- ఓటింగ్‌కు పట్టుబట్టిన సభ్యులు
- మార్షల్స్ సాయంతో గెంటివేత
- తీవ్రంగా వ్యతిరేకించిన సభ్యులు
15 మంది ఎమ్మెల్యేలపై వేటు
Published Fri, Jan 10 2014 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై ఓటింగ్ అంశంపై అసెంబ్లీ గురువారం ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 12.20కి తిరిగి సమావేశం కాగానే ఓటింగ్ కోసం పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఓటింగ్ జరగకుండా చర్చను మొదలు పెడితే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని వారు సభ దృష్టికి తేవడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. చర్చకు అంగీకరించాలని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించగా వైఎస్సార్‌సీపీ సభ్యులు అంగీకరించలేదు. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ సూచన మేరకు 15 మంది సభ్యులను సభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. అమరనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబురావు, టి.బాలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బి.గుర్నాథరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కె.శ్రీనివాసులు, ధర్మాన కృష్ణదాస్, పి.రామకృష్ణారెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, సుచరిత, కాపు రామచంద్రారెడ్డి, కె.వెంకట్రామిరెడ్డిలను ఒక రోజు సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లాల్సిందిగా స్పీకర్ సూచించగా వారు అక్కడే ఉండి నిరసనను కొనగించారు. దాంతో మార్షల్స్‌ను సభలోకి పిలిపించి బలవంతంగా బయటకు పంపించారు. ఒక్కో సభ్యుడిని మార్షల్స్ ఎత్తుకుని బయటకు తీసుకెళ్తుండగా వారు సమైక్య నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యులపై సస్పెన్షన్‌ను తొలగించాలని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సభలో సూచించారు. వారి అరెస్ట్ సరికాదని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు చర్చల్లో పాల్గొనేలా చూడాలని కోరారు. సభలో పలు అంశాలపై ఓటింగ్ జరిగితే అందులో వారు పాల్గొనాలని సూచించారు.
బాబూ స్పందించారు!: ఇదే అంశంపై చంద్రబాబూ స్పందించారు. ధూళిపాళ్ల వ్యాఖ్యలపట్ల ముందు ఆనం స్పందిస్తూ, వైఎస్సార్‌సీపీ సభ్యులను తాము కావాలని బహిష్కరించలేదన్నారు. ‘ఈ విషయంలో మీరిద్దరూ కవలల్లా వ్యవహరిస్తున్నారు’ అని టీడీపీని విమర్శించారు. దాంతో బాబు జోక్యం చేసుకున్నారు. ధూళిపాళ్ల వ్యాఖ్యలను వక్రీకరించొద్దని, సస్పెండ్ చేశాక మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ సభ్యులను అడ్డుకోవడం తప్పన్నదే తమ ఉద్దేశమన్నారు. అయితే బయట జరిగిన అరెస్టు గురించి తాము మాట్లాడలేదని, సభలో జరిగిన అంశంపైనే మాట్లాడామని అన్నారు.
Advertisement
Advertisement