కర్నూలు: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు 8.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్రంలోని 13 జిల్లాల జేడీఏలు, కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ(క్రీడ) శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖరీఫ్‌లో 14.90 లక్షల హెక్టార్లకు సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 8 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరో 19.5 లక్షల టన్నులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఏడాదీ తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తెలుస్తోందన్నారు. ఏప్రిల్ నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో కొంత మేర వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందన్నారు. మే నెలలో వాతావరణ శాఖ మరోసారి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.