khariff
-
రైతు నెత్తిన పిడుగు
యూరియా ధర మెట్రిక్ టన్నుకు రూ. 350ల పెంపు ఏటా జిల్లా రైతాంగంపై రూ. 12.24 కోట్ల అదనపు భారం ఆందోళన చెందుతున్న రైతులు, రైతుసంఘాల నాయకులు సత్తెనపల్లి, న్యూస్‌లైన్: ఎడాపెడా పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇప్పటికే సతమతమవుతున్న రైతులపై మరో పిడుగు పడింది. యూరియా ధరలు పెరగడం రైతులకు భరించలేని భారంగా మారింది. ప్రస్తుతం సాగుకు ఎంతో కీలకమైన యూరియా ఎరువు ధరను గణనీయంగా పెంచుతూ కేంద్ర మంత్రి మండలి సమావేశం మూడు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయారు. యూరియా ధరను ఒక్కసారిగా టన్నుకు రూ. 350ల వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రైతులు తీవ్రఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఏటా ఖరీఫ్,రబీ సీజన్లకు కలిపి 3,49,807 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగిస్తున్నారు. ఈ రబీలో 1,95,476 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖరీఫ్‌లో 1,54,311 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. {పస్తుతం రబీ సాగు కీలక దశకు చేరుకుంది. ఇలాంటి తరుణంలో యూరియా మెట్రిక్ టన్నుకు రూ. 350ల వరకు పెంచడంతో జిల్లాలోని రైతులపై ఏడాదికి రూ.12.24 కోట్ల వరకు భారం పడనుంది. వ్యవసాయ చేస్తున్నవారిలో అధిక శాతం సన్న, చిన్నకారు రైతులే. వారిలో చాలా మంది ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. మంత్రి మండలి నిర్ణయం ప్రకారం 50 కిలోల బస్తాకు రూ. 17.50 పైసలు పెరిగినట్లయింది. బస్తా ధర ప్రస్తుతం రూ. 280.85 వరకుఉండగా, అది కాస్తా రూ.301.35లకు చేరనుంది. జిల్లాలో పత్తి, మిర్చి, వరి సాగు ఎక్కువగా ఉంది. అన్ని పంటలకు దాదాపుగా యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు, రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. -
ఉత్తిపోతలు..
దండేపల్లి, న్యూస్‌లైన్ : లక్ష్యం ఘనం.. ఆచరణ శూన్యం అన్న చందంగా తయారైంది దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం దుస్థితి. ఉన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభిస్తే ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయడం లేదు. ఫలితంగా నిర్మాణ పనులు నత్తకంటే హీనంగా నడుస్తున్నాయి. దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న ఎత్తిపోతల ఫథకం పనులు నత్తకంటే అధ్వానం గా నడుస్తున్నాయి.. ఐదేళ్లుగా నిర్మాణ పనులు సా...గుతూనే ఉన్నాయి. రూ.125 కోట్ల వ్య యంతో నిర్మించే ఈ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009, జన వరి 27న శంకుస్తాపన చేశారు. 2011లోనే పనులు పూర్తి కావాల్సి ఉన్నా నేటికీ అలాగే నడుస్తున్నాయి. గడువు ముగిసి మూడేళ్లవుతున్నా పనులు వేగవంతం కనిపించడంలేదు. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లా కు కేటాయించిన 3 టీఎంసీల నీటిని కడెం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలకు సాగునీరందించడానికి గోదావరి ఒడ్డున ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారు. ఆయన మరణానంతరం ఈ పథకం నిర్మాణంపై పట్టించుకునే వారు కరువయ్యారు. సదరు కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తిచేయడం లేదు. పనులిలా.. గూడెం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్ నుంచి తానిమడుగు వరకు 11 కిలోమీటర్ల పొడవున 2.30 మీటర్ల వ్యాసం గల పైపులైన్ నిర్మిస్తున్నారు. తానిమడుగు వద్ద నిర్మించిన డెలివరీ పాయింట్ ద్వారా నీటిని కడెం ప్రధాన కాల్వలో అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి కడెం ఆయకట్టు చివరిదాక సాగునీరు వెళ్తుంది. పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయ్యింది. మోటార్లు బిగించారు. పైపులైను నిర్మాణ పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ అంతంతా మాత్రంగానే ఉండడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. పంప్‌హౌజ్ సమీపంలో ఒకటి, రెబ్బనపల్లి మరొక నెగెటివ్ ప్రెషర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. అయితే.. పంప్‌హౌజ్ సమీపంలోని ట్యాంకు నిర్మాణం చివరి దశకు చేరుకోగా రెబ్బనపల్లి వద్ద నిర్మించిన ట్యాంకుకు ఇప్పుడే పైపులు బిగిస్తున్నారు. ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేకంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అసంపూర్తి పనులన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి నీరందడం కష్టంగానే కనిపిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కు నీరందిస్తాం.. వచ్చే ఖరీఫ్‌కు ఎత్తిపోతల పథకం నీరందిస్తాం. నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. వాటిని త్వరలో పూర్తిచేస్తాం. భూ సేకరణలో కొంత ఆలస్యం జరగడంతో నిర్మాణంలోనూ జాప్యం జరిగింది. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయ్యేలోగా మిగిలిన పనులు పూర్తి చేస్తాం. - కనకేశ్, ఎల్లంపల్లి ఈఈ -
పడికట్టు.. కనికట్టు..
సత్తుపల్లి, న్యూస్‌లైన్: అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన కష్టార్జితాన్ని దళారులు దోచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలులో పడికట్టు కాంటాతో కనికట్టు చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని తరుగు పేరుతో బస్తాకు మూడు కేజీలు అదనంగా కాంటా వేసుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 77కిలోల బస్తాకు సంచి కింద ఒక కేజీ, తరుగు కింద రెండు కేజీలు అదనంగా కాంటా వేసుకుంటున్నారని, పడికట్టు కాంటాలో మోసాలు జరుగుతున్నాయని లారీలను నిలిపివేసి.. పంచాయితీలు జరిగినా దళారులు మాత్రం మళ్లీ అదే తరహాలో కాంటాలు వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నామమాత్రంగా కొనుగోళ్లు ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు ఆసక్తి కనబర్చకపోవటంతో వాటిలో కొనుగోళ్లు నామమాత్రంగానే జరుగుతున్నాయి. సత్తుపల్లి మండలం కిష్టారం, సదాశివునిపాలెం, గంగారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కిష్టారం మినహా ఇతర కొనుగోలు కేంద్రాలు మూతపడ్డాయి. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల, కోండ్రుపాడు.., వేంసూరు మండలంలోని అడసర్లపాడు.., కల్లూరు మండలంలో కల్లూరు, చెన్నూరు, కొర్లగూడెం, పోచారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా ఫలితం కనిపించటం లేదు. తల్లాడ మండలంలో అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్నే ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం మద్దతు ధర ఫైన్క్రం(ఏ-గ్రేడ్) వందకేజీల బస్తాకు రూ.1345, కామన్క్రం రూ.1310 చెల్లిస్తోంది. ఫైన్ రకంలో సాంబమసూరి, 1010, జేజేలు, రాజహంస, కామన్క్రంలో స్వర్ణ, 1001 రకాలు తీసుకుంటారు. ప్రభుత్వం మద్దతు ధర కంటే అదనంగా బయట మార్కెట్లో రూ.50 నుంచి రూ.75ల వరకు చెల్లిస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావటానికి రైతులు ఆసక్తి చూపటం లేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఇంకా కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాలు, బెరుకుల దెబ్బకు.. : ఈ ఏడాది ఖరీఫ్‌లో అన్నదాతకు కొలుకోలేని దెబ్బ పడింది. పంట చేతికొచ్చే సమయంలో సాంబమసూరి బీపీటీ 5204 విత్తనం వందలాది ఎకరాలలో బెరుకులు రాగా మరికొన్నిచోట్ల తాలుకంకులు వచ్చి పంట చేతికిరాలేదు. బెరుకులు వచ్చిన రకాన్ని ఫైన్ క్వాలిటీ నుంచి తప్పించి కామన్క్రం కింద కొనుగోలు చేయటంతో రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లటానికి ఇంటివద్దే తూర్పారబట్టాలి.. తేమశాతం 17 ఉండాలి.. తాలు, మట్టిపెడ్డలు 3శాతం మాత్రం ఉండాలనే నిబంధనలు ఉండటంతో చాలామంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా దళారులకు విక్రయిస్తున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకున్న దళారులు కాంటాలలో పాల్పడుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని ైరె తులు కోరుతున్నారు. -
పత్తాలేని ‘ఉపాధి’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలో ఖరీఫ్ పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడ్డ ఉపాధి పనులు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. ఖరీఫ్ ముగిసిన నేపథ్యంలో పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 511 గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ వార్షిక ప్రణాళికలో నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 250 గ్రామాల్లో మాత్రమే పనులు మొదలు కాగా, 261 గ్రామాల్లో అసలు పనుల జాడ లేకపోవడం గమనార్హం. 10 మందిపై వేటు.. ఉపాధి పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా నీటి యాజమాన్య సీరియస్‌గా తీసుకుంది. విధి నిర్వహణలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహాయ ప్రాజెక్టు అధికారితో పాటు క్షేత్ర సహాయకులపై వేటు వేసింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితం వికారాబాద్, శంకర్పల్లి, మర్పల్లి మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆశ్చర్యపోయారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలువురు క్షేత్ర సహాయకులు గైర్హాజరు కావడాన్ని గమనించారు. అలా విధుల్లో అలసత్వంగా వ్యవహరిస్తున్న తొమ్మిది మంది క్షేత్ర సహాయకులతో పాటు ఓ సహాయ ప్రాజెక్టు అధికారిని సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి 20వేల మంది కూలీలకు పని కల్పించాల్సి ఉండగా.. ప్రస్తుతం 8వేల మంది మాత్రమే కూలీలకు మాత్రమే ఉపాధి పనులు చేపడుతున్నారు. పని కల్పించకుంటే వేటు తప్పదు: డ్వామా పీడీ ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పని కల్పించకుండా అలసత్వం వహిస్తే వెంటనే 040-23230380, 81, 82 లేదా 9701451845 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు మొదలు పెట్టాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. -
రబీపై నీలి నీడలు
సాక్షి, కొత్తగూడెం నాగార్జునసాగర్ ఆయకట్టుకు రబీలో నీటి విడుదలపై నీలి నీడలు అలుముకున్నాయి. ఎడమ కాలువ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను ఈ సారి పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఖరీఫ్‌లో అకాల వర్షాలు, తుపాన్లతో తీవ్రంగా నష్టపోయామని, రబీలో పంట విరామం ఇస్తే.. అప్పులు తీర్చలేమని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 16 మండలాలున్నాయి. ఆయకట్టంతా ఖమ్మం డివిజన్‌లోనే ఉంది. ఇక్కడి రైతులు ఈ ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. అయితే పంటలకు దోమకాటు, ఎర్రతెగులు, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి తగ్గనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ముందస్తుగా భారీ వర్షాలు పడడంతో నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయకుండానే రైతులు వరినార్లు పోశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఖరీఫ్ సాగుకు ముందుగానే ప్రభుత్వం నీరు విడుదల చేసింది. అయితే వరుస తుపాన్లతో పంటలు నష్టపోయిన రైతులు రబీలో సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వరి నూర్పిడి చేస్తుండడంతో కొందరు రైతులు వరినార్లు కూడా పోస్తున్నారు. సాగర్‌లో నిండా నీళ్లున్నాయని భావిస్తున్న రైతులు రబీలో జోరుగా సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ధాన్యం అమ్మకముందే రబీ పంటకు రైతులు సై అంటుండగా.. ప్రభుత్వం మాత్రం సాగర్ నీటి విడుదల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ యోచన..? ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ కాలువల ఆధునికీకరణ పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. అనావృష్టి పరిస్థితులు ఉన్నప్పుడు పనుల వేగిరానికి చర్యలు తీసుకోని ప్రభుత్వం.. సాగర్‌లో నిండా నీరుండి, సాగు చేయాలన్న ఉత్సాహం రైతుల్లో ఉన్నప్పుడు కాలువ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీళ్లు ఉన్నాయి. అయితే ఆ నీటిని రబీకి విడుదల చేయకుండా, కాలువ ఆధునికీకరణ పనుల నిమిత్తం 100 టీఎంసీలు నిల్వచేసి.. రానున్న ఖరీఫ్‌లో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రబీకి నీరివ్వకుండా ఇప్పుడు కాలువ పనులు చేయాల్సిన అవసరం ఏంటని ఇప్పటికే నల్లగొండ జిల్లా రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పనులు చేపడితే ఎడమకాలువ పరిధిలో ఆయకట్టు అంతా ఎండిపోయే ప్రమాదముందని రైతు సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస పంట నష్టాలతో రైతులు కుదేలవుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. పంటల సాగుకాలం పూర్తయిన తర్వాత పనులు చేసుకోవాలని, రబీకి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సాగుతున్న పనులు.. ఎడమ కాలువ పరిధిలో జిల్లాతో పాటు నల్లగొండ, కృషా జిల్లాల్లో ప్రధాన కాలువ పనులు 75 శాతం పూర్తి అయినట్లు ఎన్నెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పలు మేజర్లు, మైనర్ కాలువ పనులు 50 శాతం కూడా కాకపోవడంతో.. ఈ పనుల కోసమే రబీ పంట విరామం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోం ది. ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవిలో పనులు నత్తనడకన సాగడం, పంటల సమయంలో పనుల కోసమని ప్రభుత్వం ఆర్భాటం చేస్తుండడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి.. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న భూములకు నాలుగేళ్లుగా ప్రభుత్వం సరిగా నీళ్లు ఇవ్వడం లేదు. దీంతో సాగునే నమ్ముకున్న రైతులు నష్టపోతున్నారు. కాలువ పనులంటూ ప్రభుత్వం నీటి విడుదలను నిలిపితే ఎలా..? రబీ పంట అయిన తర్వాత ప్రభుత్వం పనులు చేయించాలి. లేకపోతే రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మళ్లీ ఖరీఫ్‌లో పంట సాగుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. - రేళ్ల వెంకట్‌రెడ్డి, రాజుపేట, కూసుమంచి మండలం కాలువ నీళ్లనే నమ్ముకున్నాం.. నాకు నాగార్జునసాగర్ కాలువ కింద రెండెకరాల భూమి ఉంది. ఈ సారి తెగుళ్లతో పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. వేసంగిలో సాగుకు కాలువ నీళ్లనే నమ్ముకున్నాం. నీళ్లిస్తేనే పంట సాగు.. లేకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలి..? పంటలు లేనప్పుడు ప్రభుత్వం కాలువ పనులు చేయిస్తే బాగుంటుంది. - భూక్యా లింగానాయక్, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం -
పంటనష్టంపై ప్రభుత్వానికి అధికారుల నివేదిక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖరీఫ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాటిల్లిన పంట నష్టాన్ని అధికారులు తేల్చారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు పంటలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించిన అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇదిలా ఉండగా, వ్యవసాయశాఖ అంచనా కంటే పంట దిగుబడి ఒక శాతం అధికంగా సాగైంది. వరి 54,456 హెక్టార్లు అంచనా కాగా 52,251, సోయాబీన్ 73,500 హెక్టార్లకు 1,19,907, పత్తి 3,23,281కు 3,89,252 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అయితే మూడు నెలలు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలో పత్తి, సోయాబీన్, వరి పంటలు దెబ్బతిన్నాయి. సోయాబీన్ మొలకెత్తడంతో క్వింటాల్‌కు రూ.3,200 కూడా ధర పలకలేదు. వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పత్తి పంట మునిగింది. ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయశాఖలు పంట నష్టంపై సర్వే నిర్వహించాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూరు, సిర్పూరు, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, జైపూర్, బెల్లంపల్లి, భీమిని, దండేపల్లితోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలపై అధికారులు సర్వే నిర్వహించి పంట నష్టం తేల్చారు. మూడు అంశాలు ప్రాతిపదికగా నివేదిక.. గతేడాది ఖరీఫ్‌లో అనావృష్టి.. ఈసారి అతివృష్టి.. మొత్తంగా రైతులను రెండు సీజన్లు నిండా ముంచాయి. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని నివేదిక పంపిన అధికారులు, అదే నివేదికలో జిల్లాలో కరువు పరిస్థితులు లేవని పేర్కొన్నారు. గత ఖరీఫ్‌లో 5.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా, అధికంగా 3.67 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. కరెంట్ కోతలు, వర్షాభావంతో 2.68 లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం రెండు విడతల్లో 52 మండలాలను కరువు మండలాలుగా దశలవారీగా ప్రకటించింది. అయితే ఈసారి జిల్లాలో అతివృష్టి కారణంగా పంట నష్టం ఉన్నా, వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో కరువు లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆయిల్ సీడ్స్‌పై వర్షాభావ ప్రభావం పడింది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం వర్షపాతం ఏడాదిలో ఒక మండలంలో సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్లు ఉంటే.. అందులో 15 శాతం లోటు ఉండాలి. 750 నుంచి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం స్థానంలో 20 శాతం లోటు ఉండాలి. అదేవిధంగా ప్రధాన పంటలు సాగు కావాల్సిన సాధారణ విస్తీర్ణంలో సగంలోపే పంటలే వేసి ఉండాలి. దిగుబడి 50 శాతం లోపే వస్తుందని అంచనా వేస్తే వాటి ని పరిగణలోకి తీసుకోవాలని నిబంధనలు చెప్తున్నాయి. ఈ మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకుంటే జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైనందున కరువు జాబితాలో జిల్లా మండలాలను చేర్చలేకపోయామని అధికారవర్గాలు చెప్తున్నాయి. కాగా, వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు మాత్రమే ఐఏవై వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. -
పత్తిరైతుకు పుట్టెడు కష్టాలు
పర్చూరు, ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, వరుస తుపాన్లు రైతుల వెన్ను విరిచాయి. జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 57 వేల హెక్టార్లలో పత్తిపైరు సాగైంది. ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పైర్లు పీకేయగా..మిగిలినవి ఓ మోస్తరు దిగుబడి ఇస్తున్నాయి. పత్తితీత పనులు కూడా ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రైతుల ఇళ్లకు పత్తి వచ్చి చేరుతోంది. బయట మార్కెట్లో నాణ్యమైన పత్తికి * 4,400 ధర ఉన్నా..