project director
-
ఐసీడీఎస్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్ కావలెను
నెల్లూరు (వేదాయపాళెం): మహిళా శిశు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆశాఖకు జిల్లాలో ప్రాజెక్ట్ డైరెక్టర్ నియామకం రెండేళ్ల నుంచి జరుపకపోవటంతో ఇన్‌చార్జిలే దిక్కుగా మారుతోంది. ఫలితంగా ఆశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. వరుసగా ఇతర మాతృశాఖల అధికారులను ఐసీడీఎస్‌కు ఇన్చార్జిలుగా నియమించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇన్చార్జిల పాలనతో ఐసీడీఎస్‌కు గ్రహణం పట్టినట్లైంది. మాతృశాఖల పర్యవేక్షణలకు వారు ప్రాధాన్యత నివ్వటంతో ఎంతో కీలకమైన ఐసీడీఎస్‌ను పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆయా సందర్భాల్లో ఇన్చార్జిలుగా కొనసాగుతూ వస్తున్న అధికారులు మొక్కుబడిగా విధులకు పరిమితమవుతున్నారు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పూర్వప్రాథమిక విద్యను విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లక్ష్యాలను చేరుకోలేకుంది. అశాఖలోని వివిధ పథకాల అమలు సజావుగా సాగే పరిస్థితి కానరావటంలేదు. మహిళా శిశు సంక్షేమానికి రూ.కోట్లు విడుదల అవుతున్నప్పటికీ వాటి సద్వినియోగం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 3,454 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 320 మిని అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 17 ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో మూడేళ్ల లోపు పిల్లలు 89,856 మంది, 3 నుంచి ఆరేళ్ల పిల్లలు 82,736 మంది ఉన్నారు. అలాగే బాలింతలు 17,786 మంది, గర్భిణీలు 18,943 మంది ఉన్నారు.వీరికి ప్రభుత్వ పరంగా లబ్ధి చేకుర్చే విషయంలో పర్యవేక్షణ ఎంతో కీలకం. ఇన్చార్జిల పరంపర రెండేళ్ల క్రితం రెగ్యులర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి బదిలీ అనంతరం అప్పటి డ్వామా పీడీ ఇప్పటి నెల్లూరు ఆర్డీఓ డి,హరితను ఇన్చార్జిగా నియమించారు. ఆమె ఆరు నెలల పాటు ఇన్చార్జిగా కొనసాగారు. ఆనంతరం మంత్రి నారాయణ జోక్యంతో తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్‌గా, అలాగే ఐసీడీఎస్ ఇన్చార్జిగా ఏకకాలంలో నియమించారు. ఆమె ఎడాదికిపైగా ఇన్చార్జిగా కొనసాగారు. గత నెల చివరి వారంలో అనంతపురంకు బదిలీ అయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న కమలకుమారిని నెల్లూరు జేసీ–2గా పదోన్నతి కల్పిస్తూ నియమించారు. అలాగే ఐసీడీఎస్‌కు ఇన్చార్జిగా నియమించారు. ఈమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఐదు రోజుల తరువాత మొక్కుబడిగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ట్ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి కాసేపు అందరిని పలకరించి సమీపంలో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి వెళ్లారు. అప్పటి నుంచి కార్యాలయానికి వచ్చిన దాఖలాలులేవు. ఐసీడీఎస్ కార్యాలయం ఫైల్స్‌ను కార్యాలయ అధికారులను జేసీ–2 చాంబర్‌కు తెప్పించుకుని నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయకపోగా సీడీపీఓలతో సమావేశం ఏర్పాటు చేయలేదు. కమలకుమారికి ఐసీడీఎస్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టడంపై తొలి నుంచి నిరాసక్తతగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల తనను ఐసీడీఎస్ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా మంత్రి నారాయణను కమలకుమారి కోరినట్లు సమాచారం. అధిక పని ఒత్తిడి బాధ్యత ఉన్న ఐసీడీఎస్‌కు శాశ్వత పీడీని నియమించటంలో ఉన్నతాధికారులు ఎందుకు మీనమేషలు లెక్కిస్తున్నారనేది ఆశాఖ అధికారులలో చర్యనీయంశంగా మారింది. ఐసీడీఎస్‌ని గాడిలో పెట్టేందుకు శాశ్వత ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించాల్సి అవసరం ఎంతైనా ఉంది. -
అమృతహస్తం..పరిమితం
ఒంగోలు టౌన్: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం నుంచి అన్న అమృతహస్తం పథకాన్ని ప్రారంభించాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లినప్పటికీ కొన్ని కేంద్రాలకే పరిమితమైంది. నిర్వహణ భారం తాము భరించలేమంటూ అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలు చేతులెత్తేశారు. బియ్యం, కందిపప్పు, వంటనూనె ఇస్తే కూరగాయలు, పాలు ఎక్కడ నుంచి తీసుకురావాలంటూ కొంతమంది అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. నెలల తరబడి వేతనాలు, బిల్లులు నిలిచిపోవడంతో తమకు డబ్బులు కూడా పుట్టడం లేదన్నారు. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉంటున్న తరుణంలో అమృతహస్తం ఏవి«ధంగా అమలు చేయాలో ప్రభుత్వమే చెప్పాలంటున్నారు. ముందు చూపేది? రెండున్నరేళ్ల నుంచి జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ ఆరు ప్రాజెక్టుల్లో పథకం మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. అమృతహస్తంకు అవసరమైన సరుకులు, వసతులు పూర్తి స్థాయిలో సమకూర్చలేదు. రెండున్నరేళ్లు అవుతున్నా ఈ పథకం ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి తరుణంలో శనివారం నుంచి జిల్లాలోని మిగిలిన పదిహేను ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకాన్ని ప్రారంభించాలని మహిళా శిశుసంక్షేమశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా కేంద్రానికి ఆదేశాలు వచ్చాయి. బాలారిష్టాలు ఎదుర్కొంటున్న ఈ పథకాన్ని బలవంతంగా మిగిలిన అన్ని ప్రాజెక్టులకు బదలాయించడంతో భారమంతా అంగన్వాడీలపై పడింది. కొత్తగా 15 ప్రాజెక్టుల పరిధిలోని 19615 మంది గర్భిణులు, 17580 మంది బాలింతలకు అన్న అమృతహస్తం ఎక్కడ నుంచి అందించాలని అంగన్వాడీలు వాపోతున్నారు. వేర్ ఈజ్ ద డోనర్స్: అమృతహస్తం పథకం అమలు కోసం అధికారులు, అంగన్వాడీలు డోనర్స్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించే ముందే అందుకు అవసరమైన వాటిని ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అయితే ఇదేమీ పట్టించుకోని ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించాలంటూ ఉన్నపలంగా ఆదేశాలు జారీ చేయడంతో అటు అధికారులతోపాటు ఇటు అంగన్వాడీలు కూడా ఏం చేయాలో తెలియక డోనర్స్ వెతుకులాటలో పడ్డారు. గర్భిణులు, బాలింతలను సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలకు రప్పించి వారికి మ«ధ్యాహ్న భోజనం అందించాలన్నది పథకం ఉద్దేశం. అయితే గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తే వారు కూర్చునేందుకు కుర్చీలు, భోజనం చేసేందుకు టేబుళ్లు లేవు. వీటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. దాంతో కుర్చీలు, టేబుళ్లు అందించే డోనర్స్ కోసం ప్రాజెక్టుల వారీగా జాబితా తయారు చేసే పనిలో సీడీపీవోలు, సూపర్వైజర్లు ఉన్నారు. అంగన్వాడీలు కూడా తమ పరిధిలో ఉన్న డోనర్స్‌ను గుర్తించి వారి జాబితాలను తమ సూపర్వైజర్లకు అందించే పనిలో నిమగ్నమయ్యారు. పంచాయతీలు కరుణిస్తేనే వంట పాత్రలు: పంచాయతీలు కరుణిస్తేనే అంగన్వాడీ కేంద్రాలకు పూర్తి స్థాయిలో వంటపాత్రలు సమకూరుతాయి. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు పౌష్టికాహారం కింద చిన్నచిన్న వంట పాత్రలు వాడుతూ వచ్చారు. అయితే గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నం భోజనం అందించాల్సి ఉండటంతో ఒక్కో కేంద్రంలో ఎంత లేదన్నా పదిమందికి తక్కువగా ఉండరు. వారికి భోజనం అందించాలంటే పెద్ద వంటపాత్రలు అవసరమవుతాయి. వాటితోపాటు ప్లేట్లు, గ్లాసులు కూడా ఉండాలి. అమృతహస్తం పథకం అమలు చేసేందుకు వాటిని కొనుగోలు చేసేందుకు పంచాయతీ నిధులు విడుదల చేయాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీలు ఎప్పుడు నిధులు విడుదల చేస్తాయో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీలు నిధులు విడుదల చేస్తే వంటపాత్రలు, ఇతర సామగ్రిని కొనుగోలుచేసి అమృతహస్తం కింద గర్భిణులు, బాలింతలకు సౌకర్యవంతంగా మ««ధ్యాహ్న భోజనం అందిస్తారు. అప్పటి వరకు వారు భోజనం చేయాలంటే కష్టపడాల్సిందే. -
ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిసిన వినియోగదారుల మండలి
న్యూశాయంపేట : తల్లిపాలను వ్యాపార దృక్పథం తో భారతదేశంలో ఆహార నాణ్యత, భద్రత చట్టం 2006 (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పరిధిలోకి తేవాలా, వద్దా అనే అంశంపై కేంద్ర ప్ర భుత్వం వినియోగదారుల సంఘాల ద్వారా అభిప్రాయసేకరణ ప్రారంభిం చింది. దీనిలో భాగంగా జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో ఈ మేరకు ప్రతినిధులు సోమవారం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలిశారు. యూరప్, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో తల్లిపాల బ్యాంక్‌ల ద్వారా అవసరం ఉన్న పిల్లలకు తల్లిపాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మనదేశంలో కూడా తల్లిపాల సేకరణ తల్లిపాల బ్యాంకింగ్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టపరిధిలో స్టాండర్స్ ఏర్పరిచే నిమిత్తం తల్లిపాలను వ్యాపార దృక్పథంతో విధాన నిర్ణయాలు చేసే నిమిత్తం కేంద్రం అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర వినయోగదారుల మండలి సంస్థల సమాఖ్య ఉపాధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, మండలి ప్రతినిధి రావుల రంజిత్‌లు పీడీ ఐసీడీఎస్ శైలజాకుమారికి అభిప్రాయ సేకరణ సమాచారం, వినతిపత్రాన్ని ఇచ్చారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తమ అభిప్రాయా లు తెలపాలని మండలి ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి మాట వినాలి..!
విజయనగరంఫోర్ట్: వ్యవసాయశాఖలో అయోమయపరిస్థితి నెలకొంది. ఆశాఖను నడిపించే రథసారథిగా ఎవరిని నియమిస్తారో ప్రభుత్వం తేల్చకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. తాము ఎవరికింద పనిచేయాలో తెలియక సతమతవుతున్నారు. ఒకరు బదిలీ అయిన జాయింట్ డెరైక్టర్ మరొకరు జేడీగా పదోన్నతి బదిలీపై వచ్చినవారు. ఇక్కడ పనిచేసిన వ్యవసాయశాఖ జేడీ డి.ప్రమీలను శ్రీకాకుళం ఆత్మ ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఆశాఖ కమిషనర్ బదిలీ చేస్తూ గత నెల5వతేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జేడీ బదిలీల్లో ఆక్రమాలు జరిగాయని తమకు అన్యాయం జరిగిందని 13 జిల్లాలకు చెందిన జేడీలు పోరాటా లు చేస్తున్నారు. అయితే అధికశాతంమంది జేడీలు సెలవు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. బదిలీ అయినప్పటికీ విజయనగరం జేడీ ప్రమీల ఇంకా కొనసాగుతున్నారు. అయితే విశాఖపట్నంలో ఆత్మ డీపీడీగా పనిచేసిన జె.ఎస్.ఎన్ లీలావతికి ఇక్కడికి బదిలీ అయింది. ప్రమీలకు బదిలీ అవడంతో పూర్తిఅదనపు బాధ్యతలు కల్పిస్తూ జేడీగా లీలావతికి బాధ్యతలు అప్పగిస్తూ ఆశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె ప్రమీల రిలీవ్ అయితే జేడీ బాధ్యతలు స్వీకరించాలని భావిస్తూ ప్రస్తుతానికి డీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సిబ్బంది అవస్థలు బదిలీ అయినప్పటికి ఇంకా ప్రమీల జేడీ గా కొనసాగుతున్నారు. ఎప్పటి మాదిరి గా ఆమె ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. మరో వైపు బదిలీపై వచ్చిన లీలావతి చెప్పిన పనిచేయకపోతే ఆమె జేడీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనసులో పెట్టుకుని ఇబ్బంది పెడతారేమోనని ఉద్యోగులు లోలోన మధనపడుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులైతే మాశాఖలో అయోమయ పరిస్థితి ఉందని బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ అయోమయ పరిస్థితికిప్రభుత్వం తెరదించుతుందో, కొనసాగిస్తుందో వేచి చూడాలి. -
బిందు సేద్యంపై ప్రతిపాదనలు
ఏలూరు (టూటౌన్) : ఈ ఆర్థిక సంవత్సరంలో 40 వేల హెక్టార్లల్లో బిందు సేద్యం పథకం అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ప్రాజెక్టు డెరైక్టర్ ఎంబీ రామారావు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలనందించే బిందుసేద్యం విధానం ఉత్తమమైనదని, దీని ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఆయన శనివారం బిందు సేద్యానికి సంబంధించిన పలు అంశాలను తెలియజేశారు. పలు ప్రయోజనాలు బిందుసేద్యంతో 50 శాతం నీరు ఆదా అవుతుందని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయవచ్చని రామారావు తెలిపారు. ఒకే సమయంలో తోట మొత్తం నీరు అందించవచ్చన్నారు. చెట్లు, పాదుల్లో తేమ ఎక్కువ, తక్కువ కాకుండా సరిపడేంతగా ఉండటం వల్ల బాగా పెరుగుతాయన్నారు. బిందు సేద్యం వల్ల 40 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందన్నారు. రాత్రిపూట విద్యుత్ వచ్చినా సమృద్ధిగా తోటకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. నీటిపారుదల విధానాలు బిందు సేద్యంలో ఇన్లైన్ రకం, ఆన్లైన్ రకం అనే రెండు పద్ధతుల్లో డ్రిప్ ఉంటుందని ఆయన తెలిపారు. వీటిని పంటల రకం మొక్క, చెట్ల మధ్య దూరాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. బోరు బావి, విద్యుత్ సౌకర్యం, నీటి మోటారు కలిగిన ఉద్యాన, వ్యవసాయ, కూరగాయ పంటలు, పూల తోటలు, చెరకు, మల్బరీ, ఆయిల్‌పామ్ రైతులు ఎవరైనా ఈ పథకానికి అర్హులన్నారు. దరఖాస్తు చేసుకొనేది ఇలా బిందు సేద్యం పథకంలో డ్రిప్, స్ట్రింక్లర్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దగ్గరలోని మీ-సేవ కేంద్రంలో 1 బీఫారం లేదా టైటిల్‌డీడ్ నకళ్లు తహసిల్దారు సంతకంతో ఇవ్వాలన్నారు. టైటిల్ డీడ్ లేని పక్షంలో రిజిస్టర్ అయిన భూమి డాక్యుమెంట్ కాపీతో పాటు పదేళ్ల ఈసీ జత పరచాలన్నారు. ఎఫ్ఎంబీ కాపీని వీఆర్వోతో ధ్రువీకరించి ఇవ్వాలన్నారు. నీటి భాగస్వామ్య పత్రం వీఆర్వోతో సర్టిఫై చేయించి మట్టి, నీటి నమూనాల పరీక్షల విశ్లేషణ పత్రాన్ని జతపరుస్తూ మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తును రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. రాయితీలు బిందు సేద్యం పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాలకు లోబడి రూ. లక్ష వరకు రాయితీ ఉంటుందన్నారు. చిన్నసన్నకారు రైతులకు ఐదు ఎకరాలు లోబడి యూనిట్ ధరలు రూ. లక్షకు 90 శాతం రాయితీ ఇస్తారన్నారు. ఐదు ఎకరాల నుంచి ఎంత భూమి ఉంటే అంతకు రైతులందరికి యూనిట్ ధరలో రూ. 2లక్షల వరకు 50 శాతం రాయితీ అమలవుతుందన్నారు. గతంలో రాయితీ పొందిన సర్వే నెంబర్లో ఉన్న పొలం కాకుండా అదే సర్వే నెంబరులో ఉన్న మిగిలిన పొలానికి కాని, మరొక సర్వే నెంబరులో ఉన్న పొలంలో కాని డ్రిప్, స్ట్రింక్లర్ల పరికరాలు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ పొందవచ్చన్నారు. -
ఇరుకు గదుల్లో ఇక్కట్లు..
‘గుడ్లు, బియ్యం, నూనె ఇవ్వడం కన్నా రోజూ భోజనం పెడితే బాగుంటుంది. ఇరుకు గదుల్లో పిల్లలతో కలిసి కూర్చోవాలన్నా, ఆరోగ్య సమస్యలు చెప్పుకోవాలన్నా నానా తిప్పలు పడుతున్నాం’ అంటూ బాలింతలు, గర్భిణులు, పిల్లల తల్లులు స్త్రీ, శిశుసంక్షేమశాఖ (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.విజయలక్ష్మికి మొరబెట్టుకున్నారు. జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 5,143 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 86,721 మంది గర్భిణులు, బాలింతలు, 85,935 మంది 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులు, 1,46,780 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. వారి ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్న ‘సాక్షి’ మీడియా..ఆ బాధ్యతను నిర్వర్తిం చాలని కోరగా ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి శనివారం ‘వీఐపీ రిపోర్టింగ్’ చేశారు. ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి (స్వామినగర్‌లో) : ఇక్కడ బాధ్యులెవరు? ఎంత మంది పిల్లలుండాలి? ఇప్పుడెంత మంది ఉన్నారు? ఆ హాజరు పట్టీ ఇలా ఇవ్వండి. అంగన్వాడీ వర్కర్ భాగ్యలక్ష్మి : 15 మంది ఉన్నారు మేడమ్. 30 మంది పిల్లలుండాలి. తల్లులు వచ్చి తీసుకువెళ్లారు మేడమ్. పీడీ : మరి నీవేం చేస్తున్నావు? ఆటా, పాటా అన్నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? వర్కర్ : పాటలు నేర్పిస్తున్నాను, వాళ్లు పాడుతున్నారు మేడమ్. పీడీ : ఏమమ్మా నీ పేరేమిటి? నీకు ఎన్నో నెల? ఈ అంగన్వాడీ కేంద్రం ఎలా పనిచేస్తోంది? ఆహారం బాగా అందిస్తున్నారా? బాలింత : నాపేరు పద్మండీ. ఎనిమిదో నెలండీ. వారానికి నాలుగు గుడ్లు ఇస్తున్నారు. కేంద్రం బాగానే ఉంది. రెండు టీటీ ఇంజక్షన్లు కూడా చేశారు. పీడీ : మీకు బియ్యం, నూనె, కందిపప్పు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మీకెవరైనా చెప్పారా? బాలింత : బరువు పెరగడానికే కదండీ.. ఎవరూ చెప్పలేదు మేడమ్! పీడీ : మీ బరువు పెరగడానికి కాదు తల్లీ.. కడుపులో ఉన్న బిడ్డ బరువు, పెరిగి ఆరోగ్యంగా ఉంటుందని. అశ్రద్ధ చేయకండి సుమా. బాలింత : సరే మేడమ్! పీడీ : నీ పేరేమిటి, ఏమైనా సమస్యలున్నాయా? బాలింత : అనురాధండీ. మేడమ్! పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో చిన్ని గదిలో చాలా ఇరుకిరుగ్గా కూర్చుంటున్నారండీ. కనీసం వెలుతురు కూడా రావడం లేదు. పీడీ : పిల్లలందరికీ సరిపోయేలా కొత్త భవనం నిర్మించేందుకు అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపిస్తాను. పీడీ : ఏవమ్మా నీ పేరేమిటి, పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారు? పిల్లలంతా వస్తున్నారా? బాలింత : దేవి మేడమ్. పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు కానీ.. వాళ్లు ఆడుకోవడానికి కేంద్రంలో అవకాశం కనిపించడం లేదండీ. మీరే ఏదైనా చేయాలి. పీడీ : పిల్లల ఇబ్బందులు నేను కూడా చూశాను కదా. మీరు చెప్పినట్టే ప్రీ స్కూల్ పిల్లల కోసం కాస్త విశాలంగా ఉండే గది ఏర్పాటు చేయిస్తాను. వారు ఆడుకోవడానికి కూడా ఏదైనా చూద్దాం మరి. (మరొకరిని ఉద్దేశించి) నీ పేరేమిటి? ఏదైనా చెప్పదలుచుకున్నావా, పర్లేదు చెప్పమ్మా. నీ పేరు కేంద్రంలో నమోదు చేసుకున్నారా? క్రమం తప్పకుండా ఏఎన్ఎం చెకప్చేస్తున్నారా, లేదా? బాలింత : రామలక్ష్మి మేడమ్. పేరు