ప్రా‘ధాన్యం’ ఏదీ | praadhanyam edee | Sakshi
Sakshi News home page

ప్రా‘ధాన్యం’ ఏదీ

Published Tue, Apr 11 2017 11:52 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ప్రా‘ధాన్యం’ ఏదీ - Sakshi

ప్రా‘ధాన్యం’ ఏదీ

 అధికారిక లెక్కల ప్రకారం క్వింటాల్‌ ధాన్యం ఉత్పత్తికి రూ.1,791 ఖర్చవుతోంది. ప్రభుత్వం మాత్రం ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్‌ వెరైటీ ధాన్యానికి రూ.1,470 మాత్రమే మద్దతు ధర ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే రైతులు ఏ గ్రేడ్‌ ధాన్యం  విషయంలో క్వింటాల్‌కు రూ.281, కామన్‌ వెరైటీ ధాన్యమైతే రూ.321 చొప్పున కేవలం మద్దతు ధర విషయంలోనే రైతు నష్టపోతున్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం కొనే నాథుడు లేకపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. క్వింటాల్‌కు రూ.258 చొప్పున 75 కేజీల బస్తాకు రూ.200 తగ్గిపోయింది. కనీస మద్దతు ధర లభించకపోవడంతో ఎకరానికి సుమారు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఉత్పత్తి ధరతో పోలిస్తే ఎకరానికి నష్టపోతున్న మొత్తం రూ.20 వేలకు పైనే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయలేక అన్నదాతలు కాడి వదిలేసే ప్రమాదం ముంచుకొస్తోంది.
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ధాన్యం ధరలు పతనం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 75 కేజీల బస్తాకు రూ.200 వరకు ధర పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్న తరుణంలో గోరుచుట్టుపై రోకలి పోటులా మద్దతు ధర కూడా దక్కకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 234 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించినా ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.  ఇప్పటికే జిల్లాలో 30 నుంచి 40 శాతం వరకూ మాసూళ్లు జరిగాయి. మిగిలిన చోట్ల వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
మద్దతు ధర కూడా దక్కడం లేదు
గ్రేడ్‌ ధాన్యం 75 కేజీల బస్తా రూ.1132.50 (క్వింటాల్‌ రూ.1,510), కామన్‌ రకం ధాన్యం బస్తాకు రూ.1102.50 (క్వింటాల్‌ రూ.1,470) చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిం చింది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తొలి రోజుల్లో బస్తాకు రూ.1,050 చొప్పున చెల్లించగా.. ఆ ధర ఇప్పుడు రూ.900కి పడిపోయింది. దీంతో బస్తాకు రూ.200 చొప్పున ఎకరానికి రూ.10 వేల వరకూ రైతు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో రైతు అయినకాడికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిల్లర్లు ఇప్పటివరకూ లారీల సమ్మెను సాకుగా చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు నగదు బదలాయింపు విషయంలో బ్యాంకులు షరతులు విధించాయంటూ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. 
 
ఆదుకునే వారేరి!
ధాన్యానికి కనీస మద్దతు ధర లభించనప్పుడు రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీని కోసం ఇప్పటికీ ఒక్క పైసా కూడా బడ్జెట్‌లో కేటా యించలేదు. మద్దతు ధర ప్రకటించేది కేంద్రమే అయినా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ధాన్యం ఉత్పత్తి ఖర్చు కంటే కనీస మద్దతు ధర తక్కువగా ఉంది. క్వింటాల్‌ ధాన్యం ఉత్పత్తికి సరాసరి ఖర్చు రూ.1791గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మద్దతు ధర కేవలం రూ.50 మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. దీనివల్ల 75 కేజీల ధాన్యం ఉత్పత్తి వాస్తవ ఖర్చుకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.200 వరకూ తక్కువగా ఉంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రకటిం చాయి. ఈ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ.1,791 ఉండగా.. దానికి 50 శాతం కలిపితే క్వింటాల్‌ ధాన్యానికి రూ.2,686 వరకూ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. 
 
బస్తాకు రూ.1,500 చెల్లించాలి 
ప్రభుత్వం బస్తా ధాన్యాన్ని రూ.1,500 చొప్పున కొనుగోలు చేయాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలి. యుద్ధప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలి. తేమ శాతం నిబంధనలు సవరించాలి.
– కె.శ్రీనివాస్, కార్యదర్శి, కౌలు రైతు సంఘం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement