సాక్షి, ఏలూరు :
‘పశ్చిమ’ రైతులను ఖరీఫ్‌లోనూ కష్టా లు వదలడం లేదు. సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడం.. తగినంత వర్షపాతం నమోదైనా అదునులో కురవకపోవడం.. తెగుళ్లు, ఎలుకల బెడద వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను తాజాగా ఎరువుల ధరలు బెంబేలెత్తిస్తున్నారుు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుచెప్పి విక్రేతలు ఎరువుల ధరల్ని పెంచేశారు. ఏటా భారీగా పెరుగుతున్న ధరలు రైతుకు భారంగా మారుతుంటే.. తాజాగా సమైక్య ఉద్యమం కారణంగా రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయంటూ ఆ భారాన్ని కూడా రైతుల నెత్తిమీదే వేస్తున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటం వ్యాపారులకు కలిసొచ్చింది. మరోవైపు అధిక ధర చెల్లించి ఎరువులు కొనలేక రైతులు వాటి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఫలితంగా వరిపైర్ల ఎదుగుదలమందగిస్తోంది. మరోవైపు పంటలపై చీడపీడలు విజృంభిస్తున్నాయి. వీటివల్ల దిగుబడి తగ్గిపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
బస్తాకు రూ.50 నుంచి రూ.100 అదనం
జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఖరీఫ్ కాలానికి 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. అంతకంటే ఎక్కువగానే ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ముందునుంచీ చెబుతున్నారు. కానీ వాటిని కొనాలంటే మాత్రం రైతులు భయపడుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రెండు నెలలుగా ప్రజలు ఉద్యమం చేస్తుండగా, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఎరువుల విక్రేతలు ధరలు పెంచేశారు. రవాణా చేయడం చాలా కష్టంగా ఉందని, ఎరువులు కావాలంటే ఆ ఖర్చు భరించక తప్పదని రైతులకు చెబుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పులు చేసి కొందరు అధిక ధరకే ఎరువులు కొంటుంటే, మరికొందరు గత్యంతరం లేక వాటి వాడకాన్ని తగ్గిస్తున్నారు.
ఏటా పెరుగుతున్న ధరలు
పరిస్థితులతో సంబంధం లేకుండా ఏటా ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నారుు. నాలుగేళ్ల క్రితం రూ.250 ఉన్న యూరియా ధర 2010 ఖరీఫ్‌లో రూ.275కి చేరింది. 2011 నాటికి రూ.278కి, 2012కి రూ.281కి ధర పెరిగింది. డీఏపీ 2010లో రూ.485 నుంచి రూ.571కు, 2011లో రూ.624కు, 2012లో రూ.950కు పెరిగిపోయింది. ఇదే కొన్ని కంపెనీలు రూ.1260కి అమ్ముతున్నాయి. ఇలా ప్రతి ఎరువు ధర గతంతో పొంతన లేకుండా పెరిగిపోయింది. ఈసారి సమైక్యాంధ్ర కోసం వ్యవసాయ శాఖ ఉద్యోగులు సమ్మె చేయడం కూడా ఎరువుల వ్యాపారులకు అనుకూలంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతుల నుంచి ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్నారు.
ఎరువు.. బరువు
Published Sat, Sep 28 2013 12:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement