
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదించిన ఈ బిల్లును ప్రధాని కార్యాలయం నిన్న సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి పంపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి పరిశీలించిన తరువాత ఈ ఉదయం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదించడంతో బిల్లుకు సంబంధించి ఒక దశ ముగిసినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడినందున బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఇదిలా ఉండగా, బిల్లుపై సభలో చర్చించవలసిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బిల్లు సభలో ప్రవేశపెట్టే విషయమై రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్‌జైట్లీతో కమల్‌నాథ్ చర్చలు జరిపారు. బిల్లు విషయం చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్నాథ్, జైరామ్ రమేష్ సమావేశమయ్యారు.
ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా తొందరపడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం నేతలు ముందు చెప్పన ప్రకారం ఈ నెల 12న అంటే ఎల్లుండి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రవేశపెట్టనున్నారు.