కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌లో పంటలసాగు నిరాశనే మిగిల్చింది. ఈ ఖరీఫ్‌లో అరకొరగా సాగుచేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త ఊపిరిపోశాయి. పంటలు పచ్చబడుతున్నాయి. దీంతో అన్నదాత ఆశలకు మోసులెత్తాయి. ఆశించినంత కాకపోయినా కొంతవరకు పంటచేతికి వస్తుందని రైతులు అనుకుంటున్నారు. కొన్ని మండలాల్లో అరకొర పదనుకు పంటలు సాగు చేయగా ఎదుగుబొదుగు లేకుండా నేలబారు చూపులతో ఉండడంతో రైతులు సాగుచేసిన పంటలపై ఆశలు వదులుకున్నారు. మరికొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు. దీంతో పంటలు సాగుచేయలేక బీళ్లుగా ఉంచారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,20,374 హెక్టార్లు ఉంది. ఇందులో 1,90,374 హెక్టార్లలో ఈ ఖరీఫ్‌లో వివిధ రకాల పంటలను రైతులు సాగుచేస్తారని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు 38173 హెక్టార్లకు మించి సాగుకాలేదు. ఇంకా 152201 హెక్టార్లలో ఎలాంటి పంటలు వేయకపోవడంతో పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు పడుతున్న వర్షాలకు రైతులు పెసర, మినుము,పొద్దుతిరుగుడు, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేయడానికి సిద్ధపడుతున్నారు.
ఈ వర్షాలు పంట ఎదుగుదలకే సరిపోతాయి..
జూన్‌లో 69 మి.మీకిగాను 60.9 మి.మీ, జూలై నెలలో 96.7 మి.మీకిగాను 85.2 మి.మీ, ఆగస్టు నెలలో 114 మి.మీకిగాను 47.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు పంటలకు తాత్కాలిక ఉపశమనమేనని రైతులు అంటున్నారు. పంట ఎదుగుదల వరకే ఈ వర్షాలు సరిపోతాయని రైతులు అంటున్నారు. మళ్లీ ఒకసారి వర్షాలు కురుస్తేనే పంట చేతికందుతుందని అంటున్నారు.
ప్రధాన పంటల సాగు అంతంత మాత్రమే!
జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వేరుశనగ, వరి కాగా ఇప్పటి వరకు వేరుశనగ వర్షాధారం, బోరుబావుల కింద సాధారణ సాగు విస్తీర్ణం 91964 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 16429 హెక్టార్లలోను, వరి సాధారణం 45476 హెకార్లుకాగా, కేవలం 3814 హెకార్లలోనే సాగైంది.
ఆగస్టు నెల ప్రతిపాదనలు....
ఈ నెలలో పడే వర్షాలకు పంటలు సాగు చేసుకునే రైతులకు కావాల్సిన విత్తనాల కోసం ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర శాఖకు పంపామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహులు తెలిపారు. ఇం దులో కందులు 400 క్వింటాళ్లు, ఆముదాలు 500 క్వింటాళ్లు, ఉలవలు 1000 క్వింటాళ్లు, అలసందలు 550 క్వింటాళ్లు, పెసలు 1200 క్వింటాళ్లు, మినుములు 1200 క్వింటాళ్లు, జొన్నలు 1000 క్విం టాళ్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పొందుపరచి పంపించామన్నారు.
పంటలకు ఊపిరి
Published Sat, Aug 17 2013 4:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement