సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలో ఖరీఫ్ పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడ్డ ఉపాధి పనులు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. ఖరీఫ్ ముగిసిన నేపథ్యంలో పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 511 గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ వార్షిక ప్రణాళికలో నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 250 గ్రామాల్లో మాత్రమే పనులు మొదలు కాగా, 261 గ్రామాల్లో అసలు పనుల జాడ లేకపోవడం గమనార్హం.
10 మందిపై వేటు..
ఉపాధి పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా నీటి యాజమాన్య సీరియస్‌గా తీసుకుంది. విధి నిర్వహణలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహాయ ప్రాజెక్టు అధికారితో పాటు క్షేత్ర సహాయకులపై వేటు వేసింది.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితం వికారాబాద్, శంకర్‌పల్లి, మర్పల్లి మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆశ్చర్యపోయారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలువురు క్షేత్ర సహాయకులు గైర్హాజరు కావడాన్ని గమనించారు. అలా విధుల్లో అలసత్వంగా వ్యవహరిస్తున్న తొమ్మిది మంది క్షేత్ర సహాయకులతో పాటు ఓ సహాయ ప్రాజెక్టు అధికారిని సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి 20వేల మంది కూలీలకు పని కల్పించాల్సి ఉండగా.. ప్రస్తుతం 8వేల మంది మాత్రమే కూలీలకు మాత్రమే ఉపాధి పనులు చేపడుతున్నారు.
పని కల్పించకుంటే వేటు తప్పదు: డ్వామా పీడీ
ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పని కల్పించకుండా అలసత్వం వహిస్తే వెంటనే 040-23230380, 81, 82 లేదా 9701451845 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు మొదలు పెట్టాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
పత్తాలేని ‘ఉపాధి’
Published Mon, Dec 16 2013 11:45 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement
Advertisement