(సాక్షి, అమరావతి) : ఇంతకీ కరకట్ట నివాసం ఎవరిది? చంద్రబాబుదా... లేక ప్రభుత్వానిదా? ‘‘ఆ ఇంటికి సంబంధించి అవినీతికి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమనేని రమేశ్ నుంచి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్లం’’ అని నేరుగా చంద్రబాబే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగమనేని కూడా... ఆ ఇల్లు పూలింగ్‌లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకెంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ల మాటలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి.
ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే... : ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే... అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డుల్లోనే లేదంటే ఏమనుకోవాలి? వీళ్లంతా కలిసి ఎంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వాస్తుల్ని కూడా ప్రయివేటు ఆస్తుల్లా ఎలా మార్చేసుకున్నారో తెలియటం లేదా?
చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తే అయినపుడు... : ప్రభుత్వం ఇపుడు ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణంలో భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలుకెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీలవుతూ... ‘ఈనాడు’ దుర్మార్గపు రాతలెందుకు? బాబును టార్గెట్ చేస్తున్నారంటూ రామోజీ శోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం డ్రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్లంతా ఎందుకింత దుష్ప్రచారానికి తెగిస్తున్నారు? ఇంకెన్నాళ్లు బాబూ ఈ డ్రామాలు?
నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిందిదీ.. : ప్రజా వేదిక నాది కాదు. ప్రభుత్వానిది. నేనుంటున్న భవనం నాది కాదు. రమేష్ అనే డెవలపర్‌ది. నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేనొక టెనెంటే (అద్దెకుంటున్న వాడిని).
ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పిందిదీ..: గ్యాస్ ఇచ్చామని ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వడమేంటి? అది గమర్నమెంట్ ఇల్లు. నేనున్నానంటే..అది గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నాను. నేను మొదటి రోజే చెప్పాను. దిస్ ప్రొపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. నువ్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాం. ఇస్తే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటాం. ఇవ్వకపోతే లాండ్ అక్విజిషన్‌లో తీసుకంటాం. టెంపరరీగా నేను ఉండాలి. కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడ ఉంటున్నా. కట్టకు ఆవతల ఉండే ల్యాండ్ అంతా, కట్టడాలన్నీ పోయి టూరిజం, మిగతావన్నీ వస్తాయి. మాస్టర్ ప్లాన్‌లో కూడా నోటిఫై చేశారు.
లింగమనేని రమేష్ విలేకరులతో చెప్పిందిదీ.. : ప్రభుత్వం ఆ భవనాన్ని పూలింగ్‌లో తీసుకుంది. దేశంపై భక్తితో ఇచ్చేశాను. నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదు.
Comments
Please login to add a commentAdd a comment