sugar cane crop
-
రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ
దేశంలోని రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెరకు కొనుగోలు ధరల పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించిన నేపధ్యంలో మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ పెంపుదలతో కోట్లాది మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) కోసం చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు ‘న్యాయమైన, లాభదాయక ధర’ (ఈఆర్పీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో చెరకు ఎఫ్ఆర్పి క్వింటాల్‌కు రూ. 340 ప్రాథమిక రికవరీ రేటు 10.25 శాతంగా నిర్ణయించారు. 10.25% కంటే ఎక్కువ రికవరీలో ప్రతి 0.1% పెరుగుదలకు, క్వింటాల్‌కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నారు. ఇదేకాకుండా 9.5 శాతం లేదా అంతకంటే తక్కువ రికవరీ కలిగిన చక్కెర మిల్లులకు ఎఫ్ఆర్పి క్వింటాల్‌కు రూ.315.10గా నిర్ణయించారు. కొత్త రేట్లు 2024, అక్టోబర్ 1 నుండి వర్తించనున్నాయి. देशभर के अपने किसान भाई-बहनों के कल्याण से जुड़े हर संकल्प को पूरा करने के लिए हमारी सरकार प्रतिबद्ध है। इसी कड़ी में गन्ना खरीद की कीमत में ऐतिहासिक बढ़ोतरी को मंजूरी दी गई है। इस कदम से हमारे करोड़ों गन्ना उत्पादक किसानों को लाभ होगा।https://t.co/Ap14Lrjw8Z https://t.co/nDEY8SAC3D — Narendra Modi (@narendramodi) February 22, 2024 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొత్త రేట్లకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు ఎఫ్ఆర్పి కంటే ఇది 8 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లబ్ధి చేకూరనుంది. -
తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే..
దేశవ్యాప్తంగా గతంలో నెలకొన్న ఎల్‌నినో, వర్షాల ప్రభావం చక్కెర(షుగర్) ఇండస్ట్రీపై పడింది. ప్రస్తుతం చక్కెర ఉత్పత్తి తగ్గుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య ఉత్పత్తి అయిన చక్కెర గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో 82.05 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. సాధారణంగా షుగర్ మార్కెటింగ్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ఠంగా ఉంటుంది. గతేడాది ఉన్న 497 ఫ్యాక్టరీలు ఈ ఏడాదీ ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) పేర్కొంది. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ఫ్యాక్టరీలు 10–15 రోజులు లేటుగా ప్రొడక్షన్ ప్రారంభించినట్లు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య 22.11 లక్షల టన్నులుగా నమోదయ్యింది. గతేడాది మార్కెటింగ్ ఇయర్లో ఇదే సమయానికి 20.26 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది. మహారాష్ట్రలో అయితే చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు పడిపోయింది. చెరుకును చక్కర ఉత్పత్తితోపాటు ఇథనాల్ ప్రొడక్షన్‌కు వినియోగిస్తున్నారు. అయితే చెరుకును ఇథనాల్ కోసం వాడకపోతే ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో 325 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఇస్మా అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: వీటిని తెగవాడుతున్నారు..! దేశవ్యాప్తంగా డిస్టిలరీ ప్రాజెక్టులు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ ప్లాంట్లలో దాదాపు రూ.35,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మరోవైపు ఎల్ నినో, వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చెరుకు ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకల్లో ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్(ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్) తెలిపింది. దేశంలో చక్కెర ధరలను కంట్రోల్ చేసేందుకు సప్లయ్ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో ప్రభుత్వం ఎగుమతులను నిలిపేసింది. -
AP: ఇథనాల్ ఉత్పత్తి రెట్టింపు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ, తక్కువ వ్యయంతో ఇంధన వనరులను సముపార్జన లక్ష్యాలుగా ఈ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్దేశం. ఇందుకోసం తొలిసారిగా ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా మాత్రమే ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇకపై మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఈ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సంకల్పించింది. అలాగే, ఇథనాల్ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మరోవైపు.. ఔషధ రంగానికే పరిమితమైన ఇథనాల్‌ను ఇకపై పెట్రోలియం ఉత్పత్తుల్లో కూడా విరివిగా ఉపయోగించాలని నిర్ణయించింది. చెరకు ఉప ఉత్పత్తులకు ప్రోత్సాహం దేశంలో అవసరానికంటే ఎక్కువగా చక్కెర ఉత్పత్తి అవుతుండడంతో ఆశించిన గిట్టుబాటు ధర లభించడంలేదు. దీంతో చక్కెర దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. అంతేకాక.. ఫ్యాక్టరీల వారీగా క్రషింగ్‌కు కోటా పెట్టి ఎగుమతులకు ఇన్సెంటివ్‌లు ఇస్తోంది. చక్కెర కంటే చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా ఇ నాల్, ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్), ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) వంటి ఉత్పత్తులు వస్తాయి. వీటిలో ఇథనాల్‌ను గ్రీన్ ఎనర్జీగా పరిగణిస్తారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. 2030 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఇథనాల్‌ను ఉత్పత్తిచేసే డిస్టిలరీల సామర్థ్యం పెంచుకునేందుకు.. అలాగే, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి నిమిత్తం కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకోసం ఆర్థికంగా చేయూతనివ్వడమే కాక.. వాటికి వడ్డీ చెల్లింపుపై కనీసం 2–3 ఏళ్ల పాటు మారటోరియం కూడా విధిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి ఎలాగంటే.. ►చెరకును క్రషింగ్ ద్వారా వచ్చిన మొలాసిస్‌ను చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉండే డిస్టిలరీకి తరలిస్తారు. ►అక్కడ ఒక లీటర్ మొలాసిస్‌కు మూడు లీటర్ల నీరు కలిపి ఫర్మెంటేçషన్ చేస్తారు. అనంతరం డిస్టిలేషన్ యూనిట్‌కు పంపిస్తారు. ►అక్కడ ఆవిరిని కండెన్స్ చేయగా వచ్చే పదార్థమే ఇథనాల్. దీనిని స్టోరేజ్ ట్యాంక్‌కు తరలిస్తారు. ఒక టన్ను చెరకు నుంచి 47 కేజీల మొలాసిస్ వస్తుంది. టన్ను మొలాసిస్ నుంచి 12.5 లీటర్ల ఇథనాల్ వస్తుంది. ►ఇక మొలాసిస్ నుంచి మూడు రకాలుగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా టన్నుకు సీ మొలాసిస్ నుంచి 260 లీటర్లు, బి.మొలాసిస్ నుంచి 320 లీటర్లు, షుగర్ సిరప్ నుంచి 285 లీటర్లు ఇథనాల్‌ను తీస్తారు. ►షుగర్ సిరప్ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.62.65లు, బి మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్‌కు లీటర్‌కు రూ.57.61లు, సీ మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.45.69లుగా కేంద్రం ధర నిర్ణయించింది. ►వీటిని పెట్రోల్ ఉత్పత్తి చేసే ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ►ఇలా రాష్టంలో 13.75 లక్షల కిలో లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. సామర్థ్యం పెంచేందుకు యత్నిస్తున్నాం కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహంతో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. మా ఫ్యాక్టరీలో రోజుకు 48వేల లీటర్ల చొప్పున ఏటా 1.58 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీనిని మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం రూ.95 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. – ఎ. నాగశేషారెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్, సంకిలి, శ్రీకాకుళం జిల్లా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం రాష్ట్రంలో ఈఐడీతో పాటు సర్వారాయ, ఆంధ్రా, కేసీపీ, ఎస్ఎన్జీ షుగర్స్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం డిస్టిలరీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి యత్నిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. – వడకాని వెంకట్రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ -
Sugarcane FRP Increased: చెరుకు రైతులకు గుడ్‌న్యూస్
-
చెరుకు రైతు బతుకు చేదు
రోగాలతో నిలువునా ఎండిపోతున్న చెరుకు పంట లబోదిబోమంటున్న అన్నదాతలు పెద్దేముల్: రెండు నెలల దాటితే పంటలు చేతికి వచ్చే సమయంలో చెరుకు పంటకు రోగాలు వచ్చి నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లో రైతులు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా చెరుకు పంటను సాగుచేశారు. డిసెంబర్, జనవరి మాసంలో రైతులు చెరుకు పంటను సాగు చేయగా, రెండు నెలలు దాటితే పంటలు చేతికి వస్తాయి. ఇదే సమయంలో చెరుకు వేర్లకు లద్దె పురుగు సోకి పంటను నిలువునా తినేయడంతో చెరుకు పంట పాడవుతోది. దీంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎకరా పొలంలో సుమారు 25 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టి.. చెరుకు పంటలు సాగు చేస్తే పంటలు చేతికొచ్చే సమయంలో నిలువునా ఎండిపొవడంతో రైతులు అప్పుల ఊడిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి ఈ వ్యాధులు సోకి రైతులు అప్పుల పాలవుతున్నా ఏ అధికారీ తమను పట్టించుకోవడం లేదని, కనీసం సూచనలు ఇచ్చే వారు కూడా కరువయ్యారని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు రాతలు మాత్రం ఎవరూ మార్చలేదని అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చెరుకు పంటలకు ఎందుకు రోగాలు వస్తున్నాయి.. దాని నివారణకు ఏఏ మందులు వాడాలనే విషయాలను రైతులకు అందజేయాలని కోరుతున్నారు. -
తెగుళ్లతో చెరకు సాగు చేదే
మెలకువలు పాటిస్తేనే మేలు చెరకు పంట ప్రధాన శాస్ర్తవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ సలహాలు, సూచనలు న్యాల్కల్: జిల్లాలో చెరకు ప్రధాన పంటగా సాగుచేస్తారు. సాగులో పంటకు తెల్లదోమ, పసుపు నల్లి, వేరు పురుగు తెగుళ్లు సోకుతుంటాయి. వీటివల్ల దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. తెగుళ్లు సోకే విధానం, నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బసంత్‌పూర్-మామిడ్గి శివారులో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం చెరకు పంట ప్రధాన శాస్ర్తవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ సూచించారు. చెరకు సాగులో తీసుకోవాల్సిన మెలకువలపై ఆయన సలహాలు, సూచనలు మీకోసం... తెల్లదోమ: ఇది ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకుల్లోని రసాన్ని పీలుస్తుంది. ఫలితంగా పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడుసబారుతాయి. నీటి ముంపునకు గురైన ఎరువు వేయలేని పొలాల్లోనూ, కార్శి తోటల్లోనూ ఇది ఎక్కువగా వస్తుంది. నివారణ: దీని నివారణకు 2 మిల్లీ లీటర్ల మలాథియాన్ లేదా 1.7 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 1.7మిల్లీ లీటర్ల డైమితోయెట్ అనే మందును లీటర్ నీటిలో కలిపి మొక్కల ఆకుల కింది భాగంలో పిచికారీ చేసుకోవాలి. అయితే 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండు సార్లు ఆకుల కింది భాగంలో తడిసే పిచికారీ చేసుకోవాలి. పసుపునల్లి: ఈ నల్లులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరుతాయి. 6 నుంచి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈనెకు సమాంతరంగా గూళ్లను ఏర్పాటు చేసుకొని వాటిలోపల నివసిస్తాయి. ఇవి ఆకుల అడుగు భాగాన్ని గీకి, రసం పీల్చడం వల్ల ఆకుపచ్చని అండాకారం మచ్చలు ఏర్పడతాయి. క్రమేసి ఇవి ఎరుపు రంగుగా మారుతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి చెరకు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల అవి క్రమంగా వాడిపోయి ఎండిపోతాయి. దీంతో పంట దిగుబడులు తగ్గుతాయి. దీని ఉధృతి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. గాలిలో తేమ 60 నుంచి 75 శాతం ఉన్నప్పుడు కూడా దీని ఉధృతి ఎక్కువ. నివారణ: నల్లి ఆశించిన కింది ఆకులను తీసేసి తగుల బెట్టాలి. నీటిలో కరిగే గంధపు పొడి లీటర్ నీటికి 3 గ్రాములు లేదా 3 మిల్లీ లీటర్ల ప్రొపెనోఫాస్ 3 మిల్లీ లీటర్ల ఉమైట్ అనే మందును కలిపి ఆకుల అడుగుభాగం తడిసేలా పిచికారీ చేయాలి. అవరాన్ని బట్టి మరో 15 రోజుల్లో మళ్లీ పిచికారీ చేయాలి. దీని ఉధృతిని తగ్గించేందుకు గడ్డి జాతి మొక్కలపై కూడా మందును పిచికారీ చేయాలి. వేరు పురుగు: ఈ పురుగు తేలిక నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వేళ్లను తిని వేయడం వల్ల అవి ఎండిపోతాయి. ముందుగా మొక్క ఆకులు ఎండుముఖం పట్టి మెల్లమెల్లగా మొక్క చనిపోతుంది. నివారణ: పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవాలి. వీటికి ఆకర్షితులైన ప్రౌడ పెంకు పురుగులు ఎరకింద అమర్చుకున్న పురుగు మందుల డబ్బాలో పడి చనిపోతాయి. 50శాతం మేర తగ్గిపోతాయి. ఎదిగే తోటల్లో నివారణకు పోరేట్ 10 శాతం గుళికలను ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంతలు చేసి మందును వేస్తే దాని ఉధృతి తగ్గుతుంది. నివారణకు ఎంటామోఫాతోజెనిస్ శిలీంధ్రాలైన బవేరియా బస్సియాన, మెటరైజం అనైసాప్లెయాలను ఎకరాకు రెండు కిలోల చొప్పున వేసుకోవాలి. -
చెరుకు పంట దహనం కేసులో 8 రోజులు చిత్రహింసలు
- భయపడే సురేష్‌ను పోలీసులు వదిలేశారు - సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ వెల్లడి విజయవాడ లీగల్: అక్రమంగా నిర్బంధించి, వేధింపులకు గురి చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో భయపడి చెరకు పంట దహనం కేసులో నూతక్కి సురేష్‌ను పోలీసులు వదిలిపెట్టినట్లు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుళ్లూరు ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వలేదన్న అక్కసుతో చెరకు పంటను గత నెల 22న గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారని చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టని పోలీసులు పొలం మీరే తగల బెట్టారంటూ వెలగపూడికి చెందిన నూతక్కి సురేష్ అనే వ్యక్తిని విచారణ కోసం గత నెల 28న మందడం అవుట్ పోస్టు నుంచి తీసుకెళ్లారన్నారు. గద్దే చంద్రశేఖరరావు తగలబెట్టమంటే తగలబెట్టానని ఒప్పుకోవాలంటూ పోలీసులు వివిధ స్టేషన్లలో తిప్పి సురేష్‌ను చిత్రహింసలకు గురి చేశారన్నారు. సురేష్ ఎక్కడున్నాడని నిజ నిర్ధారణ కమిటీ అడిగితే పైఅధికారుల వద్ద విచారణలో ఉన్నాడని పోలీసులు చెప్పారన్నారు. ఇదే విషయమై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇన్ని రోజులు కనిపించని సురేష్‌ను నవంబరు నాలుగున వదిలిపెట్టారని తెలిపారు. తెలుగుదేశం జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర ద్వారా పోలీసులు సురేష్‌ను అతని ఇంటి వద్ద వదిలారని చెప్పారు. ఈ సమావేశంలో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సంపర దుర్గ శ్రీనివాసరావు, బి.జయమ్మ, కేవీవీ పరమేశ్వరరావు, ఓపీడీఆర్ నుంచి ఏసు, వి.రాజ్యలక్ష్మి, పీయూఐసీఎల్ నుంచి ఎం.శేషగిరిరావు, పీవోడబ్ల్యూ నుంచి గంగా భవాని, ఐలూ నుంచి వి.రాజారత్నం, మంగళగిరి బార్ అసోసియేషన్ నుంచి లంకా శివరామ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. -
పంటలు నీటి పాలు.. ఇళ్లు మట్టిపాలు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను అన్నదాతలను నిట్టనిలువునా ముంచేసింది. వరి, చెరకు తదితర పంటలు నీటిపాలు కాగా కొబ్బరి, జీడిమామిడి, మామిడి చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం రోజురోజుకూ పెరుగుతుండటం విపత్తు తీవ్రతకు నిదర్శనం. శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన గణాంకాల ప్రకారమే 6.06 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల 13.51 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ దిగుబడులు పడిపోనున్నాయి. 7.24 లక్షల కొబ్బరి, మామిడి, జీడిమామిడి తదితర చెట్లు పడిపోవడం వల్ల తగ్గే దిగుబడి దీనికి అదనం. ఇది ప్రాథమిక అధికారిక అంచనా మాత్రమే. వాస్తవ నష్టం దీనికి రెట్టింపు మించి ఉంటుందని, క్షేత్రస్థాయిలో నష్టాల మదింపు తర్వాత అసలు నష్టం వెల్లడవుతుందని అధికారులంటున్నారు. తుపాను ధాటికి పూరి గుడిసెలతో కలిపి అధికారిక లెక్కల ప్రకారమే 43,531 ఇళ్లు నేలమట్టమయ్యాయి. క్షేత్రస్థాయి ఎన్యూమరేషన్ పూర్తయ్యే సరికి కూలిన ఇళ్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇక 2.41 లక్షల కోళ్లు, బాతులు తుపానువల్ల మృత్యువాత పడ్డాయి. 2,612 కి.మీ.పొడవునా రోడ్లు కొట్టుకుపోయాయి. 73 గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతింది. 86 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకా రం గురువారానికి 35గా ఉన్న తుపాను మరణాల సంఖ్య శుక్రవారానికి 38కి పెరిగింది. -
కూలీల కొరత తీవ్రం
నరికే వారు లేక ఇక్కట్లు ఆందోళనలో చెరకు రైతులు పంట మిగులుతుందని బెరుకు దళారులకే కట్టబెడుతున్న వైనం జహీరాబాద్, న్యూస్‌లైన్: చెరకు పంటను నరికేందుకు కూలీ ల కొరత ఏర్పడింది. దీంతో చెరకును కర్మాగారానికి తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత క్రషింగ్ సీజన్లో జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగార యాజమాన్యం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపించలేదు. కొందరు రైతులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలకు అడ్వాన్స్ చెల్లించి రప్పించుకున్నారు. సుమారు 70 గ్యాంగ్‌ల మేరకు రైతులు స్థానికేతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. ఒ క్కో గ్యాంగ్‌లో 15 నుంచి 20 మంది వరకు కూలీలు ఉంటారు. కర్మాగారానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల రైతులు మాత్రం ఎడ్ల బండ్లను అద్దెకు తీసుకుని చెరకును తరలిస్తున్నారు. ఈ ఏడాది జోన్ పరిధిలో చెరకు పంట అధికంగా సాగులో ఉండడంతోపాటు కర్మాగారంలో క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో చెరకును తరలించే విషయంలో రైతులు ఇబ్బందులకు గు రవుతున్నారు. రైతులు స్థానిక కర్మాగారంపై ఆశలు పెట్టుకోకుండా ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిస్తున్నారు. పలువురు రైతులు ఇప్పటికే తమ ఉత్పత్తులను ఇతర కర్మాగారాలకు తరలిస్తున్నారు. 26 వేల ఎకరాల్లో సాగు.. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో సుమారు 26 వేల ఎకరాల్లో చెరకు సాగులో ఉంది. మరో 1.50 లక్షల టన్నుల మేర కర్మాగారం యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోకుండా ఉన్న సాగులో ఉందనే అంచనా. ఎకరాకు 25 టన్నుల మేర దిగుబడి వస్తే ఈ లెక్కన జోన్ పరిధిలో సుమారు 8 లక్షల టన్నుల మేర పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు రైతులు. కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500 టన్నులు ఉంది. కర్మాగారం నవంబర్ 15న క్రషింగ్ పూజను నిర్వహించింది. అనంతరం వర్షాలు కురియడంతో డిసెంబర్ మొద టి వారం వరకు క్రషింగ్ మందకొడిగా సాగింది. ప్రస్తుత సామర్థ్యం మేరకు క్రషింగ్ చేస్తున్నా సాగులో ఉన్న చెరకు పంటను పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయడం సాధ్యపడదంటున్నారు. దీం తో చెరకు ఉత్పత్తులు ఇతర కర్మాగారాలకు తరలిపోతున్నాయి. ఇప్పటివరకు 1.60 లక్షల టన్నుల చెరకు పంట మా త్రమే గానుగాడింది. ఫిబ్రవరి మాసం నుంచి ఎండల పెరుగుతాయని, దీంతో కూలీలు పంటను నరికేందుకు రెట్టింపు కూలి డిమాండ్ చేసే అవకాశం ఉంటుం దంటున్నారు. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకున్న రైతులు సాగులో ఉన్న పంట ను సాధ్యమైనంత తొందరగా కర్మాగారాలకు తరలించాలనే ఆసక్తితో ఉన్నారు. దళారులదే హవా.. ఇదే అదనుగా భావిస్తున్న దళారులు రైతులకు టన్నుకు రూ.1,800 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. చెరకు కోత, రవాణా ఖర్చులు వారే భరిస్తున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం మాత్రం టన్నుకు రూ.2,600 ధర చెల్లిస్తోంది. ఇక్కడ చెరకు కోత, రవాణా చార్జీలను మాత్రం రైతులే భరిస్తున్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి భయాందోళనలు చెందరాదని, సాగులో ఉన్న చెరకు పంటను పూర్తిగా క్రషింగ్ చేస్తామని కర్మాగారం అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు. అయినా రైతులు వారి మాటలను నమ్మక తొందరపడుతున్నారు. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని దళారులు లబ్ధిపొందుతున్నారు.