దళారులు, వ్యాపారులు నాణ్యత పేరుతో * 2,500 నుంచి * 3 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అసలే దిగుబడులు తగ్గి ఆందోళనలో ఉన్న రైతులను ఈ పరిణామం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇంత కష్టపడి సాగుచేస్తే హెక్టారుకు 15 క్వింటాళ్లు రావడం గగనమైపోతోంది. వర్షాలకు దెబ్బతిని ఇప్పుడిప్పుడే ఇగురుకాపు వస్తున్న పైర్లు దిగుబడులు ఇస్తాయా లేదా అన్న అనుమానం రైతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తికి ప్రభుత్వ ధర క్వింటా *4 వేలుగా ప్రకటించింది. నాణ్యమైన పత్తిని ఎలాగూ ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఇదే వర్షాలకు దెబ్బతిన్న పైర్లనైతే కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఒకవేళ కొనుగోలు చేసినా వారికి తోచిన ధరే ఇస్తారు. దీంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించి ఆదుకుంటుందని రైతాంగం ఆశిస్తోంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సీసీఐ నిబంధనలు పక్కనపెట్టి తడిసి కొద్దిగా నాణ్యత దెబ్బతిన్న పత్తిని కూడా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది. పత్తిరైతులపై ప్రభుత్వాల చిన్నచూపు... పత్తి దిగుబడిలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినా పత్తి ఆధారిత పరిశ్రమలు 40 శాతం తమిళనాడులో ఉన్నాయి. పత్తి రైతులను ఆదుకునే విషయంలో మన ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలకు సరిపోను మిగతా పత్తిని తమిళనాడుకు తరలించాలంటే రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో వ్యాపారులు రవాణా ఖర్చులు, మిగతా ఖర్చులు సరిచూసుకొని గిట్టుబాటయ్యే ధరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా మన రాష్ట్ర పత్తిరైతులకు న్యాయమైన ధర లభించడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యాపారులకే జై కొడుతున్న సీసీఐ అధికారులు ఏటా రైతాంగాన్ని ఆదుకునే పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న అధికారులు రైతుల వద్ద నుంచి మొక్కుబడిగా కొనుగోళ్లు చేస్తూ వ్యాపారులకు దోచిపెడుతున్నారు. రైతాంగాన్ని దగా చేసి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేస్తే సీసీఐ బయ్యర్లకు మిగిలేది తక్కువ.. అదే వ్యాపారులైతే కొద్దొగొప్పో ముట్టచెప్తారు. వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసిన పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పనిలేకుండా నేరుగా సీసీఐ లీజుకు తీసుకున్న మిల్లుల వద్దకు చేరుతుంది. అయినప్పటికీ సీసీఐ కేంద్రాలకు వచ్చినట్లుగానే మార్కెటింగ్ శాఖకు సెస్సు, హమాలీల కూలీ ఇవ్వడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ సిబ్బంది కూడా పాలుపంచుకోవడం గమనార్హం.. ఎక్కువ సంఖ్యలో సీసీఐ కేంద్రాలు పెడితేనే రైతులకు మేలు: పత్తి రైతాంగాన్ని ఆదుకోవాలంటే కనీసం పత్తి కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలి. పశ్చిమప్రాంతంతో పాటు పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో 10కిపైగా ఏర్పాటు చేస్తే తప్ప ఈ ఏడాది రైతులు కోలుకోరు. గత ఏడాది పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాలు 5 మాత్రమే తెరిచారు. అయితే పశ్చిమ ప్రాంతంలో ముందుగా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోయారు. రైతులు, రైతు సంఘాల ఆందోళనల పుణ్యమా అని చివరిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినా అప్పటికే 80 శాతానికిపైగా పత్తి దళారుల చేతిలోకి వెళ్లింది. -
రైతన్నకు కొర్రీలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐదు రోజులపాటు కురిసిన వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. పత్తి, వరి పంటల నీటమునిగి పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో అప్పులు తీర్చేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆపదలో ఉన్న అన్నదాతలకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. జిల్లావ్యాప్తంగా 1,73,430 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆదివారం నివేదిక ను మరింత కుదించారు. 49 మండలాల్లో 87,730 ఎకరాల్లో వరి, 85,450 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 120 ఎకరా ల్లో సోయాబీన్ నీటిపాలైనట్లు ప్రభుత్వానికి నివేదించారు. రైతులు పత్తి, వరి పంటకు ఎకరానికి రూ.20-35వేల దాకా పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో రూ.350 కోట్ల మేర నష్టం వాటిల్లింది. జిల్లాలో సాగు చేసిన పంటల్లో 60 శాతానికిపైగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నప్పటికీ అధికారులు 12 శాతమే నీటమునిగినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో నీటముని గిన పంటలను అధికారులు పరిశీలించలేదు. రె వెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయలోపం కారణంగా నష్టం అంచనాలో పూర్తిగా కాకిలెక్కలే కనిపిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రంగుమారితే కొంటారా? ఖరీఫ్‌లో 1.75 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారు. ముందుగా నాటేసిన చోట్ల వరికోతలు ముమ్మరమైన దశలో 50 శాతం కంటే ఎక్కువగా పంట నీటమునిగింది. వరి నేలకొరిగి గింజలు నానడంతో మొలకలొస్తున్నాయి. పొలంలోనే కాకుండా ఎండబెట్టినా మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. కాయపగలిన దశలో ఉన్న పత్తి వర్షానికి తడిసి పిడసగా మారి నల్లబడుతోంది. పిందెదశలో ఉన్న పత్తిలో నీళ్లు నిలిచి మొక్కలు ఎర్రబారి చనిపోతున్నాయి. వర్షాలతో పత్తి నాణ్యత పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. ఇలా రంగుమారిన ధాన్యం, పత్తి కొనుగోలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. నేతల గాలిమాటలను రైతులు పూర్తిగా నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. నాణ్యమైన ఉత్పత్తులకే వ్యాపారులు కొర్రీలు పెడుతూ ధరలు తగ్గిస్తున్నారు. ఇక చెడిపోయిన వరి, పత్తి పంటలను ఏ రేటుకు కొనుగోలు చేస్తారో ఊహించుకోవచ్చని రైతులు అంటున్నారు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు చొరవచూపకపోవడం పట్ల రైతులు, విపక్ష నాయకులు మండిపడుతున్నారు. రంగుమారిన ధాన్యం, పత్తిని కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ హామీకోసం ఎదురుచూస్తున్నారు. పరిహారానికి ని‘బంధ’నలు రైతులు నష్టపోయిన పంటల పరిహారం కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టారు. 50 శాతానికి పైగా పంటలు నీటమునిగితేనే పరిహారానికి అర్హులవుతారు. పంటలు నష్టపోయిన రైతుల వారీగా రీసర్వే చేసే క్రమంలో నీటమునిగిన పంట విస్తీర్ణంలో దిగుబడిని పరిగణలోకి తీసుకుంటారు. 50 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగినట్లు తేలితే సంబంధిత రైతు వివరాలు సేకరిస్తారు. హార్వెస్టింగ్ చేయని పంటలనే నష్టం లెక్కలోకి తీసుకుంటారు. కళ్లాల్లో ఆరబెట్టిన, కోసిన పంటలను పరిగణలోకి తీసుకోలేమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి నష్టం అంచనాలో ఆదర్శరైతులను భాగస్వాములను చేయడం లేదు. ఐదెకరాల లోపు పంటలకు నష్టం జరిగితేనే లేక్కలోకి తీసుకుంటామని, అంతకన్నా ఎక్కువ నష్టం జరిగితే పరిహారం వర్తించదని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా నష్టం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నష్టాన్ని కుదించేందుకే నిబంధన లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. సమీక్షించిన ఇన్చార్జి కలెక్టర్.. జిల్లాలో వర్షాల కారణంగా సంభవించిన పంటనష్టం వివరాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ సోమవారం సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడీఏలు, తహశీల్దార్లు, ఏవోలతో ప్రాథమిక అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం నుంచి రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతుల వారీగా సర్వే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 50 శాతం పంట నష్టపోయిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిహారం వస్తుందని తెలిపారు. నవంబర్ 3లోగా పంటనష్టం జరిగిన రైతుల జాబితా రూపొందించి 4,5,6 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. నవంబర్ 10లోగా తుది జాబితాను సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న ఇళ్లు, గండిపడిన చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. పంటనష్ట పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా వీఆర్వో, ఏఈవోలు నష్టం సర్వే చేయగా మండల స్థాయిలో తహశీల్దార్, ఏవోలు పరిశీలిస్తారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, ఏడీఏలు పర్యవేక్షిస్తారు. -
ధాన్యం.. దైన్యం
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: అష్టకష్టాలు పడి రైతాంగం పండించిన ధాన్యం మార్కెటింగ్ సంక్షోభం అంచున నిలబడింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ సీజన్లో రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి ధాన్యం వారం రోజుల్లో వెల్లువలా రానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు ఏర్పాట్లు ఇంకా పూర్తి చేయలేదు. పైగా మద్దతు ధరపై సందిగ్ధం నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చే బాయిల్డ్(కామన్) ధాన్యం మద్దతు ధరను ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 1,315 గా, ఎ గ్రేడ్ ధాన్యం (సన్న రకం )కు రూ. 1,340 గా మద్దతు ధరను ప్రకటించింది. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో వరి పంట జోరుమీద ఉంది. సిద్దిపేటలోని మార్కెట్ జిల్లాలోనే అతి పెద్దది కావడం.. జిల్లాలోని 50 గ్రామాలతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం సిద్దిపేటకు రానుంది. ఈ క్రమంలో వ్యాపారులు ధాన్యం ధరలను క్రమంగా తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా ఎఫ్‌సీఐ కామన్ రకాన్ని మాత్రమే ఖరీదు చేయాలని, సివిల్ సప్లయిస్ సంస్థ సన్నరకం ధాన్యాన్ని ఖరీదు చేయాలని ప్రభుత్వం కొత్తగా నిర్ణయించింది. ఇక ఐకేపీ కొనుగోలు కేంద్రాలు సన్నరకం ధాన్యాన్ని ఖరీదు చేసి కస్టమ్ మిల్లింగ్‌కు పంపాలని అధికారులు నిర్ణయించారు. ఏర్పాట్లు ఏవీ? సిద్దిపేట మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలు ధాన్యం ఖరీదు చేయడానికి ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదు. బార్దాన్, సుతిలీ సిద్ధం చేసుకోవడంతో పాటు హమాలీలను, రవాణా ఏర్పాట్లను, గ్రేడింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాలోస్తే టార్పాలిన్లు సైతం సిద్ధం చేసుకోవాలి. కాని అధికార యంత్రాంగం ఇందుకు సిద్ధం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపారులకు పరీక్షే.. ఈ ఖరీఫ్ సీజన్లో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి జిల్లాకు ధాన్యం భారీగా దిగుమతి కానుంది. ఆయా రాష్ట్రాల్లో మద్దతు ధర నిబంధనలు లేకపోవడంతో తక్కువ ధరలకే ధాన్యం ఇక్కడికి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఈ నేఫథ్యంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టకపోతే మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర లభించడం కష్టం. రైతులు రోడ్డెక్కడం అనివార్యం. వెల్లువెత్తిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఇప్పించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో వరి ధాన్యం సిద్దిపేట మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలు పొంచి ఉన్నాయి -
ఎరువు.. బరువు
సాక్షి, ఏలూరు : ‘పశ్చిమ’ రైతులను ఖరీఫ్‌లోనూ కష్టా లు వదలడం లేదు. సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడం.. తగినంత వర్షపాతం నమోదైనా అదునులో కురవకపోవడం.. తెగుళ్లు, ఎలుకల బెడద వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను తాజాగా ఎరువుల ధరలు బెంబేలెత్తిస్తున్నారుు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుచెప్పి విక్రేతలు ఎరువుల ధరల్ని పెంచేశారు. ఏటా భారీగా పెరుగుతున్న ధరలు రైతుకు భారంగా మారుతుంటే.. తాజాగా సమైక్య ఉద్యమం కారణంగా రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయంటూ ఆ భారాన్ని కూడా రైతుల నెత్తిమీదే వేస్తున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటం వ్యాపారులకు కలిసొచ్చింది. మరోవైపు అధిక ధర చెల్లించి ఎరువులు కొనలేక రైతులు వాటి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఫలితంగా వరిపైర్ల ఎదుగుదలమందగిస్తోంది. మరోవైపు పంటలపై చీడపీడలు విజృంభిస్తున్నాయి. వీటివల్ల దిగుబడి తగ్గిపోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 అదనం జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఖరీఫ్ కాలానికి 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. అంతకంటే ఎక్కువగానే ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ముందునుంచీ చెబుతున్నారు. కానీ వాటిని కొనాలంటే మాత్రం రైతులు భయపడుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రెండు నెలలుగా ప్రజలు ఉద్యమం చేస్తుండగా, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఎరువుల విక్రేతలు ధరలు పెంచేశారు. రవాణా చేయడం చాలా కష్టంగా ఉందని, ఎరువులు కావాలంటే ఆ ఖర్చు భరించక తప్పదని రైతులకు చెబుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పులు చేసి కొందరు అధిక ధరకే ఎరువులు కొంటుంటే, మరికొందరు గత్యంతరం లేక వాటి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఏటా పెరుగుతున్న ధరలు పరిస్థితులతో సంబంధం లేకుండా ఏటా ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నారుు. నాలుగేళ్ల క్రితం రూ.250 ఉన్న యూరియా ధర 2010 ఖరీఫ్‌లో రూ.275కి చేరింది. 2011 నాటికి రూ.278కి, 2012కి రూ.281కి ధర పెరిగింది. డీఏపీ 2010లో రూ.485 నుంచి రూ.571కు, 2011లో రూ.624కు, 2012లో రూ.950కు పెరిగిపోయింది. ఇదే కొన్ని కంపెనీలు రూ.1260కి అమ్ముతున్నాయి. ఇలా ప్రతి ఎరువు ధర గతంతో పొంతన లేకుండా పెరిగిపోయింది. ఈసారి సమైక్యాంధ్ర కోసం వ్యవసాయ శాఖ ఉద్యోగులు సమ్మె చేయడం కూడా ఎరువుల వ్యాపారులకు అనుకూలంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతుల నుంచి ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్నారు. -
‘ఖరీఫ్ రైతుకు కష్టకాలం’
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఈ సారి ఖరీఫ్‌లో రైతన్న వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేసరికి సాగునీరు సమస్య వచ్చి పడింది. జిల్లాలో 2.55లక్షల హెక్టార్లలో ఆగస్టు నెలకల్లా వరినాట్లు పడాల్సి ఉంది. కానీ ఇప్పటికి 2.20లక్షల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. ఇంకా 35వేల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. సాగునీటి విడుదల్లో జాప్యం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. ఏటా ఆగస్టు నాటికల్లా జిల్లావ్యాప్తంగా నాట్లు పూర్తయ్యేవి. సాగునీటి ఇబ్బందులు... సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల తిప్పలు తప్పటం లేదు. జిల్లాలోని నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నాట్లు పడలేదు. తప్పని సాగునీటి ఇబ్బందులు.... ఒక్క గుడ్లవల్లేరు పుల్లేటి కాల్వ కింద సాగయ్యే 1.60లక్షల ఎకరాల్లో ఎక్కువగా శివారు భూములున్నాయి. ఈ రైతులకు ఇప్పటికీ సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగానే మారింది. క్యాంప్‌బెల్ కాల్వ కింద 46వేల ఎకరాల రైతులకు కష్టకాలం వచ్చిపడింది. ఈ కాల్వ నుంచి 705క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉండగా కేవలం 400 క్యూసెక్కులే విడుదలవుతున్నాయి. దీంతో ఎకరానికి రూ.1,500నుంచి రూ.2వేలు ఖర్చు చేసి, పొలాలకు ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుకుని ఆకుమళ్లను బతికించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు కూడా కరువవుతోందని శివారు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పంటలకు ఊపిరి
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌లో పంటలసాగు నిరాశనే మిగిల్చింది. ఈ ఖరీఫ్‌లో అరకొరగా సాగుచేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త ఊపిరిపోశాయి. పంటలు పచ్చబడుతున్నాయి. దీంతో అన్నదాత ఆశలకు మోసులెత్తాయి. ఆశించినంత కాకపోయినా కొంతవరకు పంటచేతికి వస్తుందని రైతులు అనుకుంటున్నారు. కొన్ని మండలాల్లో అరకొర పదనుకు పంటలు సాగు చేయగా ఎదుగుబొదుగు లేకుండా నేలబారు చూపులతో ఉండడంతో రైతులు సాగుచేసిన పంటలపై ఆశలు వదులుకున్నారు. మరికొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు. దీంతో పంటలు సాగుచేయలేక బీళ్లుగా ఉంచారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,20,374 హెక్టార్లు ఉంది. ఇందులో 1,90,374 హెక్టార్లలో ఈ ఖరీఫ్‌లో వివిధ రకాల పంటలను రైతులు సాగుచేస్తారని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు 38173 హెక్టార్లకు మించి సాగుకాలేదు. ఇంకా 152201 హెక్టార్లలో ఎలాంటి పంటలు వేయకపోవడంతో పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు పడుతున్న వర్షాలకు రైతులు పెసర, మినుము,పొద్దుతిరుగుడు, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ వర్షాలు పంట ఎదుగుదలకే సరిపోతాయి.. జూన్‌లో 69 మి.మీకిగాను 60.9 మి.మీ, జూలై నెలలో 96.7 మి.మీకిగాను 85.2 మి.మీ, ఆగస్టు నెలలో 114 మి.మీకిగాను 47.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు పంటలకు తాత్కాలిక ఉపశమనమేనని రైతులు అంటున్నారు. పంట ఎదుగుదల వరకే ఈ వర్షాలు సరిపోతాయని రైతులు అంటున్నారు. మళ్లీ ఒకసారి వర్షాలు కురుస్తేనే పంట చేతికందుతుందని అంటున్నారు. ప్రధాన పంటల సాగు అంతంత మాత్రమే! జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వేరుశనగ, వరి కాగా ఇప్పటి వరకు వేరుశనగ వర్షాధారం, బోరుబావుల కింద సాధారణ సాగు విస్తీర్ణం 91964 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 16429 హెక్టార్లలోను, వరి సాధారణం 45476 హెకార్లుకాగా, కేవలం 3814 హెకార్లలోనే సాగైంది. ఆగస్టు నెల ప్రతిపాదనలు.... ఈ నెలలో పడే వర్షాలకు పంటలు సాగు చేసుకునే రైతులకు కావాల్సిన విత్తనాల కోసం ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర శాఖకు పంపామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహులు తెలిపారు. ఇం దులో కందులు 400 క్వింటాళ్లు, ఆముదాలు 500 క్వింటాళ్లు, ఉలవలు 1000 క్వింటాళ్లు, అలసందలు 550 క్వింటాళ్లు, పెసలు 1200 క్వింటాళ్లు, మినుములు 1200 క్వింటాళ్లు, జొన్నలు 1000 క్విం టాళ్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పొందుపరచి పంపించామన్నారు.