నష్టాల దిగుబడి | Yield losses | Sakshi
Sakshi News home page

నష్టాల దిగుబడి

Published Thu, Nov 13 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

నష్టాల దిగుబడి

నష్టాల దిగుబడి

రైతు పేరు నారాయణ నాయక్. తుగ్గలి మండలం చెరువుతండా వాసి. తనకున్న 11 ఎకరాల్లో ఈ ఏడాది వేరుశనగ సాగు చేశాడు. ఎకరాకు రూ.12 వేలు ప్రకారం రూ.1.32 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం క్వింటాకు రూ.3000 నుంచి రూ.3,500 వరకు ధర లభిస్తోంది. ఎకరాకు కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి వస్తే గిట్టుబాటు అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలతో ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు.
 
 ఈయన పేరు సూర్యనారాయణ. తుగ్గలి మండలం రామలింగాయపల్లిలో మూడు ఎకరాల్లో  ఆముదం  సాగు చేశాడు. విత్తనం వేసినప్పటి నుంచి వర్షాలు సరిగా పడలేదు. పైరు ఎదుగుదల కోసం ఎకరాకు రూ.9 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. కనీసం ఎకరాకు 4 క్వింటాళ్లు వస్తే కొంతమేర గిట్టుబాటు అవుతుంది. కానీ దిగుబడి క్వింటంలోపే వస్తోంది. దీంతో ఆ రైతు లబోదిబోమంటున్నాడు.

 
 కర్నూలు(అగ్రికల్చర్): ఏటా అదే తంతు.. ముందుస్తుగా ఊరించిన వర్షాలు తరువాత మొండికేయడం.. చేతికొచ్చిన పంట చేలోనే ఎండిపోవడం.. ఈ ఏడాదీ అదే జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో 6,76,803 హెక్టార్లలో వివిధ పంటలు సాగు అయ్యాయి. ఇందులో వర్షాధారం కింద 5.86 లక్షల హెక్టార్లు సాగు చేశారు. జూన్ నుంచి సెప్టెంబర్  వరకు సాధారణ వర్షపాతం 443.9 మి.మీ ఉండగా, 313.8 మి.మీ మాత్రమే నమోదు అయింది. అక్టోబర్ నెలలో కూడా సాధారణ కంటే తక్కువగానే వర్షం కురిసింది. దీంతో  ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిని పోయాయి.

ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. అధికారులు.. పంట నష్టాన్ని గుర్తించి జిల్లాలో  34 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం సగటున పత్తిలో 8 క్వింటాళ్లు,  వేరుశనగలో 2 క్వింటాళ్లు, మొక్కజొన్నలో  10 క్వింటాళ్లు, కొర్రలో 3 క్వింటాళ్లు, ఆముదంలో 3 క్వింటాళ్లు ప్రకారం దిగుబడులు వస్తున్నాయి.

 ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,94,999 హెక్టార్లలో పత్తి సాగు కావడం గమనార్హం.  పత్తిలో రూ.30 వేలు, వేరుశెనగలో  రూ.15 వేలు, మొక్కజొన్నలో రూ.16 వేలు, కొర్రలో రూ.9 వేలు, ఆముదంలో  రూ.10 వేలు ప్రకారం ఎకరాకు పెట్టుబడి పెట్టారు. పత్తిలో కనీసం 15 క్వింటాళ్లు, వేరుశనగలో  5 క్వింటాళ్లు, మొక్కజొన్నలో 20 క్వింటాళ్లు, కొర్రలో  10 క్వింటాళ్లు ఆముదంలో ఆరు క్వింటాళ్లు దిగుబడి వస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఆ స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రైతుకు నష్టాలు తప్పడం లేదు.

 గిట్టుబాటు ధరలు కరువు...
 దిగుబడులు తగ్గినప్పుడు ధరలు ఆశాజనకంగా ఉంటే రైతులకు కొంత ఊరట లభిస్తుంది.  కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. పత్తి  కనీస మద్దతు ధర రూ.4,050 ఉన్నా.. మార్కెట్‌లో కేవలం రూ.3000 నుంచి రూ.3,500 వరకు మాత్రమే లభిస్తోంది. వేరుశనగ క్వింటాలుకు రూ.2,500 నుంచి  రూ.3,500 వరకు మాత్రమే ధర లభిస్తోంది. మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.1,310 ఉండగా, మార్కెట్‌లో రూ.1000 కూడా లభించడం లేదు.

మొక్కజొన్నను ఎంఎస్‌పీతో కొనుగోలు చేసేందుకు నందికొట్కూరు, శ్రీశైలం  నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా  నామమాత్రంగానే విక్రయాలు జరుగుతున్నాయి. కొర్ర, ఆముదం ధరలు నేలచూపు చూస్తున్నాయి. దాదాపు అన్ని పంటలకు ధరలు లేనందున ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్‌పీతో  కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 పంటల బీమా లేక రైతులకు మరింత నష్టం...
 ఈసారి రైతులు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న పంటల బీమా లేకుండాపోయింది. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ అతీగతీ లేకపోవడంతో బ్యాంకర్లు పంట  రుణాలు నామమాత్రంగానే ఇచ్చాయి. ఖరీఫ్‌లో  పంట రుణాల  పంపిణీ లక్ష్యం రూ.2034 కోట్లు  కాగా, కేవలం రూ.435 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటే సహజంగా పంటల బీమా వర్తిస్తుంది.

ప్రభుత్వం పుణ్యమా అని ఈసారి 90 శాతం రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. పంటలు పూర్తిగా కోల్పోయిన పంటల బీమా కింద పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడటం గమనార్హం. 2013 ఖరీఫ్ పంటల బీమా  పరిహారం కూడా ప్రభుత్వమే తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

 జిల్లా మొత్తాన్నికరువు ప్రాంతంగా ప్రకటించాలి
 జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా మెట్ట పంటలు సాగు అయ్యాయి. జూన్ నెల నుంచి వర్షాభావ  పరిస్థితులతో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు సగటున రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కానీ పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమాని ఈసారి బ్యాంకులు పంట రుణాలు కూడా ఇవ్వలేదు. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి. ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రకారం పరిహారం చెల్లించాలి.
  -జగన్నాథం, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement