కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఐదు రోజులపాటు కురిసిన వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. పత్తి, వరి పంటల నీటమునిగి పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో అప్పులు తీర్చేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆపదలో ఉన్న అన్నదాతలకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. జిల్లావ్యాప్తంగా 1,73,430 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆదివారం నివేదిక ను మరింత కుదించారు.
49 మండలాల్లో 87,730 ఎకరాల్లో వరి, 85,450 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 120 ఎకరా ల్లో సోయాబీన్ నీటిపాలైనట్లు ప్రభుత్వానికి నివేదించారు. రైతులు పత్తి, వరి పంటకు ఎకరానికి రూ.20-35వేల దాకా పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో రూ.350 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
జిల్లాలో సాగు చేసిన పంటల్లో 60 శాతానికిపైగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తున్నప్పటికీ అధికారులు 12 శాతమే నీటమునిగినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో నీటముని గిన పంటలను అధికారులు పరిశీలించలేదు. రె వెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయలోపం కారణంగా నష్టం అంచనాలో పూర్తిగా కాకిలెక్కలే కనిపిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
రంగుమారితే కొంటారా?
ఖరీఫ్‌లో 1.75 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారు. ముందుగా నాటేసిన చోట్ల వరికోతలు ముమ్మరమైన దశలో 50 శాతం కంటే ఎక్కువగా పంట నీటమునిగింది. వరి నేలకొరిగి గింజలు నానడంతో మొలకలొస్తున్నాయి. పొలంలోనే కాకుండా ఎండబెట్టినా మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. కాయపగలిన దశలో ఉన్న పత్తి వర్షానికి తడిసి పిడసగా మారి నల్లబడుతోంది. పిందెదశలో ఉన్న పత్తిలో నీళ్లు నిలిచి మొక్కలు ఎర్రబారి చనిపోతున్నాయి.
వర్షాలతో పత్తి నాణ్యత పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. ఇలా రంగుమారిన ధాన్యం, పత్తి కొనుగోలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. నేతల గాలిమాటలను రైతులు పూర్తిగా నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. నాణ్యమైన ఉత్పత్తులకే వ్యాపారులు కొర్రీలు పెడుతూ ధరలు తగ్గిస్తున్నారు. ఇక చెడిపోయిన వరి, పత్తి పంటలను ఏ రేటుకు కొనుగోలు చేస్తారో ఊహించుకోవచ్చని రైతులు అంటున్నారు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు చొరవచూపకపోవడం పట్ల రైతులు, విపక్ష నాయకులు మండిపడుతున్నారు. రంగుమారిన ధాన్యం, పత్తిని కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ హామీకోసం ఎదురుచూస్తున్నారు.
పరిహారానికి ని‘బంధ’నలు
రైతులు నష్టపోయిన పంటల పరిహారం కోసం అడ్డగోలు నిబంధనలు పెట్టారు. 50 శాతానికి పైగా పంటలు నీటమునిగితేనే పరిహారానికి అర్హులవుతారు. పంటలు నష్టపోయిన రైతుల వారీగా రీసర్వే చేసే క్రమంలో నీటమునిగిన పంట విస్తీర్ణంలో దిగుబడిని పరిగణలోకి తీసుకుంటారు. 50 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగినట్లు తేలితే సంబంధిత రైతు వివరాలు సేకరిస్తారు. హార్వెస్టింగ్ చేయని పంటలనే నష్టం లెక్కలోకి తీసుకుంటారు. కళ్లాల్లో ఆరబెట్టిన, కోసిన పంటలను పరిగణలోకి తీసుకోలేమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి నష్టం అంచనాలో ఆదర్శరైతులను భాగస్వాములను చేయడం లేదు. ఐదెకరాల లోపు పంటలకు నష్టం జరిగితేనే లేక్కలోకి తీసుకుంటామని, అంతకన్నా ఎక్కువ నష్టం జరిగితే పరిహారం వర్తించదని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా నష్టం మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నష్టాన్ని కుదించేందుకే నిబంధన లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.
సమీక్షించిన ఇన్‌చార్జి కలెక్టర్..
జిల్లాలో వర్షాల కారణంగా సంభవించిన పంటనష్టం వివరాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ సోమవారం సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడీఏలు, తహశీల్దార్లు, ఏవోలతో ప్రాథమిక అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం నుంచి రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతుల వారీగా సర్వే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 50 శాతం పంట నష్టపోయిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిహారం వస్తుందని తెలిపారు. నవంబర్ 3లోగా పంటనష్టం జరిగిన రైతుల జాబితా రూపొందించి 4,5,6 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. నవంబర్ 10లోగా తుది జాబితాను సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న ఇళ్లు, గండిపడిన చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. పంటనష్ట పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా వీఆర్‌వో, ఏఈవోలు నష్టం సర్వే చేయగా మండల స్థాయిలో తహశీల్దార్, ఏవోలు పరిశీలిస్తారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, ఏడీఏలు పర్యవేక్షిస్తారు.
రైతన్నకు కొర్రీలు
Published Tue, Oct 29 2013 4:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement