ఏలూరు (టూటౌన్) : ఈ ఆర్థిక సంవత్సరంలో 40 వేల హెక్టార్లల్లో బిందు సేద్యం పథకం అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ప్రాజెక్టు డెరైక్టర్ ఎంబీ రామారావు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలనందించే బిందుసేద్యం విధానం ఉత్తమమైనదని, దీని ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. ఆయన శనివారం బిందు సేద్యానికి సంబంధించిన పలు అంశాలను తెలియజేశారు.
పలు ప్రయోజనాలు
బిందుసేద్యంతో 50 శాతం నీరు ఆదా అవుతుందని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయవచ్చని రామారావు తెలిపారు. ఒకే సమయంలో తోట మొత్తం నీరు అందించవచ్చన్నారు. చెట్లు, పాదుల్లో తేమ ఎక్కువ, తక్కువ కాకుండా సరిపడేంతగా ఉండటం వల్ల బాగా పెరుగుతాయన్నారు. బిందు సేద్యం వల్ల 40 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందన్నారు. రాత్రిపూట విద్యుత్ వచ్చినా సమృద్ధిగా తోటకు నీరు అందించే అవకాశం ఉందన్నారు.
నీటిపారుదల విధానాలు
బిందు సేద్యంలో ఇన్‌లైన్ రకం, ఆన్‌లైన్ రకం అనే రెండు పద్ధతుల్లో డ్రిప్ ఉంటుందని ఆయన తెలిపారు. వీటిని పంటల రకం మొక్క, చెట్ల మధ్య దూరాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. బోరు బావి, విద్యుత్ సౌకర్యం, నీటి మోటారు కలిగిన ఉద్యాన, వ్యవసాయ, కూరగాయ పంటలు, పూల తోటలు, చెరకు, మల్బరీ, ఆయిల్‌పామ్ రైతులు ఎవరైనా ఈ పథకానికి అర్హులన్నారు.
దరఖాస్తు చేసుకొనేది ఇలా
బిందు సేద్యం పథకంలో డ్రిప్, స్ట్రింక్లర్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దగ్గరలోని మీ-సేవ కేంద్రంలో 1 బీఫారం లేదా టైటిల్‌డీడ్ నకళ్లు తహసిల్దారు సంతకంతో ఇవ్వాలన్నారు. టైటిల్ డీడ్ లేని పక్షంలో రిజిస్టర్ అయిన భూమి డాక్యుమెంట్ కాపీతో పాటు పదేళ్ల ఈసీ జత పరచాలన్నారు. ఎఫ్‌ఎంబీ కాపీని వీఆర్వోతో ధ్రువీకరించి ఇవ్వాలన్నారు. నీటి భాగస్వామ్య పత్రం వీఆర్వోతో సర్టిఫై చేయించి మట్టి, నీటి నమూనాల పరీక్షల విశ్లేషణ పత్రాన్ని జతపరుస్తూ మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తును రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.
రాయితీలు
బిందు సేద్యం పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాలకు లోబడి రూ. లక్ష వరకు రాయితీ ఉంటుందన్నారు. చిన్నసన్నకారు రైతులకు ఐదు ఎకరాలు లోబడి యూనిట్ ధరలు రూ. లక్షకు 90 శాతం రాయితీ ఇస్తారన్నారు. ఐదు ఎకరాల నుంచి ఎంత భూమి ఉంటే అంతకు రైతులందరికి యూనిట్ ధరలో రూ. 2లక్షల వరకు 50 శాతం రాయితీ అమలవుతుందన్నారు. గతంలో రాయితీ పొందిన సర్వే నెంబర్‌లో ఉన్న పొలం కాకుండా అదే సర్వే నెంబరులో ఉన్న మిగిలిన పొలానికి కాని, మరొక సర్వే నెంబరులో ఉన్న పొలంలో కాని డ్రిప్, స్ట్రింక్లర్ల పరికరాలు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ పొందవచ్చన్నారు.
బిందు సేద్యంపై ప్రతిపాదనలు
Published Sun, Aug 9 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM
Advertisement