పంటలు నీటి పాలు.. ఇళ్లు మట్టిపాలు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను అన్నదాతలను నిట్టనిలువునా ముంచేసింది. వరి, చెరకు తదితర పంటలు నీటిపాలు కాగా కొబ్బరి, జీడిమామిడి, మామిడి చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం రోజురోజుకూ పెరుగుతుండటం విపత్తు తీవ్రతకు నిదర్శనం. శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారమే 6.06 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల 13.51 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ దిగుబడులు పడిపోనున్నాయి.
7.24 లక్షల కొబ్బరి, మామిడి, జీడిమామిడి తదితర చెట్లు పడిపోవడం వల్ల తగ్గే దిగుబడి దీనికి అదనం. ఇది ప్రాథమిక అధికారిక అంచనా మాత్రమే. వాస్తవ నష్టం దీనికి రెట్టింపు మించి ఉంటుందని, క్షేత్రస్థాయిలో నష్టాల మదింపు తర్వాత అసలు నష్టం వెల్లడవుతుందని అధికారులంటున్నారు. తుపాను ధాటికి పూరి గుడిసెలతో కలిపి అధికారిక లెక్కల ప్రకారమే 43,531 ఇళ్లు నేలమట్టమయ్యాయి.
క్షేత్రస్థాయి ఎన్యూమరేషన్ పూర్తయ్యే సరికి కూలిన ఇళ్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇక 2.41 లక్షల కోళ్లు, బాతులు తుపానువల్ల మృత్యువాత పడ్డాయి. 2,612 కి.మీ.పొడవునా రోడ్లు కొట్టుకుపోయాయి. 73 గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతింది. 86 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకా రం గురువారానికి 35గా ఉన్న తుపాను మరణాల సంఖ్య శుక్రవారానికి 38కి పెరిగింది.