చెరుకు రైతు బతుకు చేదు
రోగాలతో నిలువునా ఎండిపోతున్న చెరుకు పంట
లబోదిబోమంటున్న అన్నదాతలు
పెద్దేముల్: రెండు నెలల దాటితే పంటలు చేతికి వచ్చే సమయంలో చెరుకు పంటకు రోగాలు వచ్చి నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లో రైతులు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా చెరుకు పంటను సాగుచేశారు. డిసెంబర్, జనవరి మాసంలో రైతులు చెరుకు పంటను సాగు చేయగా, రెండు నెలలు దాటితే పంటలు చేతికి వస్తాయి. ఇదే సమయంలో చెరుకు వేర్లకు లద్దె పురుగు సోకి పంటను నిలువునా తినేయడంతో చెరుకు పంట పాడవుతోది. దీంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎకరా పొలంలో సుమారు 25 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టి.. చెరుకు పంటలు సాగు చేస్తే పంటలు చేతికొచ్చే సమయంలో నిలువునా ఎండిపొవడంతో రైతులు అప్పుల ఊడిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి ఈ వ్యాధులు సోకి రైతులు అప్పుల పాలవుతున్నా ఏ అధికారీ తమను పట్టించుకోవడం లేదని, కనీసం సూచనలు ఇచ్చే వారు కూడా కరువయ్యారని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులు రాతలు మాత్రం ఎవరూ మార్చలేదని అంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చెరుకు పంటలకు ఎందుకు రోగాలు వస్తున్నాయి.. దాని నివారణకు ఏఏ మందులు వాడాలనే విషయాలను రైతులకు అందజేయాలని కోరుతున్నారు.