సాక్షి, కొత్తగూడెం
నాగార్జునసాగర్ ఆయకట్టుకు రబీలో నీటి విడుదలపై నీలి నీడలు అలుముకున్నాయి. ఎడమ కాలువ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను ఈ సారి పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఖరీఫ్‌లో అకాల వర్షాలు, తుపాన్లతో తీవ్రంగా నష్టపోయామని, రబీలో పంట విరామం ఇస్తే.. అప్పులు తీర్చలేమని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 16 మండలాలున్నాయి. ఆయకట్టంతా ఖమ్మం డివిజన్‌లోనే ఉంది. ఇక్కడి రైతులు ఈ ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. అయితే పంటలకు దోమకాటు, ఎర్రతెగులు, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి తగ్గనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ముందస్తుగా భారీ వర్షాలు పడడంతో నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయకుండానే రైతులు వరినార్లు పోశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఖరీఫ్ సాగుకు ముందుగానే ప్రభుత్వం నీరు విడుదల చేసింది. అయితే వరుస తుపాన్లతో పంటలు నష్టపోయిన రైతులు రబీలో సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వరి నూర్పిడి చేస్తుండడంతో కొందరు రైతులు వరినార్లు కూడా పోస్తున్నారు. సాగర్‌లో నిండా నీళ్లున్నాయని భావిస్తున్న రైతులు రబీలో జోరుగా
సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ధాన్యం అమ్మకముందే రబీ పంటకు రైతులు సై అంటుండగా.. ప్రభుత్వం మాత్రం సాగర్ నీటి విడుదల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఆధునికీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ యోచన..?
ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ కాలువల ఆధునికీకరణ పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. అనావృష్టి పరిస్థితులు ఉన్నప్పుడు పనుల వేగిరానికి చర్యలు తీసుకోని ప్రభుత్వం.. సాగర్‌లో నిండా నీరుండి, సాగు చేయాలన్న ఉత్సాహం రైతుల్లో ఉన్నప్పుడు కాలువ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీళ్లు ఉన్నాయి. అయితే ఆ నీటిని రబీకి విడుదల చేయకుండా, కాలువ ఆధునికీకరణ పనుల నిమిత్తం 100 టీఎంసీలు నిల్వచేసి.. రానున్న ఖరీఫ్‌లో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రబీకి నీరివ్వకుండా ఇప్పుడు కాలువ పనులు చేయాల్సిన అవసరం ఏంటని ఇప్పటికే నల్లగొండ జిల్లా రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పనులు చేపడితే ఎడమకాలువ పరిధిలో ఆయకట్టు అంతా ఎండిపోయే ప్రమాదముందని రైతు సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస పంట నష్టాలతో రైతులు కుదేలవుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. పంటల సాగుకాలం పూర్తయిన తర్వాత పనులు చేసుకోవాలని, రబీకి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సాగుతున్న పనులు..
ఎడమ కాలువ పరిధిలో జిల్లాతో పాటు నల్లగొండ, కృషా జిల్లాల్లో ప్రధాన కాలువ పనులు 75 శాతం పూర్తి అయినట్లు ఎన్నెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పలు మేజర్లు, మైనర్ కాలువ పనులు 50 శాతం కూడా కాకపోవడంతో.. ఈ పనుల కోసమే రబీ పంట విరామం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోం ది. ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. వేసవిలో పనులు నత్తనడకన సాగడం, పంటల సమయంలో పనుల కోసమని ప్రభుత్వం ఆర్భాటం చేస్తుండడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి..
నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న భూములకు నాలుగేళ్లుగా ప్రభుత్వం సరిగా నీళ్లు ఇవ్వడం లేదు. దీంతో సాగునే నమ్ముకున్న రైతులు నష్టపోతున్నారు. కాలువ పనులంటూ ప్రభుత్వం నీటి విడుదలను నిలిపితే ఎలా..? రబీ పంట అయిన తర్వాత ప్రభుత్వం పనులు చేయించాలి. లేకపోతే రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. మళ్లీ ఖరీఫ్‌లో పంట సాగుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు.
- రేళ్ల వెంకట్‌రెడ్డి,
రాజుపేట, కూసుమంచి మండలం
కాలువ నీళ్లనే నమ్ముకున్నాం..
నాకు నాగార్జునసాగర్ కాలువ కింద రెండెకరాల భూమి ఉంది. ఈ సారి తెగుళ్లతో పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. వేసంగిలో సాగుకు కాలువ నీళ్లనే నమ్ముకున్నాం. నీళ్లిస్తేనే పంట సాగు.. లేకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలి..? పంటలు లేనప్పుడు ప్రభుత్వం కాలువ పనులు చేయిస్తే బాగుంటుంది.
- భూక్యా లింగానాయక్,
మల్లాయిగూడెం,
కూసుమంచి మండలం