
నాలుగు రాష్ట్రాల్లో సీజన్ మొదలవడంతో పెద్దఎత్తున వస్తున్న సరుకు
దీంతో భారీగా పతనమైన ధర
పలమనేరులో 15 కిలోల బాక్సు ధర రూ.150 మాత్రమే
టమాటాను కొంటున్నట్లు ప్రభుత్వం బిల్డప్
కానీ, మార్కెట్‌కు వచ్చే సరుకు కొండంత.. సర్కారు కొనేది గోరంత
పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో టమాటా రైతులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ నష్టాలు చవిచూస్తున్నారు. ధరలు భారీగా పతనమవడమే ప్రధాన కారణం. పలమనేరు టమాటా మార్కెట్‌లో శనివారం 15 కిలోల బాక్సు రూ.140 నుంచి రూ.150 వరకు పలికింది. అంటే.. కేజీ రూ.10 మాత్రమే. దీంతో భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు.
మరోవైపు.. టమాట పండించే రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలోనూ సీజన్ మొదలవడంతో భారీగా టమాటాలు ఆయా రాష్ట్రాల మార్కెట్లకు చేరుతున్నాయి. అలాగే, పొరుగునే ఉన్న అనంతపురం సరుకు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతోంది. దీంతో ధరలు అమాంతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
అయితే.. టమాట రైతును ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ రెండ్రోజులుగా టమాటాను కొని రైతుబజార్లకు విక్రయిస్తున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ నిజానికి ఎలాంటి సాయం చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులను ఆదుకునేది ఇలాగేనా?
రాష్ట్రంలోని టమాటా రైతులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ టమాటాలను కొంటుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు చెప్పారు. కానీ, మార్కెటింగ్ అధికారులు మాత్రం శుక్రవారం మొక్కుబడిగా కొని శనివారం కొనలేదు.
అలాగే, పలమనేరు మార్కెట్‌కు రోజుకి 40–50 టన్నుల టమాటాలు వస్తుంటే ఇక్కడి అధికారులు శుక్రవారం కొన్న సరుకు కేవలం మూడు టన్నులే. పైగా.. పలమనేరు మార్కెట్‌లో శనివారం బాక్సు టమాట (15 కిలోలు) రూ.150 పలికింది. అంటే.. కిలో రూ.10 అన్నమాట. కానీ, మార్కెటింగ్ అధికారులు కిలో రూ.8తో కొన్నారు. ఇలాగేనా రైతులను ఆదుకునేదని వారు ప్రశ్నిస్తున్నారు.
మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమాట సాగుచేయాలంటే రూ.1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. పంట బాగా పండితే ఎకరానికి 800 బాక్సులు దిగుబడి రావచ్చు. ఇప్పుడున్న ధరతో రాబడి ఏముంటుంది నష్టాలు తప్ప? దీనికోసం మళ్లీ అప్పులు చేయాల్సిందే. టమాటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– మునివెంకటరెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం
అంతా కొనడం కుదురుతుందా!?
ఇక్కడి మార్కెట్‌లో కిలో రూ.8–రూ.10 రేటుతో మూడు టన్నులు కొని రైతుబజార్‌కు పంపాం. ఈ మార్కెట్‌కు నిత్యం 50 టన్నుల లోకల్ సరుకు, మరో 40 టన్నుల అనంతపురం సరుకు వస్తోంది. ఇదంతా కొనేందుకు కుదురుతుందా అని చూస్తున్నాం. అనంతపురం సరుకు తగ్గుముఖం పట్టగానే మార్చి 15 నుంచి ఇక్కడి సరుకు పెరుగుతుంది. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. – సంజీవకుమార్, ఏఏంసీ సెక్రటరీ, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment