సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని.. నదీ పరీవాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండటం సబబేనా? అంటూ ప్రశ్నించారు.
‘‘అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు?. 2014లోనే ఇది అక్రమ కట్టడం అని అధికారికంగానే తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడం అని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేథాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు’’ అని శివశంకర్ గుర్తు చేశారు.
‘‘నదీ పరివాహక చట్టం ప్రకారం వంద మీటర్ల లోపు ఎలాంటి కట్డడాలు చేయకూడదు. కానీ చంద్రబాబు నివాసం నదీ పరివాహకంలోనే ఉంది. లోకాయుక్త సైతం 2015లో ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. అయినాసరే ఆ అక్రమ నివాసాన్ని కూల్చకుండా చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్‌లో తల దాచుకున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు వరదని విజయవాడ మీదకు తిప్పారు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే!
‘‘ఆ ఇంటిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుందని.. ఓనరు లింగమనేని రమేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో ఆ బిల్డింగ్‌కి అద్దె కడుతున్నానని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అబద్దం చెప్పారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే’’ అని పుత్తా శివశంకర్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment