ఇరుకు గదుల్లో ఇక్కట్లు.. | Project Director Vijaya Lakshmi with VIP Reporting | Sakshi
Sakshi News home page

ఇరుకు గదుల్లో ఇక్కట్లు..

Published Sun, Dec 28 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఇరుకు గదుల్లో ఇక్కట్లు..

ఇరుకు గదుల్లో ఇక్కట్లు..

 ‘గుడ్లు, బియ్యం, నూనె ఇవ్వడం కన్నా రోజూ భోజనం పెడితే బాగుంటుంది. ఇరుకు గదుల్లో  పిల్లలతో కలిసి కూర్చోవాలన్నా, ఆరోగ్య సమస్యలు చెప్పుకోవాలన్నా నానా తిప్పలు పడుతున్నాం’ అంటూ బాలింతలు, గర్భిణులు, పిల్లల తల్లులు స్త్రీ, శిశుసంక్షేమశాఖ (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.విజయలక్ష్మికి మొరబెట్టుకున్నారు. జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 5,143 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 86,721 మంది గర్భిణులు, బాలింతలు, 85,935 మంది 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులు, 1,46,780 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు ఉన్నారు. వారి ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్న ‘సాక్షి’ మీడియా..ఆ బాధ్యతను నిర్వర్తిం చాలని కోరగా ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి శనివారం ‘వీఐపీ రిపోర్టింగ్’ చేశారు.
 
 ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి (స్వామినగర్‌లో) : ఇక్కడ బాధ్యులెవరు? ఎంత మంది పిల్లలుండాలి? ఇప్పుడెంత మంది ఉన్నారు? ఆ హాజరు పట్టీ ఇలా ఇవ్వండి.
 అంగన్‌వాడీ వర్కర్ భాగ్యలక్ష్మి : 15 మంది ఉన్నారు మేడమ్. 30 మంది పిల్లలుండాలి. తల్లులు వచ్చి తీసుకువెళ్లారు మేడమ్.
 పీడీ : మరి నీవేం చేస్తున్నావు? ఆటా, పాటా అన్నీ పిల్లలకు నేర్పిస్తున్నావా?
 వర్కర్ : పాటలు నేర్పిస్తున్నాను, వాళ్లు పాడుతున్నారు మేడమ్.
 పీడీ : ఏమమ్మా నీ పేరేమిటి? నీకు ఎన్నో నెల? ఈ అంగన్‌వాడీ కేంద్రం ఎలా పనిచేస్తోంది? ఆహారం బాగా అందిస్తున్నారా?
 బాలింత : నాపేరు పద్మండీ. ఎనిమిదో నెలండీ. వారానికి నాలుగు గుడ్లు ఇస్తున్నారు. కేంద్రం బాగానే ఉంది. రెండు టీటీ ఇంజక్షన్‌లు కూడా చేశారు.
 పీడీ : మీకు బియ్యం, నూనె, కందిపప్పు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? మీకెవరైనా చెప్పారా?
 బాలింత : బరువు పెరగడానికే కదండీ.. ఎవరూ చెప్పలేదు మేడమ్!
 పీడీ : మీ బరువు పెరగడానికి కాదు తల్లీ.. కడుపులో ఉన్న బిడ్డ బరువు, పెరిగి ఆరోగ్యంగా ఉంటుందని. అశ్రద్ధ చేయకండి సుమా.
 బాలింత : సరే మేడమ్!
 పీడీ : నీ పేరేమిటి, ఏమైనా సమస్యలున్నాయా?
 బాలింత : అనురాధండీ. మేడమ్! పిల్లలు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్ని గదిలో చాలా ఇరుకిరుగ్గా కూర్చుంటున్నారండీ. కనీసం వెలుతురు కూడా రావడం లేదు.
 పీడీ : పిల్లలందరికీ సరిపోయేలా కొత్త భవనం నిర్మించేందుకు అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపిస్తాను.
 పీడీ : ఏవమ్మా నీ పేరేమిటి, పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందిస్తున్నారు? పిల్లలంతా వస్తున్నారా?
 బాలింత : దేవి మేడమ్. పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు కానీ.. వాళ్లు ఆడుకోవడానికి కేంద్రంలో అవకాశం కనిపించడం లేదండీ. మీరే ఏదైనా చేయాలి.
 పీడీ : పిల్లల ఇబ్బందులు నేను కూడా చూశాను కదా. మీరు చెప్పినట్టే ప్రీ స్కూల్ పిల్లల కోసం కాస్త విశాలంగా ఉండే గది ఏర్పాటు చేయిస్తాను. వారు ఆడుకోవడానికి కూడా ఏదైనా చూద్దాం మరి. (మరొకరిని ఉద్దేశించి)  నీ పేరేమిటి? ఏదైనా చెప్పదలుచుకున్నావా, పర్లేదు చెప్పమ్మా. నీ పేరు కేంద్రంలో నమోదు చేసుకున్నారా? క్రమం తప్పకుండా ఏఎన్‌ఎం చెకప్‌చేస్తున్నారా, లేదా?
 బాలింత : రామలక్ష్మి మేడమ్. పేరు నమోదు చేసుకున్నారు. ఏఎన్‌ఎం వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు కానీ మేడమ్.. వారానికి నాలుగు గుడ్లు, కందిపప్పు, బియ్యం కాకుండా మాకు ప్రతి రోజు భోజనం పెట్టే ఏర్పాటు చేయండి చాలు.
 పీడీ : మంచి ఐడియా ఇచ్చావు తల్లీ. అది నా పరిధిలో ఉండదమ్మా. కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను.
 పీడీ : ఏమ్మా బియ్యం, కందిపప్పు, నూనె ఎంతెంత ఇస్తున్నారు? అన్ని సక్రమంగానే అందుతున్నాయా? భయపడకుండా చెప్పండి. ఒకేసారి నాలుగు గుడ్లు ఉడికించి ఇస్తున్నారా లేక మామూలు గుడ్లు ఇస్తున్నారా.
 బాలింత : అన్నీ ఇస్తున్నారు మేడమ్. గుడ్లు ఉడికించి వారానికి నాలుగు ఇస్తున్నారు.
 
 పీడీ: నీ పేరేటమ్మా, నీకు ఎన్నో నెల, కేంద్రం ఎలా పనిచేస్తోంది, అన్ని సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా తేడాలున్నాయా?
 బాలింత : లావణ్య మేడమ్. ఎనిమిదో నెలండీ. బియ్యం, నూనె సక్రమంగానే అందుతున్నాయి.
 పీడీ: మీరెవరు? ఇప్పుడు వచ్చారేమిటి?
 సూపర్‌వైజర్: మేడమ్.. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఇక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాను. ఇటీవలే జాయిన్ అయ్యాను.. అందుకే ఆలస్యమైంది మేడమ్.
 పీడీ (కాకినాడ అర్బన్ ముత్తానగర్‌లో) : ఏమమ్మా నీ పేరేమిటి, పౌష్టికాహారం బాగా అందుతోందా?
 బాలింత : కావేరి అండీ. గర్భిణులకు పండ్లు, పాలు, డ్రైప్రూట్స్ వంటివి సరఫరా చేయాలి. పౌష్టికాహారంగా ఇస్తున్న బియ్యం, పప్పు, నూనె  వారం రోజులకు కూడా సరిపోవడం లేదండీ. నెలలో 20 రోజులకు సరిపడా పౌష్టికాహారం అందించేలా చూడండి మేడమ్.
 పీడీ : ప్రభుత్వం నుంచి అందే పౌష్టికాహారం పూర్తిగా అందేలా చూస్తాను. నెలలో 20 రోజుల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానమ్మా. (మరొకరిని ఉద్దేశించి):నీ పేరేమిటమ్మా, ఏమైనా సమస్యలున్నాయా?
 బాలింత : గౌరి అండీ. పక్కా భవనం లేక గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలతో పాటు కూర్చుని ఆరోగ్యసమస్యలు తెలుసుకుందామంటే ఇబ్బందమ్మా. నెలవారీ ఇంజక్షన్లు అంగన్‌వాడీ కేంద్రాల్లో కాకుండా మున్సిపల్ స్కూలుకు వెళ్లి చేయించుకుంటున్నామమ్మా.
 పీడీ : మీ సమస్య అర్థమైంది. సొంత భవనాల విషయంపై చర్యలు తీసుకుంటాను. (మరో మహిళతో) నీ సమస్య ఏమిటమ్మా?
 మహిళ : మణి అండీ. నాలుగేళ్ల మా బాబు గౌతమ్ కిరణ్ రెండుకాళ్లూ చచ్చుబడిపోయాయి. నడవలేడు, మాట్లాడలేడు. చాలా మంది డాక్టర్లకు చూపించానమ్మా. క్రమేపీ నడుస్తాడని చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. పిల్లవాడికి పౌష్టికాహారం అందించలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ కేంద్రం ద్వారా ఇస్తున్న ఫుడ్ తీసుకొని పెడుతున్నాను. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలమ్మా.
 పీడీ : అధికారులకు నివేదించి సాధ్యమైనంత వరకు సాయమందేలా చూస్తాను. పొద్దుపోతోంది వెళ్లొస్తా...
 - ప్రజెంటర్స్ :
 లక్కింశెట్టి శ్రీనివాసరావు,
 అనుసూరి ఆనందరావు, పళ్ల రమేష్‌బాబు
 
 అన్ని కేంద్రాలకూ శాశ్వత భవనాలు..
 ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్నీ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్ది అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేదే మా లక్ష్యం. దశలావారీగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉన్నాం. 2013-14 లో 372 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు మంజూరు చేశాం. 2014-15లో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న కేంద్రాలకు అనువైన స్థలాలను సేకరిస్తున్నాం. ఐదేళ్లలో జిల్లాలోని అన్ని కేంద్రాలకూ పక్కా భవనాలు నిర్మించాలనేది లక్ష్యం. అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే పట్టణాల్లో ఇప్పుడిస్తున్న రూ.3వేలను త్వరలో రూ.5 వేలకు పెంచే ప్రతిపాదన ఉంది. గ్రామాల్లో ఇంటి అద్దె కింద రూ.750 ఇస్తున్నాం. మానసిక వికలాంగులైన విద్యార్థులను గుర్తించి, అవసరమైన వైద్యసాయంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని బిడ్డకు, తల్లికి అందజేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇస్తున్న బియ్యం, పప్పులను మర ఆడించి నూనె కలుపుకొని తింటే గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా తయారవుతారు. తల్లి కడుపులోని బిడ్డకు ఏ విధమైన పౌష్టికాహార లోపం రాకూడదన్న ఉద్దేశంతో వారానికి అందజేస్తున్న నాలుగు గుడ్లు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే తల్లులు తినాలి. అంగన్‌వాడీ కార్యకర్తలు పౌష్టికాహారాన్ని అందజేయకుంటే నా దృష్టికి తీసుకురండి.
 - పి.విజయలక్ష్మి, పీడీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement