బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల | BRS Leader Keshava Rao To Join Congress Party Soon | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల

Published Fri, Mar 29 2024 1:02 AM | Last Updated on Fri, Mar 29 2024 7:04 AM

BRS Leader Keshava Rao To Join Congress Party Soon - Sakshi

బీఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత కె.కేశవరావు గుడ్‌బై 

సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం 

కేసీఆర్‌ను కలిసి తన అభిప్రాయం వెల్లడించిన కేకే

అసంతృప్తి వ్యక్తం చేయడంతో అర్థాంతరంగా బయటకు వచ్చేసిన సీనియర్‌ నేత

కేసీఆర్‌ భేటీ అనంతరం కేకే ఇంటికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

అల్లోలతో పాటు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌ కూడా కాంగ్రెస్‌ గూటికి!

రేపు రేవంత్‌ ఇంటికి కేకే

కాంగ్రెస్‌లోకి కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి కూడా

హఠాత్తుగా వరంగల్‌ లోక్‌సభ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య 

కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ!

కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం

హుటాహుటిన ఢిల్లీకి కడియం ఫ్యామిలీ

శ్రీహరి వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసే చాన్స్‌! 

వరుస నిష్క్రమణలతో గులాబీ దళంలో కలవరం 

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతిత్వరలో వెల్లడిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వరంగల్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థిని బీఆర్‌ఎస్‌ ప్రకటించాక కూడా బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 

బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు టికెట్‌ దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతుండటం, చివరకు టికెట్‌ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టిస్తోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో  తమ కుమార్తెలతో సహా బీఆర్‌ఎస్‌ను వీడనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.  

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్‌ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.



తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌లో చేరా
‘బీఆర్‌ఎస్‌లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌లో చేరా. కానీ కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్‌ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్‌ఎస్‌కు ఇంకా రిజైన్‌ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు.

నేను బీఆర్‌ఎస్‌లో ఉండి చేసేదేమీ లేదు
‘కేసీఆర్‌ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్‌ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు.

కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్‌ఎస్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్‌ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు.

నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్‌
పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్‌ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్‌కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్‌ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్‌ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్‌ తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే.

కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి
కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్‌ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. 

మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్‌
విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్‌ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్‌ పదవి ఇచ్చా.

మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement