రఘునాథపాలెం/కొత్తగూడెం రూరల్/వట్‌పల్లి (అందోల్): రాష్ట్రంలో వేర్వేరుగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మూలగూడెంకు చెందిన రైతు మాలోత్ సతీశ్(23) గతేడాది మిర్చి, పత్తి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు. ఈ ఏడాది మిర్చి వేయగా, నష్టం రావటంతో పత్తి సాగు చేశాడు. వరుసగా తెచ్చిన పెట్టుబడులు రూ.8 లక్షల వరకు పేరుకుపోవడంతో వాటిని ఎలా తీర్చాలని మదనపడుతూ ఈనెల 22న ఇంట్లో ఉన్న కలుపు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారానికి చెందిన రైతు తోడేటి నవీన్ (25) గతేడాది పత్తి, వరి పంటలు తీవ్ర నష్టాన్ని మిగల్చడంతో రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాదీ పంటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో నవీన్ సోమవారం సాయంత్రం పొలంలోనే పురుగుల మందు తాగి మరణించాడు.
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పోతులగూడకి చెందిన పగిడిపల్లి వీరేశం (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న ఐదెకరాలతోపాటు మరో ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. కౌలు, పత్తి సాగు, కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.10 లక్షల అప్పు చేశాడు. పత్తి పంట చేతికందే సమయంలో కురిసిన వర్షాలతో పంట దెబ్బతింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వీరేశం.. పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు
కరెంట్‌షాక్‌తో రైతు మృతి
రాయపర్తి: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యాతండాకు చెందిన రైతు మూనావత్ లాలు(42) కరెంట్ షాక్‌తో మంగళవారం మృతి చెందాడు. లాలు తనకున్న ఆరు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. పది రోజుల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు గురికావడంతో మోటార్లు నడవటం లేదు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. ఈ క్రమంలో స్థానిక హెల్పర్ సహాయంతో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి జంపర్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment