- భయపడే సురేష్‌ను పోలీసులు వదిలేశారు
- సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ వెల్లడి
విజయవాడ లీగల్: అక్రమంగా నిర్బంధించి, వేధింపులకు గురి చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో భయపడి చెరకు పంట దహనం కేసులో నూతక్కి సురేష్‌ను పోలీసులు వదిలిపెట్టినట్లు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తుళ్లూరు ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వలేదన్న అక్కసుతో చెరకు పంటను గత నెల 22న గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారని చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టని పోలీసులు పొలం మీరే తగల బెట్టారంటూ వెలగపూడికి చెందిన నూతక్కి సురేష్ అనే వ్యక్తిని విచారణ కోసం గత నెల 28న మందడం అవుట్ పోస్టు నుంచి తీసుకెళ్లారన్నారు.
గద్దే చంద్రశేఖరరావు తగలబెట్టమంటే తగలబెట్టానని ఒప్పుకోవాలంటూ పోలీసులు వివిధ స్టేషన్‌లలో తిప్పి సురేష్‌ను చిత్రహింసలకు గురి చేశారన్నారు. సురేష్ ఎక్కడున్నాడని నిజ నిర్ధారణ కమిటీ అడిగితే పైఅధికారుల వద్ద విచారణలో ఉన్నాడని పోలీసులు చెప్పారన్నారు. ఇదే విషయమై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇన్ని రోజులు కనిపించని సురేష్‌ను నవంబరు నాలుగున వదిలిపెట్టారని తెలిపారు. తెలుగుదేశం జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర ద్వారా పోలీసులు సురేష్‌ను అతని ఇంటి వద్ద వదిలారని చెప్పారు. ఈ సమావేశంలో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సంపర దుర్గ శ్రీనివాసరావు, బి.జయమ్మ, కేవీవీ పరమేశ్వరరావు, ఓపీడీఆర్ నుంచి ఏసు, వి.రాజ్యలక్ష్మి, పీయూఐసీఎల్ నుంచి ఎం.శేషగిరిరావు, పీవోడబ్ల్యూ నుంచి గంగా భవాని, ఐలూ నుంచి వి.రాజారత్నం, మంగళగిరి బార్ అసోసియేషన్ నుంచి లంకా శివరామ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
చెరుకు పంట దహనం కేసులో 8 రోజులు చిత్రహింసలు
Published Fri, Nov 6 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement