వాతే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టం.. బిల్లుపై చర్చ జరగాలని తెలంగాణ నేతలు, జరపటానికి వీలులేదని సీమాంధ్ర నేతల డిమాండ్ల మధ్య గత కొంత కాలంగా శాసనసభ ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదాల పర్వంగా సాగుతున్న విషయం తెలిసిందే. బిల్లుపై చర్చలో పాల్గొంటామని, బిల్లుకు సవరణలు ప్రతిపాదించి, వాటిపై ఓటింగ్ కోరతామని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు చెప్తుండగా.. అందుకు తెలంగాణ నేతలు కూడా తాజాగా అంగీకరించారు. ఈ మేరకు.. బిల్లులోని అంశాలపై శాసనసభ్యులు ఈ నెల 10 లోగా సవరణలను ప్రతిపాదించాలని.. వాటిని ఎందుకు ప్రతిపాదిస్తున్నారనేది ఒక ఫార్మాట్ ప్రకారం అందజేయాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా శాసనసభలో ప్రకటించారు. దానికి కొనసాగింపుగా.. వివిధ క్లాజులపై ప్రతిపాదించిన సవరణలపై డివిజన్ కోరితే ఓటింగ్ నిర్వహించక తప్పదని మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం పలుదఫాలుగా సమావేశమై మంతనాలు సాగించారు. టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐల ఎమ్మెల్యేలూ ఈ భేటీల్లో పాలుపంచుకున్నారు.
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్తూనే.. శాసనసభ నిర్ణయం తీసుకున్న తర్వాత పిటిషనర్ తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చంటూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలు తదితర అంశాలపై చర్చించారు. న్యాయనిపుణులనూ సంప్రదించారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్‌ను అంగీకరించరాదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇంతకుముందు.. తాము కూడా విభజన బిల్లులో పలు సవరణలు ప్రతిపాదించాలని భావించిన తెలంగాణ నేతలు ఇప్పుడు అలా ప్రత్యేకంగా సవరణలు కోరకుండా చర్చ సందర్భంగా తమ అభిప్రాయాల్లోనే వాటిని వెలిబుచ్చాలన్న నిర్ణయానికి వచ్చారు. విభజన బిల్లుపై సభ అభిప్రాయాల వరకే పరిమితం కావాలని స్పీకర్‌ను కలిసి డిమాండ్ చేశారు. విభజన నిర్ణయంపై ఏకాభిప్రాయమే లేనప్పుడు.. బిల్లుకు సవరణలను ప్రతిపాదించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఒకవేళ ఓటింగ్‌కు సిద్ధపడే పక్షంలో సభను జరగనివ్వరాదన్న నిర్ణయానికి తెలంగాణ నేతలు వచ్చారు. తెలంగాణ నేతల తాజా వైఖరిపై సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు మండిపడ్డారు.
విభజనకు తాము వ్యతిరేకమైనప్పటికీ.. బిల్లులోని క్లాజులకు సవరణల పేరుతో ఓటింగ్ కోరే హక్కు సభ్యులకు ఉంటుందని చెప్పినందువల్లే తాము చర్చకు సిద్ధమయ్యామని సీమాంధ్ర మంత్రులు పేర్కొన్నారు. విభజనపై చర్చ జరగాలని, ఎవరెన్ని అభిప్రాయాలు చెప్పుకున్నా, సవరణలను ప్రతిపాదించినా అభ్యంతరం లేదని చెప్పిన నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ నేతల తీరు చూస్తుంటే సభలో చర్చ జరగకూడదనే భావనతో ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇదిలావుంటే.. ‘మేం చర్చకు నూటికి నూరుశాతం సిద్ధంగా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలూ చర్చకు అంగీకరించి శాసనసభ స్పీకర్‌కు పూర్తిగా సహకరించాల’ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.