'సమైక్య వాణిని ఢిల్లీకి వినిపిస్తాం'
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలనే మెజారిటీ ప్రజల బలీయమైన ఆకాంక్షను చాటిచెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలి వచ్చారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా... ఏ మాత్రం లెక్క చేయని వారు హైదరాబాద్ చేరుకున్నారు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి సభ జరగనున్నా... సమైక్యవాదులు మాత్రం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. సమైక్యవాదులతో సభా ప్రాంగణం సందడిగా మారింది. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే శాశ్వత నష్టాన్ని నిరోధించే లక్ష్యంతో తాత్కాలిక ఇబ్బందులను అధిగమించి వివిధ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నందున.. భారీ వర్షాలు, వరదలతో తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా నష్టాలొచ్చినా లెక్కచేయకుండా సమైక్య శంఖారావానికి తరలి వచ్చినట్లు సమైక్యవాదులు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం భగ్నమైతే రాబోయే తరాల భవిష్యత్తుకు భరోసా ఏదీ? సీమాంధ్ర తాగునీరు, సాగునీటికి భద్రత ఏదీ? అంటూ ఎల్లెడలా వ్యక్తమవుతున్న ఆవేదనను ఢిల్లీకి వినిపించి తీరుతామని వారు తెలిపారు.
భారీ వర్షాలూ వరదల్లోనూ చెదరని సంకల్పంతో.. ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా సమైక్య లక్ష్యం సాధించాల్సిందేనని అకుంఠిత దీక్షతో తరలి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో సమైక్య వాణిని ఢిల్లీకి వినిపించడానికి ఇదొక్కటే సరైన వేదిక అని ప్రజలు తెలిపారు.
ఇక శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సజావుగా, శాంతియుతంగా సభను నిర్వహించడానికి పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సభ నిర్వహణకు సంబంధించి పలుమార్లు ముఖ్య నేతలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న ఎల్‌బీ స్టేడియానికి హైదరాబాద్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణంగా నామకరణం చేశారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదికకు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలంటూ ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు.
ఎనభై అడుగుల వేదిక
పార్టీ ముఖ్య నేతలు ఆసీనులు కావడానికి 80 అడుగుల వెడల్పు, 44 అడుగుల పొడవైన వేదికను ఏర్పాటుచేశారు. ఈ వేదికపై పదహారు అడుగుల ఎత్తై ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పటం, తెలుగుతల్లి విగ్రహం, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిల చిత్రాలను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభను దగ్గరి నుంచి తిలకించడానికి వీలుగా ప్రాంగణంలో నాలుగు అతి పెద్ద ఎల్‌సీడీలను ఏర్పాటు చేయటం జరిగింది.
|
స్టేడియం బయట కూడా వీక్షకుల సౌకర్యం కోసం మరో నాలుగు మొబైల్ ఎల్‌సీడీలను కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణమైన ఎల్‌బీ స్టేడియంను నిన్న శాసనసభలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు జూపూడి ప్రభాకరరావు, వై.వి.సుబ్బారెడ్డి, మూలింటి మారెప్ప, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు