ఆహార లేమి, ఆకాశాన్నంటుతున్న ధరలు
గంజి తాగి బతుకుతున్న పౌరులు
పునరావాస శిబిరాల్లో విపరీతమైన చలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది.
ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది.
బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి.
ఆకాశాన్నంటుతున్న ధరలు
ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్‌ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి.
ప్రబలుతున్న వ్యాధులు
వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది.
అత్యంత విలాసం.. రొట్టె ముక్క
అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క.
ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
భరించలేని మానసిక వేదన
ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment