కైరో: ఇజ్రాయెల్ దాడులతో శిథిలమైన గాజాపై నేటి నుంచి శాంతిరేఖలు ప్రసరించనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు.
2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచిపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలతర్వాతే బందీల పరస్పర బదిలీ మొదలవతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరువైపులా బందీల కుటుంబసభ్యులు, బంధువుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
తమ వారిని చూడబోతున్నామన్న ఆత్రుత వారిలో కన్పిస్తోంది. స్వేచ్ఛావాయువులు పీల్చబోతున్న వీళ్లందరికీ తక్షణ ఆహారంతో పాటు ఇతరత్రా సాయం అందించేందుకు మానవీయ సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే ఇరువైపులా ఈ ప్రక్రియ ఎంత సజావుగా సాగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు, బందీల జాబితా అందజేసేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం అర్ధరాత్రి మెలిక పెట్టారు!
Comments
Please login to add a commentAdd a comment