హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్కు అఫిడవిట్లు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభ్యులు రెండు పేజీల అఫిడవిట్లు సిద్ధం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ పలు కారణాలను ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ సిపి అటు లోక్సభలోనూ, ఇటు శాసనసభలోనూ రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. అవిశ్వాసంపై చర్చ జరగాలని వైఎస్ఆర్ సిపి సభ్యులు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో స్పీకర్ రెండు రోజుల ముందుగానే లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ సిపి సభ్యులతోపాటు ఇతర సభ్యుల ఆందోళనతో శాసనసభను రేపటికి వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా, విభజన బిల్లులోని అంశాలపై సమగ్ర సమాచారం లేకుండా చర్చ ఎలా జరుపుతారంటూ వైఎస్ఆర్ సిఎల్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్కు లేఖ రాసింది.