చెక్కుల చిక్కులు | chekkula chikkulu | Sakshi
Sakshi News home page

చెక్కుల చిక్కులు

Published Tue, Apr 11 2017 12:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

చెక్కుల చిక్కులు - Sakshi

చెక్కుల చిక్కులు

తాడేపల్లిగూడెం : సాగునీటి కష్టాలకు ఎదురీది వరి పండించిన రైతులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు లావాదేవీలకు ప్రభుత్వం చెక్‌ పెట్టడంతో.. ధాన్యం అమ్మిన రైతులకు చెక్కుల రూపంలోనే సొమ్ము చెల్లించాలని బ్యాంకులు మెలిక పెడుతున్నాయి. రైతుల పేరిట ఖాతాలు రాసి.. మిల్లర్ల పేరిట ధాన్యం కమీషన్‌  వ్యాపారుల ఖాతాల్లోకి సొమ్ములు బదలాయించే విధానానికీ మంగళం పలి కాయి. మరోవైపు ధాన్యం రవాణాకు సంబంధించిన వే బిల్లులను ఆన్‌ లైన్‌  విధానంలోజారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనలన్నీ రైతుల పాలిట శాపంగా పరిణవిుంచాయి. ఇకపై ధాన్యం విక్రయించే రైతులు ముందుగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ఫొటో తీయించుకుని, వేలిముద్ర వేయాలి. అప్పుడే రైతు తీసుకెళ్లిన ధాన్యం రికార్డుల్లో నమోదవుతుంది. ధాన్యం అమ్మిన సొమ్ము సదరు రైతు పేరిట బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ తతంగమంతా రైతులను అయోమయంలోకి నెడుతోంది.
 
కొనుగోళ్లకు దూరంగా మిల్లర్లు
సార్వా సీజన్‌ కు సంబంధించి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం«ధించి బకాయిలు ఇంకా చెల్లిం చలేదు. దాళ్వాలో పండిన ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయించే విష యంలో కొత్త నిబంధనలు రూపొం దించారు. ధాన్యం అమ్మడానికి ముందే రైతులు విధిగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ ఫొటో తీయించుకుని వేలిముద్రలు వేయాలి. ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో దాళ్వా ధాన్యం కొనుగోళ్లలో అయోమయం నెలకొంది. మిల్లర్లు గత సీజన్‌ లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిల చిక్కుముడి వీడకపోవడంతో వారు కొనుగోళ్ల విష యంలో పట్టు బిగించారు. అప్రకటితంగా ధాన్యం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఈ చర్యలు రైతులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.
 
మిల్లర్ల ఖాతాల అనుసంధానం 
ఐకేపీ కేంద్రాలకు రైస్‌ మిల్లర్ల బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాచరణ రూపొందిం చింది. దీనిపై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులకు అదేశాలు అందాయి. 17 శాతం తేమ, ఒక శాతం మట్టి, తాలుతప్ప ఉన్న ధాన్యాన్ని గ్రేడ్‌–ఏ రకంగా గుర్తించి క్వింటాల్‌ రూ.1,510, కామన్‌  రకం క్వింటాల్‌కు రూ.1,470 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. రైతులు ధాన్యం తూర్పారబట్టి, తేమ శాతం నిబంధనల మేరకు ఉండేలా ఐకేపీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించింది. ధాన్యం కొనుగోలులో గత నిబంధనలే ఉంటాయని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వెంకట కొండయ్య చెబుతున్నారు. సార్వాలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం ధించి బకాయిలను ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
 
కన్నెత్తి చూడని కమీషన్‌  వ్యాపారులు
ప్రభుత్వం మాన్యువల్‌ వే బిల్లులకు చెక్‌ పెట్టింది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆన్‌ లైన్‌  వే బిల్లులు జారీ చేయాలని నిబంధనలు విధించారు. తద్వారా చెక్‌ పోస్టుల కళ్లుగప్పి ధాన్యాన్ని తరలించడాన్ని నిరోధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆన్‌ లైన్‌  వే బిల్లుల ద్వారా వ్యవహారాలు నిర్వహిస్తే ఆదాయ పన్నుశాఖ కళ్లల్లో పడతామనే భయం ధాన్యం కమీషన్‌  ఏజెంట్లకు పట్టుకుంది. దీంతో వారు ధాన్యం కొనేందుకు వెనుకాడుతున్నారు. ఇదిలావుంటే.. రైతులు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తోలినా, మిల్లర్లకు విక్రయించినా, కమీషన్‌ దారులకు అమ్మినా సొమ్ములు నగదు రూపంలో పొందలేకపోతున్నారు. ఆర్‌టీజీఎస్‌ లేదా ఆన్‌ లైన్‌లో నగదు బదలాయించే ప్రక్రియ సాగుతోంది. ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు పెట్టడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
 
ఖాతాల్లో సొమ్ములున్నా చేతికందక..
రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా.. విత్‌ డ్రా చేసుకునే విషయంలో బ్యాంకులు నిబంధనలు విధించాయి. వరి కోతలు, ధాన్యం మాసూళ్ల కోసం వచ్చిన కూలీలకు సైతం రైతులు చెక్కు రూపంలోనే చెల్లింపులు చేయాలి. బంటాకు సొమ్ములు ఇవ్వాలన్నా ఇదే పద్ధతి. దీంతో రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా కూలీలకు చెల్లించలేని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 
 
ఎంటీయూ–1156 రకం పండించిన రైతులకు కష్టాలు
జిల్లాలో కొత్తగా సాగులోకి వచ్చిన సంకర రకం ఎంటీయూ–1156  ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు, ఎఫ్‌సీఐ ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఈ రకాన్ని సూపర్‌ ఫైన్‌ గా కొనుగోలు చేయాలి. ఇందులో పిండి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్లాక్‌ స్పాట్‌ (గింజ తలపై నల్లటి మచ్చ) వస్తోందంటూ ఎఫ్‌సీఐ నిరాకరిస్తోంది. దీంతో మిల్లర్లు సైతం ఈ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. జిల్లాలోని మొత్తం వరి సాగు విస్తీర్ణంలో 18.2 శాతం (31 వేల హెక్టార్లు) ఎంటీయూ–1156 రకాన్ని రైతులు సాగుచేస్తున్నారు. సుమారు మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కొన్నిచోట్ల పిండి గింజలు మాదిరిగా, కొన్ని ప్రాంతాల్లో అవి లేకుండా ఈ రకం ధాన్యం ఉంది. పూర్తిస్థాయి మాసూళ్లు జరిగితే కాని ఎలాంటి నిర్ధారణకు రాలేమని సివిల్‌ సప్లైస్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement