సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
ఖరీఫ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాటిల్లిన పంట నష్టాన్ని అధికారులు తేల్చారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు పంటలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించిన అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇదిలా ఉండగా, వ్యవసాయశాఖ అంచనా కంటే పంట దిగుబడి ఒక శాతం అధికంగా సాగైంది. వరి 54,456 హెక్టార్లు అంచనా కాగా 52,251, సోయాబీన్ 73,500 హెక్టార్లకు 1,19,907, పత్తి 3,23,281కు 3,89,252 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అయితే మూడు నెలలు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలో పత్తి, సోయాబీన్, వరి పంటలు దెబ్బతిన్నాయి.
సోయాబీన్ మొలకెత్తడంతో క్వింటాల్‌కు రూ.3,200 కూడా ధర పలకలేదు. వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పత్తి పంట మునిగింది. ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయశాఖలు పంట నష్టంపై సర్వే నిర్వహించాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూరు, సిర్పూరు, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, జైపూర్, బెల్లంపల్లి, భీమిని, దండేపల్లితోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలపై అధికారులు సర్వే నిర్వహించి పంట నష్టం తేల్చారు.
మూడు అంశాలు ప్రాతిపదికగా నివేదిక..
గతేడాది ఖరీఫ్‌లో అనావృష్టి.. ఈసారి అతివృష్టి.. మొత్తంగా రైతులను రెండు సీజన్లు నిండా ముంచాయి. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని నివేదిక పంపిన అధికారులు, అదే నివేదికలో జిల్లాలో కరువు పరిస్థితులు లేవని పేర్కొన్నారు. గత ఖరీఫ్‌లో 5.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవగా, అధికంగా 3.67 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. కరెంట్ కోతలు, వర్షాభావంతో 2.68 లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం రెండు విడతల్లో 52 మండలాలను కరువు మండలాలుగా దశలవారీగా ప్రకటించింది. అయితే ఈసారి జిల్లాలో అతివృష్టి కారణంగా పంట నష్టం ఉన్నా, వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో కరువు లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఆయిల్ సీడ్స్‌పై వర్షాభావ ప్రభావం పడింది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం వర్షపాతం ఏడాదిలో ఒక మండలంలో సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్లు ఉంటే.. అందులో 15 శాతం లోటు ఉండాలి. 750 నుంచి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం స్థానంలో 20 శాతం లోటు ఉండాలి. అదేవిధంగా ప్రధాన పంటలు సాగు కావాల్సిన సాధారణ విస్తీర్ణంలో సగంలోపే పంటలే వేసి ఉండాలి. దిగుబడి 50 శాతం లోపే వస్తుందని అంచనా వేస్తే వాటి ని పరిగణలోకి తీసుకోవాలని నిబంధనలు చెప్తున్నాయి. ఈ మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకుంటే జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైనందున కరువు జాబితాలో జిల్లా మండలాలను చేర్చలేకపోయామని అధికారవర్గాలు చెప్తున్నాయి. కాగా, వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు మాత్రమే ఐఏవై వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
పంటనష్టంపై ప్రభుత్వానికి అధికారుల నివేదిక
Published Tue, Dec 3 2013 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement