ఓటింగ్ జరుగుతుందా?
►నేడు రాజ్యసభకు హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు
►కేవీపీ బిల్లుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభలో మరోసారి వేడిపుట్టించనుంది. ఈ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. కేవీపీ బిల్లుపై చర్చ ముగియడంతో పాటు కేంద్ర మంత్రి జవాబు కూడా ఇచ్చారు. ఈ బిల్లుపై ఓటింగ్‌కు కేవీపీ పట్టుబట్టడంతో అప్పట్లో కోరం లేక వాయిదా పడింది. గతవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కేవీపీ బిల్లును ద్రవ్య బిల్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల్లీ పేర్కొన్నారు. ద్రవ్య బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు రాజ్యాంగ పరమైన అవరోధాలున్నాయని జైట్లీ చెప్పారు.
అయితే ఈ బిల్లును ద్రవ్య బిల్లుగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రభుత్వం ప్రకటించవచ్చునని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ గురువారం చెప్పారు. ప్రభుత్వం ఈ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించే పక్షంలో ఓటింగ్‌కు అనుమతి లభించకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని కేవీపీ కూడా స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగ పరంగా ప్రభుత్వం వద్ద వాదన ఉందని, వాస్తవానికి ఈ బిల్లు సభ ముందుకు వచ్చినప్పుడు ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత చైర్ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ గత వారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.