నమోదు చేసుకున్నారు. ఏఎన్ఎం వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు కానీ మేడమ్.. వారానికి నాలుగు గుడ్లు, కందిపప్పు, బియ్యం కాకుండా మాకు ప్రతి రోజు భోజనం పెట్టే ఏర్పాటు చేయండి చాలు. పీడీ : మంచి ఐడియా ఇచ్చావు తల్లీ. అది నా పరిధిలో ఉండదమ్మా. కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. పీడీ : ఏమ్మా బియ్యం, కందిపప్పు, నూనె ఎంతెంత ఇస్తున్నారు? అన్ని సక్రమంగానే అందుతున్నాయా? భయపడకుండా చెప్పండి. ఒకేసారి నాలుగు గుడ్లు ఉడికించి ఇస్తున్నారా లేక మామూలు గుడ్లు ఇస్తున్నారా. బాలింత : అన్నీ ఇస్తున్నారు మేడమ్. గుడ్లు ఉడికించి వారానికి నాలుగు ఇస్తున్నారు. పీడీ: నీ పేరేటమ్మా, నీకు ఎన్నో నెల, కేంద్రం ఎలా పనిచేస్తోంది, అన్ని సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా తేడాలున్నాయా? బాలింత : లావణ్య మేడమ్. ఎనిమిదో నెలండీ. బియ్యం, నూనె సక్రమంగానే అందుతున్నాయి. పీడీ: మీరెవరు? ఇప్పుడు వచ్చారేమిటి? సూపర్వైజర్: మేడమ్.. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇటీవలే జాయిన్ అయ్యాను.. అందుకే ఆలస్యమైంది మేడమ్. పీడీ (కాకినాడ అర్బన్ ముత్తానగర్‌లో) : ఏమమ్మా నీ పేరేమిటి, పౌష్టికాహారం బాగా అందుతోందా? బాలింత : కావేరి అండీ. గర్భిణులకు పండ్లు, పాలు, డ్రైప్రూట్స్ వంటివి సరఫరా చేయాలి. పౌష్టికాహారంగా ఇస్తున్న బియ్యం, పప్పు, నూనె వారం రోజులకు కూడా సరిపోవడం లేదండీ. నెలలో 20 రోజులకు సరిపడా పౌష్టికాహారం అందించేలా చూడండి మేడమ్. పీడీ : ప్రభుత్వం నుంచి అందే పౌష్టికాహారం పూర్తిగా అందేలా చూస్తాను. నెలలో 20 రోజుల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానమ్మా. (మరొకరిని ఉద్దేశించి):నీ పేరేమిటమ్మా, ఏమైనా సమస్యలున్నాయా? బాలింత : గౌరి అండీ. పక్కా భవనం లేక గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలతో పాటు కూర్చుని ఆరోగ్యసమస్యలు తెలుసుకుందామంటే ఇబ్బందమ్మా. నెలవారీ ఇంజక్షన్లు అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా మున్సిపల్ స్కూలుకు వెళ్లి చేయించుకుంటున్నామమ్మా. పీడీ : మీ సమస్య అర్థమైంది. సొంత భవనాల విషయంపై చర్యలు తీసుకుంటాను. (మరో మహిళతో) నీ సమస్య ఏమిటమ్మా? మహిళ : మణి అండీ. నాలుగేళ్ల మా బాబు గౌతమ్ కిరణ్ రెండుకాళ్లూ చచ్చుబడిపోయాయి. నడవలేడు, మాట్లాడలేడు. చాలా మంది డాక్టర్లకు చూపించానమ్మా. క్రమేపీ నడుస్తాడని చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. పిల్లవాడికి పౌష్టికాహారం అందించలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ కేంద్రం ద్వారా ఇస్తున్న ఫుడ్ తీసుకొని పెడుతున్నాను. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలమ్మా. పీడీ : అధికారులకు నివేదించి సాధ్యమైనంత వరకు సాయమందేలా చూస్తాను. పొద్దుపోతోంది వెళ్లొస్తా... - ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, అనుసూరి ఆనందరావు, పళ్ల రమేష్‌బాబు అన్ని కేంద్రాలకూ శాశ్వత భవనాలు.. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్నీ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్ది అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేదే మా లక్ష్యం. దశలావారీగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉన్నాం. 2013-14 లో 372 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు మంజూరు చేశాం. 2014-15లో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న కేంద్రాలకు అనువైన స్థలాలను సేకరిస్తున్నాం. ఐదేళ్లలో జిల్లాలోని అన్ని కేంద్రాలకూ పక్కా భవనాలు నిర్మించాలనేది లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే పట్టణాల్లో ఇప్పుడిస్తున్న రూ.3వేలను త్వరలో రూ.5 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది. గ్రామాల్లో ఇంటి అద్దె కింద రూ.750 ఇస్తున్నాం. మానసిక వికలాంగులైన విద్యార్థులను గుర్తించి, అవసరమైన వైద్యసాయంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని బిడ్డకు, తల్లికి అందజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న బియ్యం, పప్పులను మర ఆడించి నూనె కలుపుకొని తింటే గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా తయారవుతారు. తల్లి కడుపులోని బిడ్డకు ఏ విధమైన పౌష్టికాహార లోపం రాకూడదన్న ఉద్దేశంతో వారానికి అందజేస్తున్న నాలుగు గుడ్లు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే తల్లులు తినాలి. అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారాన్ని అందజేయకుంటే నా దృష్టికి తీసుకురండి. - పి.విజయలక్ష్మి, పీడీ -
మాతృశాఖకు డీఆర్డీఏ పీడీ జ్యోతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ జ్యోతికి రీపేట్రియేట్ (మాతృ సంస్థకు పం పుతూ) ఉత్తర్వులొచ్చాయి. డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న ఆమెను బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, మాతృ శాఖకు పంపించి వేయాలని ఆ ఉత్తర్వుల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రిలీవైన తర్వాత ఎన్విరాన్మెంట్, ఫారెస్టు స్టేట్ హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాలని జ్యోతికి సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు కలెక్టర్ వద్ద ఉంది. రిలీవింగ్ విషయంలో ఆయన నిర్ణయం తీసుకోవల్సి ఉంది. వాస్తవానికి రీ పేట్రియేట్ ఉత్తర్వులు ఈ ఏడాది ఫిబ్ర వరిలో కూడా వచ్చాయి. కానీ అప్పట్లో ఎన్నికల దృష్ట్యా, ఆమె సేవలు ఇక్కడ అవసరమని అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. దీంతో అప్పట్లో కొనసాగడానికి అవకాశమిచ్చారు. సరిగ్గా ఆరు నెలలకు అటవీశాఖ మళ్లీ రీపేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్డీఏ పీడీగా 2012 డిసెంబర్ 27న జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సామాజిక అటవీశాఖ డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్‌గా పని చేశారు. సాధారణంగా ఫారెన్ సర్వీసులో భాగంగా వేరే శాఖల్లో ఐదేళ్లు వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ కారణమేంటో తెలియదు గాని జ్యోతి విషయంలో రెండోసారి రీపేట్రియేట్ ఉత్తర్వులు రావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, రీపేట్రియేట్ ఉత్తర్వుల విషయమై డీఆర్డీఏ పీడీ జ్యోతి వద్ద ‘సాక్షి ప్రతినిధి’ ప్రస్తావించగా ఎన్విరాన్మెంట్, ఫారెస్టు నుంచి రీ పేట్రి యేట్ ఉత్తర్వులు కలెక్టర్‌కు రావడం వాస్తవమేనని, కాకపోతే ప్రస్తుతం రూరల్ డెవలప్మెంట్ కంట్రోల్లో పని చేస్తున్నందున వారి నుంచి కూడా ఉత్తర్వులు రావల్సి ఉందని తెలిపారు. ఆర్డీ ఉత్తర్వులొచ్చిన తర్వాత వేరొకరికి బాధ్యత లు అప్పగించి, తనను రిలీవ్ చేసే చేసే అవకాశం ఉందని చెప్పారు. -
‘శ్రవణం’పై నీలినీడలు
బెలాను ఉల్లంఘిస్తున్న టీటీడీ కొత్త కో-ఆర్డినేటర్‌ను నియమించే ప్రయత్నాలు తిరుపతి: బాల్యం నుంచే వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు వినికిడి లోపాలను సరిచేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రవణం(బాలవిద్యాలయ) ప్రాజెక్ట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లూ ప్రాజెక్ట్ నిర్వహణ భారాన్ని మోసిన చెన్నైకి చెందిన బాలవిద్యాలయ డెరైక్టర్ సరస్వతీనారాయణస్వామిని శ్రవణం కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించిన టీటీడీ యాజమాన్యం ట్రస్ట్ బైలాస్కు విరుద్ధంగా స్థానికంగా పలుకుబడి గలిగిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ట్రస్ట్ బైలాస్ ప్రకారం శ్రవణం ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా మహిళలను నియమించాల్సి ఉంది. అందుకు భిన్నంగా సిఫార్సులకు లొంగి మగవారిని డెరైక్టర్‌గా నియమించే పనిలో టీటీడీ నిమగ్నమైంది. తిరుపతికి చెందిన ఒక ఈఎన్టీ వైద్య నిపుణుడిని శ్రవణం కోఆర్డినేటర్‌గా నియమించనున్నట్లు తెలిసింది. అయితే అందుకు విరుద్ధంగా మహిళలను కాదని, మగవారిని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా నియమించే ప్రతిపాదనను పలువురు వ్యతిరేకిస్తున్నారు. 2006 డిసెంబర్ 15న అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి శ్రవణం ప్రాజెక్ట్‌ను ప్రారంభించి ప్రాజెక్ట్ నిర్వహణకు టీటీడీ రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. వినికిడి లోపం ఉన్న బాలల సంక్షేమానికి పాటుపడుతున్న చెన్నైకి చెందిన బాలవిద్యాలయానికి శ్రవణం నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. శ్రవణం ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి అవసరమైన ఉపాధ్యాయినుల నియామకం, వారికి జీతభత్యాల చెల్లింపు బాధ్యతలు ఆ సంస్థకే అప్పగించి నిర్వహణ ఖర్చులతో కలిపి టీటీడీ రీయింబర్స్ చేసేలా 2006 డిసెంబర్ 5న ఎంవోయూపై సంతకాలు జరిగాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన బాలవిద్యాలయానికి మంచి ఆదరణ ఉండడంతో మహబూబ్‌నగర్, విశాఖపట్నాలలో సబ్‌సెంటర్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి 2012 ఏప్రిల్ 3న జరిగిన సమావేశంలో తీర్మానాన్ని (నెం,24) కూడా ఆమోదించింది. సరస్వతీనారాయణస్వామి నేతృత్వలో శ్రవణం నిర్వహణ తీరును టీటీడీ ఉన్నతాధికారులు మెచ్చుకున్న సందర్భాలు, విమర్శలు వెలువడినప్పుడు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. చిన్న, చిన్న లోపాలు ఉన్నా ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించేందుకు ఆమె చిత్తశుద్ధితో కృషి సాగించారు. ప్రస్తుతం బాలవిద్యాలయలో సుమారు 220 మంది వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు. కోఆర్డినేటర్‌ను మారిస్తే ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది అంతా మహిళలే అయినందున శ్రవణం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా అనుభవం ఉన్న టీ టీడీ సెంట్రల్ ఆస్పత్రి రిటైర్డ్ మహిళా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. లేకుంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ప్రాజెక్ట్(బాలవిద్యాలయం)ను పూర్తిస్థాయిలో టీటీడీనే నిర్వహించాలని కోరుతున్నారు. -
ఉచితంగా ఓపెన్ జిమ్
న్యూఢిల్లీ: లోధీ గార్డెన్లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మంగళవారం ప్రారంభించారు. ఇదే తరహాలో మరికొన్ని ఓపెన్‌జిమ్‌లను మరో 28 చోట్ల ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఎన్డీఎంసీ ప్రాజెక్టు డెరైక్టర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. ‘ఓపెన్ జిమ్‌లు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలనేదే మా ఆలోచన. తొలుత వీటిని ఉద్యానవనాల్లో ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలనీలతోపాటు పేవ్‌మెంట్లపైనా ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్లలోని పరికరాల వినియోగానికి విద్యుత్ అవసరమే లేదు. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. ఒక్కొక్క జిమ్ ఏర్పాటుకు రూ. 5.5 లక్షల వ్యయం అవుతోంది. ఇలా ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయ డం ఇదే తొలిసారి. జిమ్‌కు వెళ్లే స్తోమత అందరికీ ఉండదు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే మా లక్ష్యం. ఏ వయసు వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. జిమ్‌లకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లు ఇష్టపడరు. అయితే వారు కేవలం మార్నింగ్ వాక్కు మాత్రమే వస్తారు. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటువల్ల వాటిని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. వారు వాకింగ్‌తో పాటు వ్యాయామంవైపు కూడా ఇకమీదట దృష్టి సారిస్తారు’ అని అన్నారు. కాగా సెంట్రల్ పార్కు (కన్నాట్‌ప్లేస్), సంజయ్ పార్కు, తాల్కటోరా స్టేడియం, నెహ్రూ పార్కు, ఎన్డీఎంసీ క్లబ్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 40 లక్షల నిధుల్ని కేటాయించింది. వీటి ఏర్పాటుకు అనువైన పేవ్మెంట్ల కోసం ఎన్డీఎంసీ అన్వేషిస్తోంది. లోధీ గార్డెన్‌కు సందర్శకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. -
పత్తాలేని ‘ఉపాధి’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలో ఖరీఫ్ పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడ్డ ఉపాధి పనులు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. ఖరీఫ్ ముగిసిన నేపథ్యంలో పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 511 గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ వార్షిక ప్రణాళికలో నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 250 గ్రామాల్లో మాత్రమే పనులు మొదలు కాగా, 261 గ్రామాల్లో అసలు పనుల జాడ లేకపోవడం గమనార్హం. 10 మందిపై వేటు.. ఉపాధి పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా నీటి యాజమాన్య సీరియస్‌గా తీసుకుంది. విధి నిర్వహణలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహాయ ప్రాజెక్టు అధికారితో పాటు క్షేత్ర సహాయకులపై వేటు వేసింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితం వికారాబాద్, శంకర్పల్లి, మర్పల్లి మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆశ్చర్యపోయారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలువురు క్షేత్ర సహాయకులు గైర్హాజరు కావడాన్ని గమనించారు. అలా విధుల్లో అలసత్వంగా వ్యవహరిస్తున్న తొమ్మిది మంది క్షేత్ర సహాయకులతో పాటు ఓ సహాయ ప్రాజెక్టు అధికారిని సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి 20వేల మంది కూలీలకు పని కల్పించాల్సి ఉండగా.. ప్రస్తుతం 8వేల మంది మాత్రమే కూలీలకు మాత్రమే ఉపాధి పనులు చేపడుతున్నారు. పని కల్పించకుంటే వేటు తప్పదు: డ్వామా పీడీ ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పని కల్పించకుండా అలసత్వం వహిస్తే వెంటనే 040-23230380, 81, 82 లేదా 9701451845 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు మొదలు పెట్టాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. -
పనిచేసినా పస్తులే!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: వలసలు నివారించి..కూలీలకు స్థానికం గా పనులు క ల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. చేసిన పనులకు మూ డు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కూలీలు పూట గడవకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పథకం ప్రారంభం నుంచీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదు. మన జిల్లాలో రూ.13 కోట్ల రూపాయలను కూలీలకు చెల్లిం చాల్సి ఉంది. రోజూ కూలికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితుల్లో జిల్లాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించి కడుపులు మాడిపోకుండా చూడాలని కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్‌కు రోజు వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నా ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కూలీలకు స కాలంలో పంపిణీ చేసేందుకు అధికారులు చ ర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిధులే విడుదల కాకపోతే ఏం చేయాలంటూ వారు ఆవేదన చెందడం తప్ప కూలీలకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అయోమయం ఉపాధి పనుల కోసం 7,85,927 కుటుంబాల కు జాబ్ కార్డులు జారీ చేశారు. మూడు, నాలు గు నెలల క్రితం వరకు జిల్లాలో ప్రతిరోజూ 70 నుంచి 80 వేల మంది కూలీలు ఉపాధి పనుల కోసం వెళ్లేవారు. బిల్లులు నిలిపేయడంతో ఉ పాధి పనులు అడిగేవారే లేకుండా పోయారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం మూడువేల మందికి మించి పనులకు వెళ్లడం లేదు. ఇదిలాఉండగా గతంలో పనులు మంజూరై ఇప్పటివరకు పూర్తికాని వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి పథకం ద్వారా మం జూరైన పండ్ల మొక్కల పెంపకం, వ్యక్తిగత మ రుగుదొడ్ల నిర్మాణం కోసం మంజూరైన పనులు మినహా మిగిలిన పనులన్నీ రద్దు చేయాలని ప్ర భుత్వం నిర్ణయింది. దీంతో జిల్లాలో 1.50 లక్ష ల పనులను గుర్తించి వాటిని ఈనెల 15వ తేదీ వరకు రద్దు చేసేందుకు జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత కొత్తగా పను లు అడిగే వారికి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల్లో కూలీలకు డబ్బు చెల్లిస్తాం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన కూలీలకు 15 రోజుల్లో డబ్బు చెల్లిస్తాం. నిధుల మంజూరు సమస్య తలెత్తడంతో దాదాపు రెండున్నర నెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. విడతల వారీగా డబ్బులు చెల్లించేందుకు ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం.. - వెంకటరమణారెడ్డి, డ్వామా పీడీ