
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాకిచ్చింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ షాపై రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇచ్చారు.
నోటీసు ఇచ్చిన అనంతరం డెరెక్ ఒబ్రియెన్ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను తక్కువ చేయడమే కాకుండా సభా మర్యాదను తగ్గించాయన్నారు. సభా మర్యాదను కించపరిచినందుకు షా పై చర్య తీసుకోవాలని ఒబ్రియెన్ కోరారు.
అమిత్ షా రాజీనామా చేయాలి:కాంగ్రెస్
అంబేద్కర్‌పై చేసినవ్యాఖ్యలకు గాను అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం(డిసెంబర్ 18) పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయడమే కాకుండా దేశ ప్రజలకు షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.