అపరాలే బెస్ట్‌ | Small rice exports to increase significantly | Sakshi
Sakshi News home page

అపరాలే బెస్ట్‌

Published Sat, Jun 22 2024 5:01 AM | Last Updated on Sat, Jun 22 2024 5:02 AM

Small rice exports to increase significantly

కందులు, మినుములు, పెసలకుమంచి ధరలు వచ్చే అవకాశం..

పసుపు, వేరుశనగ పంటలకు కూడా..

ప్రకటించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం

మిరపలో తేజా రకానికే అవకాశం 

మన వ్యవసాయ ఉత్పత్తులకు ఆసియా, ఆఫ్రికా నుంచి డిమాండ్‌ 

గణనీయంగా పెరగనున్న సన్నబియ్యం ఎగుమతులు 

ఖరీఫ్‌–2024–25 పంట ఉత్పత్తుల అంచనా ధరల వెల్లడి 

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, సాగు, దిగుబడులను బట్టి అంచనా

సాక్షి, అమరావతి: రైతులు విత్తు నాటుకునేటప్పుడే కోత సమయంలో తమ పంట ఉత్పత్తులకు ఎంత ధర లభిస్తుందో తెలిస్తే వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించే అవకాశం ఉందో తెలిస్తే ఆ పంటలనే సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ పంటలు కోతకొచ్చే సమయంలో మార్కెట్‌లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం (ఏఎంఐసీ) అంచనా వేస్తోంది. 

విత్తుకునే సమయంలో ఉండే ధరలు కోతకొచ్చేవేళ ఉండకపోవడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2019లో ఏఎంఐసీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా సీజన్ల వారీగా నిర్దేశించిన పంటల సాగు లక్ష్యం, సాధారణ వాతావరణ పరిస్థితులు, దిగుబడులు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ స్థితిగతులు, వివిధ మార్కెట్‌ సర్వేల సమాచారం, 25–30 ఏళ్ల మార్కెట్‌ ధరల హెచ్చుతగ్గులను శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. 

సమగ్ర కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీల ద్వారా శాస్త్రీయంగా మూల్యంకనం చేస్తున్నారు. వీటితోపాటు విశ్వవిద్యాలయ గణాంక విభాగ నిపుణులు లోతైన అధ్యయనం చేశాక ఖచ్చితమైన ప్రమా­ణాల ఆధారంగా పంట ఉత్పత్తులకు ముందస్తు మార్కెట్‌ ధరలను ఏఎంఐసీ అంచనా వేస్తోంది.  

తేజా మిరపకే విదేశాల్లో గిరాకీ 
ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిర్చి విషయానికి వస్తే అధిక ఉత్పత్తి ఫలితంగా ధరలు తగ్గే అవకాశం ఉందని ఏఎంఐసీ అంచనా వేసింది. తేజా రకం మిరపకు మాత్రమే ఎగుమతి రకంగా డిమాండ్‌ ఉంది. మిగిలిన రకాలకు పెద్దగా ధర లభించే అవకాశాలు ఉండవని అంచనా. ప్రస్తుతం అంచనా వేసిన ముందస్తు ధరలు పంట కోత సమయంలో మద్దతు ధరకు దగ్గరగా లేదా హెచ్చుగా ఉంటాయని ఏఐఎంసీ తెలిపింది. 

ఇప్పటివరకు విడుదల చేసిన అంచనా ధరల వివ­రాలను www.angrau.ac.in  లో పొందుపర్చింది. వీటిపై విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రంలోనూ సంప్రదించొచ్చు. 

అయితే వాతావరణంలో అసాధారణ మార్పులు, వరదలు, అకాల వర్షాలు, తుపాన్‌లు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అంచనా ధరల హెచ్చుతగ్గుల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఏఎంఐసీ ప్రకటించింది.

ఈ ఉత్పత్తులకు మంచి ధరలు 
ఖరీఫ్‌–2024–25 సీజన్‌ ఊపందుకుంటోంది. 149.32 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగవుతాయని అంచనా వేశారు. ఏఎంఐసీ అం­చనా ప్రకారం.. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తి­తో పోలిస్తే అపరాలు, మిరప, పసుపు, వేరుశనగ పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తాయి. ముఖ్యంగా కందులు, మినుములు, పెసలు రైతులకు మార్కెట్‌లో మంచి ధరలు దక్కుతాయి. 

తక్కువ ఉత్పత్తి ఖర్చు, స్థిరమైన దేశీయ గిరాకీ, డిమాండ్‌ కారణంగా ఈ పంటల రైతులు మంచి రాబడిని పొందే వీలుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా సన్నబియ్యం ఎగుమతు­లు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా ఈ రకాలు సాగు చేసే రైతులకు మంచి ధర లభిస్తుంది. 

మిగిలిన వరి రకాల ధరలు కూడా స్థిరంగానే ఉండనున్నాయని ఏఎంఐసీ అంచనా వేసింది. అలాగే బంగ్లాదేశ్, చైనా, వియత్నాం దేశాలకు గణనీయంగా మెరుగుపడిన ఎగుమతుల ద్వారా పత్తి ధరలు లాభదాయకంగా ఉంటాయని అంచనా. ఎగుమతులు పెరగడం, తక్కువ ఉత్పత్తి కారణంగా పసుపు ధరలు కూడా ఆశాజనకంగా ఉండబోతున్నాయి.

విత్తుకునే ముందు రైతులకు సమాచారం 
ప్రధాన పంట ఉత్పత్తులకు ముం­దస్తు ధరలను నిర్ణయించేటప్పుడు పంట నిల్వలు, సాగు విస్తీర్ణం, ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారుల అంచనాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఏటా రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంట ఉత్పత్తుల ముందస్తు అంచనా ధరలను అంచనా వేసి విత్తుకునే ముందు రైతులకు స్పష్టమైన సమాచారం అందిస్తున్నాం. విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలను సంప్రదించి పంటసాగు నిర్ణయాలను తీసుకునేలా ఏఎంఐసీ రైతులకు అవసరమైన తోడ్పాటునందిస్తోంది.  – డాక్టర్‌ జి.రఘునాథ్‌రెడ్డి, ప్రధాన పరిశోధకులు, వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌  

కచ్చితమైన సమాచారంతోనే రైతుకు మేలు 
ప్రస్తుతం పంటల మార్కెట్‌ ధరలు.. డిమాండ్‌ సరఫరా సూత్రంతో పాటు స్థానికత, దేశ అవసరాలు, విదేశాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. రైతులకు సకాలంలో ఖచి్చతమైన మార్కెట్‌ సమాచారాన్ని అందించడం కీలకం. పంటల ఉత్పత్తి సరఫరా కంటే మార్కెట్‌ ఆధారిత డిమాండ్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. 

స్వాతంత్య్రం వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగినప్పటికీ.. మెజార్టీ రైతులకు నేటికీ నికర ఆదాయం దక్కని పరిస్థితి నెలకొంది. ఏపీ తరహాలోనే ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా అగ్రికల్చర్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ను కలిగి ఉండాలి. ఖచి్చతమైన సమాచారంతో పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతత్వం పెరుగుతుంది.. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది.      – డాక్టర్‌ శారద జయలక్ష్మీదేవి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement