అమృతహస్తం..పరిమితం
ఒంగోలు టౌన్:
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం నుంచి అన్న అమృతహస్తం పథకాన్ని ప్రారంభించాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లినప్పటికీ కొన్ని కేంద్రాలకే పరిమితమైంది. నిర్వహణ భారం తాము భరించలేమంటూ అనేక మంది అంగన్‌వాడీ కార్యకర్తలు చేతులెత్తేశారు. బియ్యం, కందిపప్పు, వంటనూనె ఇస్తే కూరగాయలు, పాలు ఎక్కడ నుంచి తీసుకురావాలంటూ కొంతమంది అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు. నెలల తరబడి వేతనాలు, బిల్లులు నిలిచిపోవడంతో తమకు డబ్బులు కూడా పుట్టడం లేదన్నారు. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉంటున్న తరుణంలో అమృతహస్తం ఏవి«ధంగా అమలు చేయాలో ప్రభుత్వమే చెప్పాలంటున్నారు.
ముందు చూపేది?
రెండున్నరేళ్ల నుంచి జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ ఆరు ప్రాజెక్టుల్లో పథకం మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. అమృతహస్తంకు అవసరమైన సరుకులు, వసతులు పూర్తి స్థాయిలో సమకూర్చలేదు. రెండున్నరేళ్లు అవుతున్నా ఈ పథకం ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి తరుణంలో శనివారం నుంచి జిల్లాలోని మిగిలిన పదిహేను ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకాన్ని ప్రారంభించాలని మహిళా శిశుసంక్షేమశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా కేంద్రానికి ఆదేశాలు వచ్చాయి. బాలారిష్టాలు ఎదుర్కొంటున్న ఈ పథకాన్ని బలవంతంగా మిగిలిన అన్ని ప్రాజెక్టులకు బదలాయించడంతో భారమంతా అంగన్‌వాడీలపై పడింది. కొత్తగా 15 ప్రాజెక్టుల పరిధిలోని 19615 మంది గర్భిణులు, 17580 మంది బాలింతలకు అన్న అమృతహస్తం ఎక్కడ నుంచి అందించాలని అంగన్‌వాడీలు వాపోతున్నారు.
వేర్ ఈజ్ ద డోనర్స్:
అమృతహస్తం పథకం అమలు కోసం అధికారులు, అంగన్‌వాడీలు డోనర్స్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించే ముందే అందుకు అవసరమైన వాటిని ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అయితే ఇదేమీ పట్టించుకోని ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించాలంటూ ఉన్నపలంగా ఆదేశాలు జారీ చేయడంతో అటు అధికారులతోపాటు ఇటు అంగన్‌వాడీలు కూడా ఏం చేయాలో తెలియక డోనర్స్ వెతుకులాటలో పడ్డారు. గర్భిణులు, బాలింతలను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు రప్పించి వారికి మ«ధ్యాహ్న భోజనం అందించాలన్నది పథకం ఉద్దేశం. అయితే గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తే వారు కూర్చునేందుకు కుర్చీలు, భోజనం చేసేందుకు టేబుళ్లు లేవు. వీటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. దాంతో కుర్చీలు, టేబుళ్లు అందించే డోనర్స్ కోసం ప్రాజెక్టుల వారీగా జాబితా తయారు చేసే పనిలో సీడీపీవోలు, సూపర్‌వైజర్లు ఉన్నారు. అంగన్‌వాడీలు కూడా తమ పరిధిలో ఉన్న డోనర్స్‌ను గుర్తించి వారి జాబితాలను తమ సూపర్‌వైజర్లకు అందించే పనిలో నిమగ్నమయ్యారు.
పంచాయతీలు కరుణిస్తేనే వంట పాత్రలు:
పంచాయతీలు కరుణిస్తేనే అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తి స్థాయిలో వంటపాత్రలు సమకూరుతాయి. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు పౌష్టికాహారం కింద చిన్నచిన్న వంట పాత్రలు వాడుతూ వచ్చారు. అయితే గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నం భోజనం అందించాల్సి ఉండటంతో ఒక్కో కేంద్రంలో ఎంత లేదన్నా పదిమందికి తక్కువగా ఉండరు. వారికి భోజనం అందించాలంటే పెద్ద వంటపాత్రలు అవసరమవుతాయి. వాటితోపాటు ప్లేట్లు, గ్లాసులు కూడా ఉండాలి.
అమృతహస్తం పథకం అమలు చేసేందుకు వాటిని కొనుగోలు చేసేందుకు పంచాయతీ నిధులు విడుదల చేయాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీలు ఎప్పుడు నిధులు విడుదల చేస్తాయో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీలు నిధులు విడుదల చేస్తే వంటపాత్రలు, ఇతర సామగ్రిని కొనుగోలుచేసి అమృతహస్తం కింద గర్భిణులు, బాలింతలకు సౌకర్యవంతంగా మ««ధ్యాహ్న భోజనం అందిస్తారు. అప్పటి వరకు వారు భోజనం చేయాలంటే కష్టపడాల్సిందే.