ఉరి‘హారమే’!
మెతుకు సీమలో రైతుల గావుకేకలు
ఆత్మహత్యలపై సర్కారు నిర్లక్ష్యం
గతేడాది 113 మంది బలవన్మరణం
18 బాధిత కుటుంబాలకే అందిన పరిహారం
పునర్విచారణపై అమలుకాని హైకోర్టు ఆదేశాలు
పోరాటానికి సిద్ధమవుతున్న బాధిత కుటుంబాలు
సాక్షి, సంగారెడ్డి:
అన్నదాతలు వ్యవసాయంలో ఓడి బలిపీఠం ఎక్కుతున్నారు. మెతుకు సీమలో రైతుల గావుకేకలు మార్మోగుతున్నాయి. గతేడాది జిల్లాలో 113 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే.. గడిచిన 20 రోజుల్లోనే 5 మంది బలవన్మరణం చెందారు. కర్షకుడి ఆత్మహత్యతో పెద్దదిక్కును కోల్పోయి తీవ్ర విషాదంతో బతుకీడుస్తున్న బాధిత కుటుంబాలపై సర్కారు దయ చూపడం లేదు. కాగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించడానికి ఆర్డీఓల నుంచి కలెక్టర్ కార్యాలయానికి ఇంకా ప్రతిపాదనలే రాకపోవడం గమనార్హం. బాధిత కుటుంబాలను అదుకోడానికి వైఎస్ ప్రభుత్వం 2004 జూన్ 1న జీవో నెం.421 జారీ చేసింది. దీని ప్రకారం రూ.లక్ష పరిహారంతో పాటు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అప్పులు తీర్చడానికి రూ.50 వేలను ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందించాల్సి ఉంది. ఆర్డీఓ/సబ్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎస్పీ, ఏడీఏలు సభ్యులుగా ఉండే కమిటీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి పరిహారానికి సిఫారసు చేయాలి.
అధికారులు అడ్డగోలు విచారణలతో అనర్హులని తేల్చేసి బాధిత కుటుంబాలు పరి హారానికి దూరం చేస్తున్నారు. అధికారులు ఏళ్ల తరబడి విచారణలను సా..గదీస్తుండగా, ఆతర్వాతైనా పరిహారం విడుదల చేయడానికి సర్కారుకు చేతులు రావడం లేదు. గత తేడాది 113 మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడితే కేవ లం 18 బాధిత కుటుంబాలకే పరిహారం అందింది. సర్కారు పెట్టిన కఠిన పరీక్షలన్నింట్లో నెగ్గి అర్హత సాధించిన కొద్ది కుటుంబాలకు సైతం పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ఏళ్ల తరబడి నాన్చుతోంది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో గత ఏడాదంతా పాత కేసులపై పునర్విచారణ జరిపిన జిల్లా యంత్రాంగం డిసెంబర్ నెలలో 238 బాధిత కుటుంబాలకు రూ.లక్ష రూపాయల పరిహారం మంజూరు చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అప్పులు తీర్చుకోడానికి ఈ కుటుంబాలకు ఇంకా 50 వేల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడమే మిగిలిన పరిహారం చెల్లించలేదు. నిధులు విడుదల చేయాలని పలుమార్లు కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేకుండాపోయింది.
తిరస్కరణ లేఖలేవి ?
రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టు 26 నవంబర్ 2013న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 10 వారాల్లోగా విచారణ పూర్తి చేసి అర్హులకు పరిహారం అందించాలని సూచించింది. జీవో 421 అమలులో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ రైతు రక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు దాఖలు చేసిన పిల్‌పై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. 2004-2013 మధ్యకాలంలో చోటు చేసుకున్న 1007 రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరపాలని సంబంధిత కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కేవలం 238 కేసులకు మాత్రమే జిల్లా యంత్రాంగం పరిహారం చెల్లించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం అర్జీలు తిరస్కరిస్తే సంబంధిత కుటుంబాలకు రాతపూర్వకంగా కారణాలు తెలపాల్సి ఉంది. కానీ, ఎక్కడా తిరస్కరణ లేఖలు జారీ చేసిన దాఖలాలు లేవు.
లక్ష సంతకాల సేకరణ
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ జిల్లాలో లక్ష సంతకాల సేకరణ చేపట్టనున్నాం. ఈ నెల 24న మెదక్‌లో బాధిత కుటుంబాలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పునర్విచారణ, పరిహారం చెల్లింపుపై హైకోర్టు ఆదేశాల అమలుకాకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నాం. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
- పాకాల శ్రీహరిరావు, తెలంగాణ రైతు రక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు