గతేడాది రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది 3.36 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు
గతేడాది రికార్డు స్థాయి ధరలు.. ఈసారి కనిష్ట స్థాయిలో ధరలు
సాక్షి, అమరావతి: మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్ల ప్రభావానికి తోడు మార్కెట్‌లో ధర లేకపోవడం మిరప రైతులను కలవర పెడుతోంది.
రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా, 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా, 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3.36లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15 వేల ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
అవగాహన కల్పించే వారేరి?
సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. తెల్లతామర తెగులుతో పాటు ఇతర చీడపీడలపై గడచిన నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రొటోకాల్ మేరకు ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేవారు.
ఫలితంగా నల్లతామరతో సహా ఇతర చీడపీడలు, తెగుళ్ల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా మచ్చుకైనా కన్పించడంలేదు. నల్లతామర నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు పూజ్యమనే చెప్పాలి.
భారీగా పతనమైన ధర
2022–23లో క్వింటాకు గరిష్టంగా రూ.27వేల ధర పలకగా, 2023–24 సీజన్‌లో గరిష్టంగా రూ.29 వేల వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా రూ.18,600, కనిష్టంగా రూ.9,500 చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా రూ.50వేలకుపైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి రూ.10వేలకు మించి పలకని పరిస్థితి నెలకొంది.
మరొక పక్క 2022–23 సీజన్‌లో ఎకరాకు 18–23 క్వింటాళ్ల చొప్పున 11.50లక్షల టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 20–25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment