కరువు కాలం!
- ఖరీఫ్ రైతుకు ‘ఎల్‌నినో’ బెంగ...!
- ఈ ఏడాది తప్పక ఉంటుందన్న శాస్త్రవేత్తలు
- 2009 మాదిరి వర్షాకాలంలోనూ ఎండలు
- లెక్కతప్పుతున్న తొలకరింపు..
- పంట చేతికొచ్చేవరకు అనుమానమే
నర్సీపట్నం: తొలకరి చినుకు పలకరింపు ఆలస్యంతో ఖరీఫ్ ఆలస్యమయ్యేలా ఉంది. సకాలంలో రుతువపనాలు అనుకూలిస్తే వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరినారు పోతలు పూర్తవ్వాలి. ఇది కేవలం 2వేల హెక్టార్లకే పరిమితమైంది. ఇవే పరిస్థితులు కొనసాగితే పంట చేతికొచ్చే వరకు అనుమానమే అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 20వేల హెక్టార్లలో చెరకు, నువ్వులు, అపరాలతో పాటు ఉద్యాన పంటలైన కూరగాయలు ప్రస్తుతం సాగవుతున్నాయి.
మృగశిర కార్తెతో తొలకరి జల్లులు అనుకూలిస్తాయని రైతులు ఆశపడ్డారు. కానీ ఈ ఏడాది ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. 40 డిగ్రీలకు మించి ఎండలు కాయడంతో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.27లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు.
జిల్లా సాధారణ విస్తీర్ణం 2.03లక్షల హెక్టార్లు. వాతావరణం అనుకూలిస్తే మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. లక్ష హెక్టార్లకు మించి వరి చేపట్టాలని భావించారు. మిగిలిన విస్తీర్ణంలో ప్రధానంగా చెరకు 40వేలు, రాగులు 25వేలు, చిరు ధాన్యాలు 16,500, గంటి 6వేలు, మొక్కజొన్న 6,500 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా అవసరమైన విత్తనాలను ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు రైతులు నారుమళ్లకు సిద్ధం చేసుచేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు. దీని ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో ఎండ తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు మే నెలాఖరుకు కేరళకు రావాల్సిన రుతుపవనాల్లో వేగం తగ్గినట్టు వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.
2009లోనూ జిల్లాలో ఇవే పరిస్థితులు నెలకొని ఖరీఫ్ ప్రణాళిక తారుమారైంది. అప్పట్లో వేసిన నారుమళ్లు సైతం ఎండిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. వర్షాలు అనుకూలించాక ఎద పద్ధతిలో అప్పట్లో వరి పంటను చేపట్టాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఈ ఏడాది పునరావృతమయ్యే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో అధికశాతం వర్షాధార భూములు కావడంతో ఎల్‌నినో ప్రభావంతో ప్రధానంగా ఖరీఫ్ వరికి నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు వరకు నారుమళ్లు వేసే పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఖరీఫ్ వరిసాగు గట్టెక్కే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.